స్వీయ ఆరాధన- సర్వ ఆదరణ


Thu,January 10, 2019 01:13 AM

-మనందరి ఆధ్యాత్మిక నియమం


నందగిరి హిల్స్‌లోని మైహోమ్స్ అధినేత జూపల్లి రామేశ్వరరావు స్వగృహంలో జరుగుతున్న ధనుర్మాసోత్సవం బుధవారంతో 25వ రోజుకు చేరింది. గత 24 రోజులుగా, ఆండాళ్ గోదాదేవి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించిన విధానాన్ని, ఆమె చెప్పిన అద్భుత పాశురాలను వివరిస్తూ, ఆ కన్నయ్యను ప్రసన్నం చేసుకునే తీరును భక్తులకు విశదంగా బోధిస్తున్నారు త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామివారు. మనం పొందే ప్రతీది ఆ భగవంతుడు ప్రసాదించేదే. అందుకే ఆయననే ధ్యానించాలి. ఆయనకే మనమంతా విధేయులుగా ఉండాలి అని ఆయన ఈ సందర్భంగా ప్రబోధించారు. కాగా ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి , ఎమ్మెల్యే జి. జగదీష్‌రెడ్డి దంపతులు తదితరులు పాల్గొన్నారు.
Chinna-swami
గోదాదేవి తన గోపికా పరివారంతో నీలాదేవిని ముందు పెట్టుకొని శ్రీకృష్ణుడి మందిరానికి చేరి, తమ స్వభావాన్ని ఆయన ముందు ఆవిష్కరించారు. ఆ సమయంలో ఆకించిన్యము, అనన్య గతిత్వము అనే రెండు స్వభావాలు తమ దగ్గర ఉన్నాయని ఆ భగవంతుడికి వారు విన్నవించుకున్నారు. ఈ రెండు పదాల అర్థమేమిటంటే.. నా స్వార్జితమైన సాధనాలు ఏవీ నా దగ్గర లేవు. ఉన్నవన్నీ నీ వల్ల పొందినవే అనే విషయాన్ని భగవంతుడికి చెప్పడమే ఆకించిన్యము. ఇక, అనన్య గతిత్వము విషయానికొస్తే.. వీరంతా నా మాట వినే వాళ్లు. అవసరం వస్తే నాకు తీర్చే వాళ్లే వీళ్లు అని మనం కొందరి మీద విశ్వాసం కలిగి ఉంటాం. మనకు కావాల్సినవన్నీ చేసే వ్యక్తులు అనన్య గతులు అవుతారు. వారి ద్వారా పొందిందే అనన్య గతిత్వము అవుతుంది అని చిన జీయర్ స్వామి వివరించారు.


మనం ఏది పొందినా రెండు విషయాలు ఆలోచించాలి. అవేమిటంటే.. మనం పొందిన లాభం మన కృషివల్ల వచ్చిందా? భగవంతుడి కృపవల్ల వచ్చిందా? ఒకవేళ మన కృషి వల్లనే వస్తే, మనం ఏది కావాలంటే అది కోరుకునే అవకాశం ఉండాలి. మనలో కోరికలను తీర్చుకునే శక్తి ఉండాలి. కానీ, అవన్నీ సాధ్యం కావు. ఎందుకంటే, మనం కోరుకున్న, పొందిన లాభాలు ఏవైతే ఉన్నాయో అవి భగవంతుడి కృప వల్ల వచ్చినవన్నది అసలు నిజం అని ఆయన పేర్కొన్నారు. అయితే, అవన్నీ మన కృషి వల్ల వచ్చినవే అయినప్పటికీ భగవంతుడి కృపతో మనకు ప్రసాదించినవే అన్నది ఇక్కడ గమనించాలి. కొన్నిసార్లు మనం ఏ ప్రయత్నం చేయకపోయినా ఆ భగవంతుని చల్లని చూపు మనమీద ఉంటే ఆ దైవ ఫలితాలు మన దరికీ చేరుతై. వాటిని అనుభవిస్తాం. మొత్తం మీద ఆ దేవుడి అనుగ్రహం మన మీద ఉండాలి అని చిన జీయర్ స్వామి తెలిపారు. అలా ఉండాలంటే, మనల్ని మనం ఆ దేవదేవుడికి సమర్పించుకోవాలని, ఏది మనకు కలుగ వలెనన్నా, ఏ అవసరం, ఏ కార్యం తీరవలెనన్నా ఆ భగవంతుడు ఇవ్వాల్సిందేనని ఆయన ఉద్ఘాటించారు. గజేంద్రుడు ప్రార్థన చేసినట్టుగా నీవే తప్పా ఇత పరం బెరుగ అని త్వమేవ సర్వం.. నువ్వే ఈ సర్వ జగమంతా అని ఆ దైవాన్ని సంపూర్ణంగా నమ్మి జీవనం కొనసాగించాలి. దీన్నే అనన్య గతిత్వం అంటారని వివరించారు.


ఈ భూమ్మీద పుట్టిన ప్రతీ మనిషి, ప్రతీ జీవి ఇతరుల మీద ఆధారపడి జీవనం కొనసాగించాల్సిందే. అలా జరుగకపోతే జీవి మనుగడ సాగదు. ఇది భగవత్ తత్తం. మనం ఆధారపడే ఆ మరో జీవి, అవసరానికి మనకు సాయమందించే ఆ మరో ప్రాణమే దైవం అన్నారు ధనుర్మాస వ్రతంలో ఆండాళ్ గోదాదేవి ప్రవచించిన పాశురాల ప్రాశస్త్యాన్ని, అర్థ వివరణలను వివరిస్తూ చిన జీయర్ స్వామివారు. ఎప్పుడైతే మనం ఇతరుల మీద ఆధారపడుతున్నామో, ఆ శక్తి అంతా నీదే అని భగవంతుడి ముందు ఒప్పుకోవాలి. మన చుట్టూ మనకు సాయం చేయడానికే దేవుడు ఈ సమస్త జీవలోకాన్ని సృష్టించాడు. మన మనుగడ కొనసాగడానికే మనకు సాయమందించే ఈ రంగాలన్నీ రూపొందించాడు. అలా మనుషుల ద్వారా సాయాన్ని పొందుతున్నాం. మరి, ఆ దేవుడెక్కడున్నాడు? మనిషి ద్వారా పొందిన సాయాన్ని దేవుడికి ఆపాదించడం ఎందుకు? అనే ఆలోచనా ధోరణిని మార్చుకోవాలి. అలా మార్చుకోలేకపోతే ముక్తి లభించదు అని ఆయన తేల్చారు.
ఆ మరుక్షణం నుంచే ఈ ప్రపంచం నుంచి మనకు సాయం అందడం ఆగిపోతుంది. అందుకే మనిషిగా, ఆ మాటకొస్తే జీవిగా పుట్టిన ప్రతీ ఒక్కరూ స్వీయ ఆరాధన, సర్వ ఆదరణ అనే నియమం పాటించాలి. ఆ భగవంతుడి శక్తి గురించి తెలిసిన ప్రతీ ఒక్కరు ఆ నియమాన్ని తు.చ. తప్పక పాటిస్తారు. అలా, మనల్ని మనం ఆరాధించుకోవాలి. ఎందుకంటే, మనలో ఆ భగవంతుడు కొలువై ఉన్నాడు. ఇతరులను ఆదరించాలి. అప్పుడే మనలో ఆ దైవం కొలువై ఉంటాడు. ఆ రకంగా భగవత్ సాక్షాత్కారం అందరికీ కలుగుతుంది అని బోధించారు చిన జీయర్ స్వామి.


ఈ సందర్భంగా చిన జీయర్ స్వామి భక్తులకు, నిర్వాహకులు జూపల్లి రామేశ్వర్ రావు, ఆయన కుటుంబసభ్యులకు, హాజరైన అతిథులకు గోదాదేవి వ్రత ఆచరణ విధానాన్ని, దాని ద్వారా ఆమె ప్రపంచానికి చాటిచెప్పిన తత్తాన్ని సులభమైన ఉదాహరణలతో అందరికీ అర్థమయ్యేలా బోధించారు.


కోర్కెలకన్నా దైవానుగ్రహమే ముఖ్యం!

Chinna-swami1
ఒకానొక సమయంలో భక్తులంతా వీర శైవులు, పరమ వైష్ణవులుగా విడిపోయి ఒక వర్గం వారి దేవుడి పేరును కూడా మరో వర్గం వారు పలుకడానికి ఇష్టం చూపించే వారు కాదు. పైగా, ఒకరిపై ఒకరు యుద్ధాలు, తగాదాలు పెట్టుకునే వారు. ఈ గొడవలో పడి అసలు తత్తం మరిచిపోయే వారు. సకల దేవతలను ఆహ్వానించిన చోట ఆ విష్ణుమూర్తి కొలువై ఉంటాడన్న సత్యాన్ని అందరూ మరిచిపోయారు. ఆ పరమాత్మ దేవతామూర్తులందరితోనూ పూజలు, కీర్తనలందుకుంటాడు. ఆయనను ప్రస్తుతించిన తర్వాత ఆయన ప్రత్యక్షమైతే ఆ ఆనందంలో మనం ఏదేదో కోరుకుంటాం. కానీ, మనం చేయాల్సింది ఆ కోరికలకు బదులు ఆయన సన్నిధినే కోరుకోవాలి. అందుకోసమే ఆయనను స్తుతించాలి. మన పట్ల ఆయన ఆ అనుగ్రహం లభిస్తే మానవజన్మ ధన్యమైపోయినట్టే అని పరమాత్మ ఆరాధనా వైశిష్ట్యాన్ని వివరించారు చిన జీయర్ స్వామి.

- ప్రవీణ్‌కుమార్ సుంకరి
- వీరగోని రజనీకాంత్

1192
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles