‘బతుకు జీవుల’ కథలున్నంత వరకు.. ‘బంధాల బండి’ సాగినంత వరకు.. గుండెల నిండా గుర్తుండిపోయేది.. మనసంతా మధుర జ్ఞాపకమై నిలిచేది బతుకమ్మ! ఇది ఒక పూల పండుగ మాత్రమే కాదు. అపూర్వ సమ్మేళనాల వేదిక. అవిభక్త బంధాల ఆత్మీయ కలయిక. తంగెడు పూలు.. గునుగు పూరెమ్మలు.. బొడ్డెమ్మ.. గౌరమ్మల స్మరణలతో సాగే పాటల పూదోట బతుకమ్మ. అవని అంతా అల్లిపూల వెన్నెలలో సేదతీరుతూ తీరొక్క రంగులను చూసి మురిసిపోయే కన్నుల పండుగ!
బతుకమ్మ పాట.. ఇప్పటిదాకా ఒక లెక్క. ఇప్పుడొక లెక్క. విశ్వమంతా వినాల్సిన.. తెలుసుకోవాల్సిన చరిత్ర బతుకమ్మది. పాటరూపంలో బతుకమ్మ ఖ్యాతిని ఖండాలు దాటించేందుకు ‘తెలంగాణ జాగృతి’ ఈసారి.. ‘అల్లిపూల వెన్నెల’తో వచ్చేసింది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్.. గిన్నిస్ రికార్డుల బతుకమ్మజతకలిసిన గీతం ఇది. మిట్టపల్లి సురేందర్ సాహిత్య వరుసలకు తగ్గట్టుగా, ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ డైరెక్షన్లో.. ‘ఎంగిలిపూల బతుకమ్మ’కు కానుకగా ‘అల్లిపూల వెన్నెల’ పాట విడుదలైన నేపథ్యంలో.. ప్రతీయేడు పాటలతో బతుకమ్మ ఖ్యాతిని విస్తరింపజేస్తున్న జానపద గాయనుల మది మెచ్చిన పాటల ముచ్చట్లు…
బతుకమ్మ పూల కోసం పరుగులు పెట్టిన రోజుల నుంచీ పాటలు నా జీవితంలో ఓ భాగం. పాటల ద్వారా ఈ ప్రకృతి పండుగ వైభవం తెలియడం నా అదృష్టం. ఎన్నో వందల పాటలు పాడిన నాకు బతుకమ్మ పాటలంటే ప్రత్యేక అభిమానం, నేను పాడిన బతుకమ్మ పాటల్లో ‘గంగమ్మా గౌరమ్మా కలిసేటి పండుగ వచ్చె..
నేలమ్మ నిండుగ పూసి బతుకమ్మకు ప్రాణంపోసె’ పాట నాకు చాలా ఇష్టం. ఈ పాట వింటున్న ప్రతీసారి నా బాల్యం గుర్తుకొస్తుంది.
పూలకు పూజచేసే గొప్ప పండుగ బతుకమ్మ. ఈ పండుగ నాకొక జ్ఞాపకం. చిన్నప్పుడు అమ్మ బతుకమ్మను పేరుస్తూ మమ్ముల సల్లంగా చూడాలని మొక్కుతుండేది. రోజంతా ఆడినా అలసట రాకపోయేది. మేం పోటీలు పడి బతుకమ్మను పేరుస్తుండేవాళ్లం. రంగులన్నీ ఒక్కచోటే కలిసినట్టు.. సబ్బండ ప్రజలు ఒక్కచోట చేరే సామూహిక ఉత్సవం ఇది. తెలంగాణ ఆడబిడ్డ బతుకమ్మ. ఈ సంవత్సరం ‘పుట్టమన్ను తీసుకొచ్చి.. జాజిరాలు తీసుకొచ్చి.. అలుకుపూతలు జల్లీ.. పసుపు కుంకుమల ముగ్గులేసి’ పాటతో వచ్చాను.
పండుగ పదిహేను రోజులు ఉందనగానే మా ఇంట్లో బొడ్డెమ్మను నిలబెట్టేవాళ్లు. ఇప్పటికీ ఆ సంప్రదాయం నడుస్తున్నది. కాబట్టి, మాకు బతుకమ్మ పదిహేను రోజుల పండుగ అన్నమాట. బొడ్డెమ్మ నుంచి సద్దుల బతుకమ్మ దాకా నేను, మా అక్కాచెల్లెళ్లు బతుకమ్మ ఆడుతుండేవాళ్లం. రోజూ సాయంత్రం కాగానే బొడ్డెమ్మ పీట పెట్టేందుకు ఇంటిముందు అందంగా అలికి, ముగ్గులేసి ఆడపిల్లలు ఆడుతుంటే ఆ ఇంటికి కొత్త కళ వస్తుంది. నేను చాలా వేదికల మీద బతుకమ్మ పాటలు పాడాను. నేను పాడింది కాకుండా మంగ్లీ పాడిన ‘సేను సెలకా మురిసేటి వేళ.. రామ సిలకా పలికేటి వేళ’ పాట అంటే ఇష్టం. ఆ పాటలో జీవన సౌందర్యం ఉంది.
నాకు పూలంటే ఇష్టం. మా ఇల్లు చాలా చిన్నది. కానీ, పూల మొక్కలతో కప్పేసినట్లు ఉంటుంది. బతుకమ్మ పూల జాతర అంటే మస్తు సంబురమయ్యేది. నేను అమ్మమ్మ దగ్గర పెరిగాను. చిన్నప్పటి నుంచీ నేనే బతుకమ్మను పేరుస్తుండేదాన్ని. బతుకమ్మ గొప్పదనం, చరిత్ర తెలుసుకొని సంతోషించేదాన్ని. గాయనిగా మంచి పేరు తెచ్చుకోవడంలో నాకు ‘తెలంగాణ తల్లి తొలుసూరు బిడ్డవే.. మా బతుకమ్మ నువ్వు బంగారు కొండవే’ పాట చాలా తోడ్పడింది.
ఆడపిల్లల ఉత్సాహం, పాలపిట్టల ఉత్సవం, ప్రకృతి పరవశం.. ఈ పాటలో కండ్లకు కట్టినట్లు కనిపిస్తుంది.
బతుకమ్మ అంటేనే పాటలు. చిన్నప్పటి నుంచీ గౌరమ్మ చుట్టూ ఆడిపాడుతున్నాం. బతుకమ్మ ఆడబిడ్డల పండుగే అయినా అందరూ సమష్టిగా పాలుపంచుకుంటారు. పువ్వులు తీసుకొచ్చే దగ్గరి నుంచి బతుకమ్మను సాగనంపే దాకా ఇంటిల్లిపాది తోడుగా ఉంటారు. నేను పాడిన పాటల్లో ‘తంగేడు పువ్వుల్లో పురుడోసుకున్నావే తల్లీ బతుకమ్మా.. తీరొక్క పువ్వులో నవ్వై ఒదిగున్నావే’ నాకు మంచి పేరు తీసుకొచ్చింది. బతుకమ్మ తెలంగాణ సంస్కృతిలో భాగం కావడం మన అదృష్టం.
బతుకమ్మ బంధాల వంతెన. ఆడబిడ్డల్ని కన్నోళ్ల చెంతకు చేర్చే పండుగ. మట్టి మనుషుల మట్టి బిడ్డ బతుకమ్మ. ‘కోలో కోలో కోల్.. కొమ్మా పూసే కోల్.. సుక్కా పొద్దుకే కోల్’ పాటలో కూడా ఇదే చెప్పారు. ఈ పాట నాకు మంచి పేరు తీసుకురావడమే కాదు.. ఎన్నో అవకాశాలు వచ్చేందుకు దోహదపడింది. ఇప్పటికీ ప్రతీ సంవత్సరం రెండు, మూడు బతుకమ్మ పాటలు పాడుతున్నాను. మారుమూల పల్లెల్లో పుట్టి, పెరిగిన నా లాంటి ఎంతోమంది గాయకులకు బతుకమ్మ మంచి భవిష్యత్తును ఇచ్చింది. అందుకే, బతుకమ్మ పండుగ వస్తే కళాకారులకు నిజమైన పండగొచ్చినట్లు అనిపిస్తుంది.
పాలమూరు తంగేడు వనాల చెంతన, పారేటి కృష్ణమ్మ ఒడ్డున బతుకమ్మలు పేర్చి ఆడిపాడుకునేవాళ్లం. చిన్నప్పుడు బతుకమ్మ పండుగ అయిపోయిన తర్వాత కూడా ఆ ప్రభావం ఉండేది. వారం పదిరోజుల దాకా చిన్న చిన్న బతుకమ్మలు చేసి ఆడేవాళ్లం. ‘రామరామ రామ ఉయ్యాలో.. రామనే శ్రీరామ ఉయ్యాలో’ పాట వింటూ పెరిగిన నేను, ఇప్పుడు ఇలాంటి పాటలెన్నో పాడేదాకా వచ్చాను. తెలంగాణ చరిత్రలో, సంస్కృతిలో భాగమైన బతుకమ్మ పాటల్ని ఎన్నో వేదికల మీద పాడిన నాకు, ప్రతీ ఏడాదీ బతుకమ్మ కొత్తగానే అనిపిస్తుంది.
నేను గత ఏడాది ‘సిన్ని సిన్నీ సింగిడిపూల బుట్ట వచ్చేనే.. అల్లిపూలు.. మందారాలు వెంట తెచ్చేనే’ అనే బతుకమ్మ పాటను కనకవ్వతో కలిసి పాడాను. మంచి ఆదరణ లభించింది. పచ్చని పైర్లు, పల్లె అందాలను ఈ పాటలో చూపించారు. ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మలను కండ్లకుకట్టారు. సమాజంలో స్త్రీకి ఉన్న గౌరవమేంటో చెప్పేందుకు బతుకమ్మే నిదర్శనం. పురాణాలు, శాస్ర్తాల్లోనూ బతుకమ్మ గురించి పేర్కొన్నారు. పూలను పూజిస్తూ చేసే బతుకమ్మ అన్నా, బతుకమ్మ పాటలన్నా నాకు చాలా ఇష్టం. పూల సంస్కృతికి నెలవైన ఈ గడ్డ మీద పుట్టడం నా అదృష్టం.
బతుకమ్మ అంటే ఎంత ఇష్టమో.. బతుకమ్మ పాట అంటే కూడా అంతే ఇష్టం నాకు. ఎందుకంటే, అదే నా కెరీర్‌ను మలుపు తిప్పింది. మాట్ల తిరుపతన్న సంగీతం సమకూర్చిన ఆ పాట 2018 హిట్‌లిస్ట్‌లో టాప్‌వన్‌గా నిలిచింది. ‘ఒక్కేసి పువ్వేసినా తీరొక్క పూల జాతర.. గుండెను కోవెలగా జరుపుకొనే వేడుక’ అంటూ సాగే ఆ పాట నాకు ఎప్పటికీ ప్రత్యేకమే. బతుకమ్మ పండుగ ఇంటిల్లిపాదికీ ఉత్సవంగా ఎలా మారుతుందో, ఈ పాటలో చక్కగా వర్ణించారు. పసుపు కుంకుమలు, సత్తు ముద్దల సంబురాలు, నది ఒంపులు.. కండ్లకు కట్టినట్లు చూపించారు.
మా ఊరు దాటితే మహారాష్ట్ర. అంటే సరిహద్దు ప్రాంతం. ఇక్కడ మాకు రోజూ పాటలు, ఆటలే. జానపద కళలకు అడ్డాలాంటిది మా ఊరు. పూల పండుగతో పాటు ప్రకృతి చుట్టూ అల్లుకున్న ప్రతీ పండుగను మేం అంగరంగ వైభవంగా, అట్టహాసంగా జరుపుకొంటాం. అలాంటి నేపథ్యం నుంచి వచ్చిన నేను బతుకమ్మలా తీరొక్క పాటలు పాడుతున్నాను. కనకవ్వ, నేను కలిసి గతేడాది పాడిన పాట ఎంతగానో అలరించింది. మాకు మంచి పేరు తీసుకొచ్చింది. ‘కొంగుళ్లు చుట్టుండ్రె కోమలాంగి.. కొనగొమ్మలంచుండ్రే సుందరాంగీ’ అంటూ సాగే ఆ పాట నాకు ఎప్పటికీ ఇష్టం.
దాయి శ్రీశైలం