హైబీపీ సాధారణ సమస్యేనా?


Sat,March 9, 2019 12:46 AM

నా వయస్సు 45 ఏండ్లు. ప్రయివేటు కంపెనీలో సీనియర్ అకౌంటెంట్ గా పనిచేస్తున్నాను. కొద్ది నెలల నుంచి తీవ్ర తలనొప్పితో బాధపడుతున్నాను. తరచూ చికాకుగా ఉంటున్నది. ఒక్కోసారి కండ్లు తిరుగుతున్నట్టు అవుతున్నది. ఈ మధ్య ముక్కులోంచి రక్తం కారింది. రోజూ వాకింగుకు వెళ్తున్నాను. ఈ లక్షణాలు ఎందుకో అర్థం కావటంలేదు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో దయచేసి సూచించండి.
-వెంకట్ రెడ్డి, నల్గొండ
Councling
ఈ లక్షణాలు ఒక దానితో మరోదానికి సంబంధం లేనివి ఎంతమాత్రం కావు. మీరు తెలిపిన దానిని బట్టి చూస్తే అధిక రక్తపోటు(హైబీపీ)తో బాధపడుతున్నారు. ఆ లక్షణాలతోపాటు కంటిచూపు కూడా మందగించినట్టు అనిపిస్తుంది. రక్తపోటులో రెండు రకాలుంటాయి. ప్రైమరీ, సెకండరీ హైబీపీగా దీనిని విడదీసి చెప్పవచ్చు. రక్తపోటు ఉన్న అత్యధిక వయోజనులలో ఏ ప్రత్యేక కారణం తెలియకుండా వ్యక్తమయ్యే రక్తపోటే ప్రాథమిక అధిక రక్తపోటు. ఇది నెమ్మదిగా పెరుగుతుంది. సంవత్సరాల తర్వాత హఠాత్తుగా కనిపిస్తుంది. మరికొంత మందిలో పైకి కనిపించని కొన్ని ఆరోగ్య కారణాల వల్ల రక్తపోటు పెరుగిపోతుంటుంది. ఈ రకమైన రక్తపోటును సెకండరీ హైపర్ టెన్షన్ అంటున్నారు. ఇది కూడా ఒక్కసారిగా కనిపిస్తుంది. అయితే ప్రాథమిక రక్తపోటుతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది.

ఈ రకమైన రక్తపోటుకు దారి తీస్తున్న కారణాలు : మూత్రపిండాల సమస్యలు, ఎడ్రీనల్ గ్లాండ్‌లో గడ్డలు, థైరాయిడ్ సమస్యలు, గురకతో తరచూ నిద్రకు అంతరాయం కలుగుతుండటం(అబస్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా), పుట్టుకతో వచ్చిన రక్తనాళ సమస్యలు, కుటుంబ నియంత్రణ కోసం వాడే మందులు, మితిమీరిన మద్యపానం.
అధిక రక్తపోటు వల్ల నష్టం చాపకింద నీరులా పెరిగి గుండె, మెదడును అనూహ్యంగా దెబ్బతీస్తుంది. పెరిగిన బీపీ గుండెకు, మెదడుకు రక్తాన్ని అందించే ధమనుల పైన ఒత్తిడిని, కొవ్వు- కొలెస్ట్రాల్ అణువులు పాచిలాగా పేరుకుపోయి రక్తప్రసరణకు ఆటంకాలను పెంచుతుంది.

చాలామంది అధిక బీపీని సాధారణ సమస్యగా భావించి పెద్దగా పట్టించుకోరు. కానీ అధిక రక్తపోటు గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోకుకు గురయ్యే ప్రమాదాన్ని రెండు రెట్లు పెంచుతుంది. సాధారణ రక్తపోటు ఉన్న వ్యక్తులకన్నా వీరిలో ఈ ప్రమాద అవకాశాలు రెండు వందల శాతం కంటే ఎక్కువ. పైగా హైపర్ టెన్సివ్ గుండెవ్యాధి మరణాలకు, బ్రెయిన్ స్ట్రోక్ రావటానికి అధిక రక్తపోటు మొట్టమొదటి కారణం. బీపీ ఎక్కువగా ఉండటం హార్ట్ ఫెయిల్యూర్, గుండెకండరాలు మందంగా తయారవటం వల్ల వచ్చే లెఫ్ట్ వెంట్రిక్యులార్ హైపర్ ట్రోఫీ, ఇశ్చమిక్ గుండె వ్యాధులకు, పక్షవాతానికి కూడా దారితీస్తుంది. మీరు క్రమం తప్పకుండా వాకింగుకు వెళుతుండటం ఆరోగ్యకరమైన అలవాటు. క్రమం తప్పకుండా దానిని కొనసాగించండి. వారంలో కనీసం అయిదు రోజుల పాటు రోజుకు అరగంటకు తగ్గకుండా వాకింగ్ చేయండి. అధిక రక్తపోటు చికిత్స కోసం ఆలస్యం చేయకుండా డాక్టరును సంప్రదించండి.
Dr.-Pankaj

892
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles