స్ట్రెస్ రిలీఫ్-13


Sat,April 27, 2013 03:31 AM

yoga1 నాడీ శోధన ప్రాణాయామం
ఎడమ నాసిక (ఇడ), కుడి నాసిక (పింగళ) ద్వారా చేసే ఈ ప్రాణాయామం నాడులను శుద్ధి చేసే ప్రాణాయామం. పద్మాసనంలోకానీ, సిద్ధాసనంలోకానీ, సుఖాసనంలోకానీ, వజ్రాసనంలోకానీ కూర్చోవాలి. కుడిచేతి బొటనవేలితో కుడినాసికా రంధ్రం మూసి.. ఎడమ నాసికా రంధ్రంతో నెమ్మదిగా, దీర్ఘంగా, సులువుగా శ్వాస తీసుకోవాలి. ఇప్పుడు ఎడమనాసికా రంధ్రాన్ని ఉంగరం వేలు, చిటికెన వేలుతో మూసివుంచి, బొటనవేలు వదిలేసి కుడి నాసికారంధ్రం నుంచి గాలి వదిలేయాలి. కుడిచేతి బొటన వేలితో ఎడమ నాసికారంధ్రం మూసేయాలి. తర్వాత కుడి నాసికా రంధ్రంతో నెమ్మదిగా, దీర్ఘంగా, సులువుగా శ్వాస తీసుకోవాలి. ఇప్పుడు కుడి నాసికా రంధ్రాన్ని చిటికెన వేలుతో మూసి ఉంచి, బొటనవేలు వదిలేసి ఎడమ నాసికా రంధ్రంనుంచి గాలి వదిలేయాలి.
గమనిక : ఈ ప్రాణాయామం 1 : 2 పద్ధతిలో చేయాలి. అంటే నాలుగు సెకన్లు ఊపిరి పీల్చుకుంటే ఎనిమిది సెకన్లపాటు వదిలేయాలి.

ఉపయోగాలు
- ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ఉన్నవాళ్లు చేయాల్సిన అద్భుతమైన ప్రాణాయామం ఇది.
- దీనిద్వారా రక్తం శుద్ధి చేయడానికి కావాల్సిన ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది.
-రక్తనాడులను శుద్ధి చేస్తుంది.
- మెదడును శాంతింపజేస్తుంది.
- స్ట్రెస్, యాంగ్జైటీని తగ్గిస్తుంది.
- మెదడులోని కుడి, ఎడమ భాగాల మధ్య సమన్వయం చేకూర్చి ఆలోచనా పద్ధతిని క్రమబద్ధం చేస్తుంది.

yoga2 హలాసనం
వెల్లకిలా నేల మీద పడుకోవాలి. గాలి పీల్చుకొని నెమ్మదిగా గాలి వదులుతూ రెండు కాళ్ళను సమాంతరంగా లేపి తలమీదుగా వెనక్కి తీసుకెళ్ళి భూమి మీద ఆన్చాలి. మొదట చేసేటప్పుడు నడుము దగ్గర చేతుల సపోర్టు తీసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే చేతులను కింద పెట్టవచ్చు. రెండు మోకాళ్ళు వంచకుండా ఉండాలి. ఆసన స్థితిలో నెమ్మదిగా గాలి పీల్చుకుని వదులుతూ ఉండాలి. ఇలా ఉండగలిగినంత సమయం ఉండి నెమ్మదిగా యథాస్థితికి రావాలి. కాళ్ళు రెండూ నేలకు ఆనేవరకు మోకాళ్ళు వంచకూడదు. ఆసనం తర్వాత శవాసనంలో రిలాక్స్ అవ్వాలి. మొదట 20 సెకన్ల నుంచి మొదలుపెట్టి నెమ్మదిగా ఆసనస్థితిలో ఉండే సమయం పెంచాలి. మొదట కాళ్ళు నేలకు ఆనకున్నా... ప్రయత్నం మీద సాధించవచ్చు.

ఉపయోగాలు
- కాలిలో ఉన్న అన్ని కండరాలు, లిగమెంట్లు బాగా స్ట్రెచ్ అవ్వడం వల్ల ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. లెగ్ క్రాంప్స్‌తో బాధపడే వారికి ఇది చాలా ఊరటనిస్తుంది.
- పొట్ట భాగం కుంచింపబడటం వలన ఆసనస్థితి నుంచి బయటికి వచ్చినప్పుడు ఒక్కసారిగా రక్తవూపసరణ పెరుగుతుంది. టాక్సిన్లు బయటికి పోతాయి. ఇదే విధమైన స్థితి మెడ, ఊపిరితిత్తుల దగ్గర జరుగుతుంది. ఆక్సిజనేటెడ్ బ్లడ్ అవయవాలకు సరఫరా అవుతుంది.
- నిద్రపోయినపుడు వెన్నెముక కంప్రెస్ చెయ్యబడినట్లు, స్టిఫ్ అయినట్లు అనిపించినపుడు ఉదయం లేవగానే వార్మ్ అప్స్ తర్వాత హలాసనం ప్రాక్టీస్ చెయ్యవచ్చు.
- థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరుస్తుంది.
- లివర్, కిడ్నీల పనితీరును ఉత్తేజితం చేస్తుంది.

సంగీత అంకత
యోగా ట్రైనర్, బ్యూటీ ఎక్స్‌పర్ట్, 9705665266

3088
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles