జగజ్జనని వస్తున్నది!


Fri,October 5, 2018 03:15 AM

ఇటు బతుకమ్మ ఆటపాటలు, అటు దేవీ నవరాత్రులు
అణువుల నుంచి బ్రహ్మాండాల వరకూ వ్యాపించిన విశ్వరూపిణి, విజయ వినోదిని ఆదిపరాశక్తి ఎప్పటిలా ఈ ఏడాది కూడా వేంచేస్తున్న వేళా విశేషమిది. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. బతుకమ్మ నుంచి అపరాజితాదేవి వరకు మొత్తం పదకొండుగురు అమ్మల రూపంలో సమస్త మానవాళిని పులకింపజేయడానికి ఆ జగజ్జననియే తరలి వస్తున్నది. పెత్రమాస నాటి మరణించిన పెద్దల పేరున జరిపే దానధర్మాలు ముగిసీ ముగియగానే నాటి సాయంత్రం ఎంగిలిపూల బతుకమ్మ, మర్నాడు లలితాదేవి కొలువు దీరుతారు. తొమ్మిది రోజుల బతుకమ్మ వేడుకలు, నవర్రాతుల దేవీ పూజలకు ఇక మరో మూడు రోజుల గడువే ఉన్నది.
Kanakadurga
వర్షఋతువు తర్వాత వచ్చే శరధృతువు అంటేనే వెన్నెల కాచే చల్లని సమయం. అటు దుర్గా(దేవీ) పూజలకు, ఇటు ప్రత్యేకించి మన తెలంగాణలో బతుకమ్మ (గౌరమ్మ) ఆటపాటలకూ అత్యంత అనువైన కాలమిది. బతుకమ్మ వేడుకలను తెలంగాణ ప్రజలంతా ఎలాగైతే ఆనందోత్సాహాలతో జరుపుకుంటారో, దేవీ నవరాత్రులను కూడా ప్రతీ హైందవ సమాజమూ అత్యంత భక్తి ప్రపత్తులతో జరుపుకుంటుంది. ఆశ్వీయుజ మాసం తొలి రోజుల్లో జరిగే ఈ రెండు వేడుకల్లోనూ కోట్లాది మందితో ఆరాధనలు అందుకొనే దైవం ఒక స్త్రీమూర్తి కావడం విశేషం. ఆమెనే సకల జగముల నేలే జగదాంబ.


ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ పది రోజులూ ఒక్క ఆస్తికులు, ఆధ్యాత్మిక వేత్తలకే కాదు, సామాన్యులకు, ఇంకా ఆ మాటకొస్తే ప్రతీ ఒక్క మానవ మాత్రునికీ అత్యంత విశిష్ఠమని చెప్పాలి. ఎందుకంటే, బతుకమ్మ అన్నా, దుర్గాదేవి అన్నా, అమ్మల గన్న యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అన్నా.. ఎవరో కాదు, ఆ ఆదిపరాశక్తే. నమ్మిన వారికి, దైవిక సిద్ధాంతాన్ని ఆచరించే వారికి ఆమె అనేక రూపాలలో దర్శనమిస్తుంది. ఐతే, మత, ఆధ్యాత్మిక విశ్వాసాలు లేనివారి దృష్టిలోనూ విశ్వశక్తి (Super Power) అంటూ ఒకటుంది. ఈ శక్తి కూడా అనేక రూపాలలో కనిపిస్తున్నది.


ఈ అనంత విశ్వం మహాశక్తిపైనే ఆధారపడి ఉన్నట్టు నిరూపణైంది. పదార్థరూపంలో ఉన్నప్పుడు దానిని మనం చేతిలోకి తీసుకోగలం. కాంతి రూపంలో ఉంటే కళ్లతో చూడగలం. వాయు, జల, విద్యుత్, గురుత్వాకర్షణ తదితర రూపాలలోనూ శక్తి కొలువై ఉంటుంది. రోదసిలో శూన్య, కృష్ణ (అదృశ్య) శక్తులు ఉన్నట్టు నిర్ధారణైంది. జీవులలో ప్రాణశక్తినీ చూస్తున్నాం. ఇలా శక్తి ఇందు గలదందు లేదని సందేహము వలదు అన్నట్టు సర్వాంతర్యామి.


భారతీయ ధర్మశాస్ర్తాలు ప్రతీ స్త్రీమూర్తినీ శక్తికి ప్రతీకగా అభివర్ణించాయి. ఆ మాటకొస్తే అవి నారీమణులను పూజ్యనీయుల జాబితాలోకే చేర్చాయి. అలాగని, వారి హక్కులను హరించమని ఎవరూ చెప్పలేదు, ఆ మేరకు ఏ హైందవ సిద్ధాంతాలూ రూపొందలేదు. అలాగే, పరమాత్మ అంటే శ్రీమహావిష్ణువు అనుకుంటాం. కానీ, అసలు త్రిమూర్తులను, త్రిమాతలను, ఇంకా మొత్తంగా దేవతల గణాన్నందరినీ సృష్టించింది ఆదిపరాశక్తియే. ఒక్కమాటలో చెప్పాలంటే, ఆమెనే యావత్ సృష్టికి కర్త కర్మ క్రియ. కాబట్టి, సర్వశక్తులకూ కేంద్రస్థానం ఈ మహాశక్తి.


బతుకమ్మగా పిలిచే గౌరమ్మ అయినా, దేవీరూపాలలోని పదుగురు అమ్మలయినా (లలితాదేవి, అన్నపూర్ణ, రాజరాజేశ్వరి, పార్వతి, మహాలక్ష్మి, గాయత్రి, సరస్వతి, దుర్గ, మహిషాసురమర్దని, అపరాజితాదేవి) అందరూ పరాశక్తికి చెందిన ప్రధాన, ఉపప్రధాన, అంశాత్మక స్వరూపాలేనని మన పురాణాలు చెబుతున్నాయి. భూమిమీది మట్టి, చెట్టు, నీరు, నిప్పులలోనే కాదు, గ్రామగ్రామాన వెలసిన ఎల్లమ్మ, బాలమ్మ, పోలేరమ్మ, పెద్దమ్మలు.. వంటి అమ్మలంతా ఆమెకు ప్రతీకలు, ప్రతిరూపాలే. ఇంతేనా, సమస్త సృష్టికే ఆమెనే మూలం. సృష్టికర్త, సంరక్షకురాలు, దుష్ట వినాశనకారి సర్వం ఆమెనే అని దేవీ భాగవత పురాణం పేర్కొన్నది. ఏడు సింహాలతో కూడిన రత్నాల సింహాసనంపైన ఆదిశక్తి కూర్చుని ఉండడాన్ని త్రిమూర్తులు చూసినట్లు అందులో ఉందని వేదపండితులు చెప్తారు. ఆదిబీజమే (ఆదిపరాశక్తి) తనంతట తాను పురుషుడుగా, ప్రకృతి (స్త్రీ)గా విభజితమైనట్లు అష్టాదశ పురాణాలలో ప్రధానమైన బ్రహ్మ పురాణం తెలిపింది.


దేవీ భాగవతం ప్రకారం శక్తిలోని శకు ఐశ్వర్యమని, క్తికి పరాక్రమమని అర్థం చెప్పారు. సృష్టి ఆరంభంలో ఒక్క దేవి మాత్రమే ఉందని, ఆమెయే ఈ బ్రహ్మాండాలన్నింటినీ సృష్టించిందని బహ్వృచోపనిషత్‌లోనూ తెలిపినట్టు వేద పండితులు చెప్తారు. ఆమె నుండే త్రిమూర్తులు, సర్వమూ ఉద్భవించినట్టు కూడా అందులో ఉంది. ఎప్పుడైతే భూమిమీద దానవత్వం పెరుగుతుందో అప్పుడు తాను అవతరించి దుష్టశిక్షణ జరుపుతానని జగజ్జనని అన్నట్టు దేవీసప్తశక్తి పేర్కొంటున్నది.


జగత్తులన్నింటికీ మూలమైన భగవంతుణ్ని సైతం సృష్టించింది భగవతి అయిన ఈ పరాశక్తియే. ఇంతేకాదు, ప్రతీ అణువణువులోని ప్రాణశక్తికి, ఆత్మయిక జీవుల్లో నిగూఢంగా ఉండే కుండలినీ శక్తులకూ, పరమాత్మలోని యోగ-మహామాయలకు.. అన్నింటికీ ఆదిమూలమూ ఆమెనే అని ఆధ్యాత్మిక వేత్తలు అంటారు. ఆ మహాశక్తి విశ్వరూపంలో మన దర్శనానికి అందింది అత్యల్పం. కాబట్టి, ప్రతి ఒక్కరూ అహాన్ని అటకెక్కించి, శక్తి ఆరాధనకు సంసిద్ధులు కావాలి.


విశ్వ శక్తుల పూజలకు వేళాయె..

Main-box
శక్తి ఆరాధనను ఏదో ఒక మతానికో, వర్గానికో పరిమితం చేయనవసరం లేదు. అందరికీ కనిపించే శక్తి రూపాంతరాల (స్థితి, గతి, తాప, గురుత్వాకర్షణ, యాంత్రిక, రసాయనిక, అణు, సౌర, జల, పవన.. వంటివి)ను మనం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అనుభవిస్తున్నాం. ఆ మాటకొస్తే విశ్వం లో అసలు శక్తి లేని చోటు లేదు. గ్రహతారలు, నక్షత్రమండలాలు, రాశీవ్యవస్థలతోపాటు భూమండలం మీది కొండలు, కోనలు, వస్తువులు, యం త్రాలు, పదార్థాలు, జీవ నిర్జీవాలు.. అన్నింటా ఏదో రూపంలో శక్తి నెలకొని ఉంది. అలాగే, విశ్వంలో కనిపించని శక్తులూ ఇంకా శాస్త్రవేత్తల మేధకు, విజ్ఞాన శాస్ర్తాలకు అందకుండానూ ఉన్నా యి. అవన్నీ మహావిశ్వంలో భాగమే అయినప్పుడు, మానవాళికి సర్వతోముఖాభివృద్ధికి అవన్నీ ఉపయోగపడుతున్నప్పుడు వాటిని మాత్రం ఎం దుకు ఆరాధించకూడదు? అందుకేనేమో, మానవశక్తికి అతీతమైన ప్రాకృతిక, కృత్రిమ యాంత్రిక (మానవ నిర్మిత) శక్తుల పూజలకూ దీనినొక శుభ సమయంగా ప్రకటించారు.

1275
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles