స్థిర నివాసం..ప్రథమ ప్రాధాన్యం


Sat,August 25, 2018 01:09 AM

-నమస్తే తెలంగాణ ప్రాపర్టీ షోకు అనూహ్య స్పందన
-సందర్శకుల్లో ఐటీ నిపుణులే ఎక్కువ
-పిల్లాపాపలతో సొంతింటిని ఎంచుకున్న నవదంపతులు
-ఫ్లాట్లు, విల్లాలు, ప్లాట్లు కొనడంపై అధిక దృష్టి

contractions
భాగ్యనగరంలో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడమే ప్రథమ ప్రాధాన్యం.. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఇక్కడే సొంతింటిని కొనుగోలు చేస్తాం.. మా పిల్లలంతా ఇక్కడే చదువుతున్నారు.. రానున్న రోజుల్లో హైదరాబాద్ గణనీయంగా వృద్ధి చెందుతుందన్న విశ్వాసం మాకుంది.. పోలీసు వ్యవస్థ మెరుగ్గా ఉన్నది. ప్రజలూ ఎంతో స్నేహ పూర్వకంగా ఉన్నారు. అందుకే, ఈ నగరమెంతో నచ్చింది. హమారా షహర్.. హైదరాబాద్.


భాగ్యనగరంలో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడమే తమ ప్రథమ లక్ష్యమని పలువురు ఇండ్ల కొనుగోలుదారులు అభిప్రాయపడ్డారు. గత శనివారం, ఆదివారం నమస్తే తెలంగాణ శిల్పాకళావేదికలో నిర్వహించిన ప్రాపర్టీ షోకు అధిక సంఖ్యలో సాఫ్ట్‌వేర్ నిపుణులు విచ్చేశారు. వీరంతా ఇతర నగరాలకు చెందిన వారైనప్పటికీ.. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా హైదరాబాద్‌లోనే స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటామని ఘంటాపథంగా చెప్పారు. మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, కోకాపేట్, నలగండ్ల, తెల్లాపూర్, బండ్లగూడ, చందానగర్, మియాపూర్ వంటి ప్రాంతాల్లో కలల గృహాన్ని ఎంచుకోవడానికి ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు.
దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన యువ దంపతులు ప్రాపర్టీ షోకు అధిక సంఖ్యలో విచ్చేశారు. తమ బడ్జెట్‌కు తగ్గ ఇండ్ల వివరాల్ని తెలుసుకున్నారు. మరి కొంతమంది నవదంపతులు తమ తల్లిదండ్రులతో సందర్శించారు. నివసించడానికి అనుకూలమైన ప్రాంతాల్లో.. కోరుకున్న బడ్జెట్లోని అపార్టుమెంట్లు, విల్లాల గురించి ఆరా తీశారు. అక్కడే సీరియస్‌గా కూర్చుని పలు సంస్థలకు చెందిన ప్రతినిధులతో చర్చించారు. భాగ్యనగరాన్నే తమ భవిష్యత్తు నగరంగా భావిస్తున్నామని.. రానున్న రోజుల్లో ఇక్కడ్నుంచే కార్యకలాపాల్ని నిర్వహిస్తామని నమస్తే సంపదకు కొందరు చెప్పారు. వివిధ ప్రాంతాల్లో గల పలు ప్రాజెక్టులను ఇక్కడ్నుంచే పలువురు సందర్శించారు. కొన్ని కంపెనీలు రవాణా ఏర్పాట్లు చేయడంతో వీరి సొంతింటి ఎంపిక మరింత సులువుగా మారింది.
contractions1

2018లో ఉత్తమ ప్రాపర్టీ షో..

2018లోనే ఉత్తమ ప్రాపర్టీ షో నమస్తే తెలంగాణ నిర్వహించినదే అవుతుందని తెలంగాణ బిల్డర్లు, డెవలపర్ల ముక్తకంఠంతో చెబుతున్నారు. శిల్పాకళావేదికలో నిర్వహించిన రెండు రోజుల ప్రాపర్టీ షోకు అధిక సంఖ్యలో ఇండ్ల కొనుగోలుదారులు విచ్చేశారని ట్రెడా అధ్యక్షుడు పి.రవీందర్‌రావు తెలిపారు. ఆయనతో పాటు క్రెడాయ్ తెలంగాణ ప్రధాన కార్యదర్శి చెరుకు రాంచంద్రారెడ్డి, తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు జీవీ రావు, ట్రెడా ఉపాధ్యక్షుడు విజయ్ సాయి తదితరులు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ప్రాపర్టీ షో స్టాళ్లను సందర్శించారు. పలు బహుమతులను సందర్శకులకు అందజేశారు. అంతకంటే ముందు రోజు క్రెడాయ్ మాజీ జాతీయ అధ్యక్షుడు సి. శేఖర్‌రెడ్డి విచ్చేసి.. ప్రాపర్టీ షోను నమస్తే తెలంగాణ నిర్వహించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ రంగాన్ని ప్రగతిపథంలోకి నడిపించేందుకు అనేక చర్యల్ని తీసుకుంటుందని.. ఈ షోకు విచ్చేసిన ఇండ్ల కొనుగోలుదారుల సంఖ్యే ఇందుకు నిదర్శనమన్నారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ మరింత మెరుగ్గా వృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షుడు గుమ్మి రాంరెడ్డి వ్యక్తం చేశారు.

contractions2

పెట్టుబడి నిమిత్తం..

పెట్టుబడి నిమిత్తం ఆలోచించేవారు నమస్తే తెలంగాణ ప్రాపర్టీ షోకు విచ్చేసి.. పలు సంస్థలు అభివృద్ధి చేస్తున్న లేఅవుట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఆయా ప్రాంతాలు వృద్ధి చెందుతాయా? ప్రస్తుతం రేటెంత? ఇలాంటి విషయాలన్నీ బేరీజు వేసుకుంటున్నారని పలు సంస్థల ప్రతినిధులు నమస్తే సంపదకు తెలిపారు. అయితే ప్లాటు కొనేవారు ఆయా వెంచర్‌కి స్థానిక సంస్థల నుంచి అనుమతి ఉందా? లేదా?, ఆయా వెంచర్ ఏయే జోన్ పరిధిలోకి వస్తుంది? ఇలాంటి విషయాలన్నీ బేరీజు వేసుకున్నాకే అంతిమ నిర్ణయం తీసుకుంటామని కొందరు కొనుగోలుదారులు నమస్తే సంపదకు వివరించారు.

316
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles