నాకు షాపింగ్ అంటే ఇష్టం. అవసరం ఉన్నా లేకపోయినా, ఏదో ఒకటి కొనేస్తూ ఉంటాను. పండుగల సమయంలో అయితే, ముందూ వెనకా చూడకుండా ఖర్చు
పెడతాను. ఆ తర్వాత తీరిగ్గా బాధపడతాను. ఎందుకిలా? -ఓ సోదరి
ప్రతి మనిషికీ కొన్ని అలవాట్లు ఉంటాయి. ధూమపానం, మద్యపానం, దుబారా వంటి చెడు అలవాట్లు కావచ్చు. వ్యాయామం, వేళకు నిద్ర, పొదుపు వంటి మంచి అలవాట్లూ కావచ్చు. ప్రస్తుత
జీవన శైలి ప్రభావంతో, ఎక్కువమంది మంచి అలవాట్లవైపు మొగ్గు చూపడం లేదు. ఆర్థికంగా నిలదొక్కుకోవడం అన్నది చాలా అవసరం. ఆర్థిక కారణాలతో ఎంతోమంది మానసికంగా కుంగిపోతున్నారు. కుటుంబంతో సహా ఆత్మహత్యలు చేసుకుంటున్న కథనాలు వినిపిస్తూనే ఉన్నాయి. పొదుపు వల్ల కుటుంబానికి ఆర్థిక భద్రత ఉంటుంది. పొదుపు-మదుపు అలవర్చుకుంటే క్రమంగా ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి, మానసిక ప్రశాంతత లభిస్తుంది. అప్పులు చేయాల్సిన పరిస్థితి రాదు. క్రెడిట్ కార్డు బిల్లులు, పర్సనల్ లోన్ వాయిదాల సమస్య ఉండదు. ‘రేపటి కోసం ఈరోజు నుంచే ఎందుకు పొదుపు చేయాలి?’ అనుకుంటారు చాలామంది. రేపటి కోసం డబ్బు దాచి
పెడితేనే హఠాత్తుగా వచ్చే అత్యవసర ఖర్చులను ధైర్యంగా ఎదుర్కోవచ్చు. లాక్డౌన్ సమయంలో ఎంతోమంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇలాంటి పరిస్థితి ఎవరికైనా రావొచ్చు. కాబట్టి, ఖర్చు తర్వాత మిగిలితేనే పొదుపు చేద్దాం.. అన్న ధోరణిని వదిలిపెట్టాలి. ముందు పొదుపు-మదుపు. ఆపైన మిగిలిన మొత్తంతోనే షాపింగ్ అయినా, షికార్లు అయినా.. అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి.
సహానా రబీంద్రనాథ్
లైఫ్ కోచ్ అండ్ థెరపిస్ట్ SWITCH NOV
హైదరాబాద్