స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు సురక్షితమే


Sat,March 9, 2019 12:08 AM

Finance
ఫిక్స్‌డ్ డిపాజిట్ ఒక సురక్షితమైన, భద్రమైన మదుపు వనరు అనే విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. పెట్టుబడి పెట్టిన వారికి ఇవి నిర్ధిష్ట స్థాయిలో కచ్చితమైన రాబడులను అందిస్తాయి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం వీటికి మార్కెట్ పరమైన రిస్క్‌లు ఉండవు. తక్కువ రిస్కు ఉండాలని కోరుకునే మదుపరులకు ఇవి చాలా అనువైనవి. అయితే స్టాక్ మార్కెట్ కదలికలతో అధిక రాబడులను అందుకునే అవకాశాలు లభ్యమవుతున్న నేపథ్యంలో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కొంతవరకు ఇటీవలి కాలంలో మోజు తగ్గింది. కానీ, అధిక రాబడులను ఇచ్చే మదుపు వనరులన్నీ స్టాక్ మార్కెట్ ఉత్థాన పతనాల ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందనే విషయం ఇక్కడ గుర్తుంచుకోవాలి. బ్యాంకులు, ఆర్థిక సంస్థల పరిధిని మరింత విస్తృత పరుచడానికి ఇటీవల స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (ఎస్‌ఎఫ్‌బీ)ల పేరుతో కొత్త బ్యాంకింగ్ వ్యవస్థను రిజర్వ్‌బ్యాంకు ప్రవేశపెట్టింది. వినియోగదారుల నుంచి డిపాజిట్లను ఆకర్షించడమే వీటి లక్ష్యం. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వాణిజ్య బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేట్లతో పోలిస్తే, ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు చాలా ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి.

ప్రధాన స్రవంతి బ్యాంకులు దరి చేరని సామాజిక వర్గాలకు, వాటి ద్వారా ఏవో కొద్దిపాటి సేవలు మాత్రమే పొందగలుగుతున్న వారికి ఉత్తమమైన బ్యాంకింగ్ సేవలు అందించడంపై ఈ ఎస్‌ఎఫ్‌బీలు దృష్టి సారిస్తున్నాయి. ప్రధాన బ్యాంకుల వినియోగదారులు పొందుతున్న బ్యాంకింగ్ సేవలు, ఉత్పత్తులు అన్నింటినీ ఇవి కూడా అందిస్తున్నాయి. కింది స్థాయి సామాజిక వర్గాలు తాము కష్టపడి సంపాదించుకున్న డబ్బును ఏ మాత్రం రిటర్నులు లేని రీతిలో ఇంట్లోనే దాచిపెట్టుకోకుండా మంచి రాబడులు అందించే సురక్షితమైన మదుపు వనరులలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించడానికి ఎస్‌ఎఫ్‌బీలు తమ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీని అందిస్తున్నాయి. బ్యాంకింగ్ సేవల పరంగా వీరికి సరికొత్త అనుభూతి కలిగించడానికి అధునాతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాయి. డిపాజిట్ల ద్వారా సమీకరించిన డబ్బును చిన్న స్థాయి కస్టమర్లకు, చిరు వ్యాపార వర్గాలకు చిన్న చిన్న రుణాలుగా అందిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటివరకు బ్యాంకింగ్ సేవలు పూర్తిగా లేదా సరిగా అందని వాళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీంతో లక్షలాది అల్పాదాయ వర్గాల జీవన ప్రమాణాలను పెంచడానికి దోహదపడుతున్నాయి.

దేశంలో ఇప్పటివరకు బ్యాంకింగ్ సేవలు అందని వారికి తమ డబ్బును దాచుకోవడానికి ఒక సురక్షితమైన మదుపు వనరు అవసరం ఉంది. ఇలాంటి వారు తమ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలు అందుకోవడానికి ఫిక్స్‌డ్ డిపాజిట్ ఒక ఆకర్షణీయమైన అవకాశం. ఎస్‌ఎఫ్‌బీలు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 9 శాతం వరకు వడ్డీని అందిస్తున్నాయి. బ్యాంకుల నుంచి ఉత్తమమైన సేవలు పొందడానికి తమకు సరైన అర్హత లేదేమోనని చిన్న తరహా వినియోగదారులు ఇంతకాలం భావిస్తూ ఉండే వాళ్లు. బ్యాంకుల దగ్గరికి వెళితే ఏదైనా అవమానానికి గురవుతామేమోనని భయపడేవాళ్లు. ఆ పరిస్థితిని మార్చడమే లక్ష్యంగా ఎస్‌ఎఫ్‌బిలు ఇప్పుడు పనిచేస్తున్నాయి. బ్యాంకింగ్ సేవలను వారి జీవితాల్లో ఒక భాగంగా చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.

బ్యాంకింగ్ సేవలకు వారు అలవాటు పడేలా ప్రోత్సహిస్తున్నాయి. నిజానికి బ్యాంకు ఖాతాలు ఉన్నప్పటికీ, చదువుకున్న వాళ్లలో కూడా చాలా మంది బ్యాంకింగ్ సేవలను సరిగ్గా వినియోగించుకోలేక పోతున్నారు. బ్యాంకులు అందించే సేవలు, సౌకర్యాలు, వాటి ప్రయోజనాలపై సరైన అవగాహన లేకపోవడమే దానికి కారణం. ఇటువంటి వారికి సరైన మదుపు అవకాశాలు, వారికి అవసరమైన సేవలను అందించే ఆర్థిక సంస్థలపై అవగాహన కల్పిస్తూ వారు ఎంచుకున్న ఆర్థిక వనరులను సరైన రీతిలో నిర్వహించుకునేలా చేయడానికి సంస్థాగత ప్రయత్నం కొంత అవసరం. ఆ దిశగానే పరిణామ్ ఫౌండేషన్ దీక్షా కార్యక్రమం ద్వారా వినియోగదారులకు అవగాహన పెంచడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నది. వినియోగదారులు తమ ఆర్థిక వనరులను సరిగా నిర్వహించుకునేలా చేయడమే ఈ ప్రయత్నం లక్ష్యం.

అయితే, వినియోగదారులు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, పెట్టిన పెట్టుబడిపై బ్యాంకు ఎంత వడ్డీ ఇస్తుందనేది మాత్రమే ప్రధానం కాదు. ఇతర బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పోలిస్తే ఆ బ్యాంకు ఎంత మెరుగ్గా సేవలు అందిస్తున్నదనే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉజ్జీవన్ ఇప్పటికే ఇంటి దగ్గరికే బ్యాంకింగ్ సేవలను తీసుకువెళుతున్నది. పెద్దగా డాక్యుమెంటేషన్ అవసరం లేని రీతిలో, ఎలాంటి ఇబ్బందులు లేని డిజిటల్ సేవలు అందిస్తున్నది. వినియోగదారులకు పలు రకాల మెరుగైన సేవలను అందిస్తున్నది.

స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల నేపథ్యంలో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాటిట్ ఖాతా తెరిచి మీ డబ్బును ఒకటి నుంచి రెండేండ్ల కాలానికి మదుపు చేయడానికి ఇదే సరైన సమయం. మీ డబ్బుపై మంచి రాబడిని అందుకోవడానికి ఇదొక ఉత్తమ మార్గం. మీకున్న ఆర్థిక వనరులలో గరిష్ఠ మొత్తాలను మంచి ఆర్థిక సంస్థలలో మదుపు చేయండి. దాని కోసం విలక్షణ సేవలు, ఉత్తమ రాబడులను అందించే సంస్థలను ఎంచుకోండి.
Sanjay

185
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles