సొరంగాల సూపర్ హీరో ఎనీమల్ రోబో


Tue,February 12, 2019 01:23 AM

Robo
మురుగుకాల్వల పైపులైన్లలో కార్మికులకు బదులుగా వివిధ పనులు చేసే సూపర్ పవర్ రోబో ఒకటి తయారైంది. ఎనీమల్ పేరున పిలుస్తున్న ఈ స్వయంచాలక యంత్రం చిమ్మ చీకట్లోని పైపులైన్లు, గుయ్యారాలు, గుహలు, గనులలోకి నడచుకుంటూ వెళ్లడమేకాక చూడడం, వినడం, తలుపులు తెరవడం వంటి పనులూ చేస్తుంది. భూగర్భంలో తీవ్రతర పరిస్థితులలోనూ సమర్థవంతంగా పనిచేయగల ఈ రోబోని స్విట్జర్లాండ్‌లోని రోబోటిక్ నిపుణులు ఇటీవల అభివృద్ధి పరిచారు.


అన్ని పనులూ మనుషులు చేయలేరు, చేయకూడదు కూడదు కూడా. అనారోగ్యకరమైన, ప్రమాదకరమైన, తీవ్రతర పరిస్థితులలోకి కార్మికులు అసలు వెళ్లక పోవడమే మంచిది. నిజానికి వెళ్లలేరు కూడా. మురుగుకాల్వలలోకి దిగిన పారిశుధ్య పనివారు ఒక్కోసారి ఊపిరాడక ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న సంఘటనలూ అడపాదడపా చూస్తున్నాం. డ్రైనేజీ మార్గాలలో మురుగు జలాలు ఘనవ్యర్థాలతో నిండుకున్నప్పుడు యంత్రాల సాయంతో శుభ్రపరచుకొనే సాంకేతిక వెసులుబాటు ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్నది.


ఈ తరుణంలోనే స్విట్జర్లాండ్‌లోని జురిచ్ నగరానికి చెందిన ఒక పరిశోధకుల బృందం అభివృద్ధి పరిచిన రోబో ఒకటి ఈ విషయంలో కొత్త ఆశల్ని కలిగిస్తున్నది. ఎనీమల్ (ANYmal) పేరున వారు తాజాగా తయారు చేసి స్వయంచాలక యంత్రం (రోబో) నమూనా ప్రయోగాలలో విజయం సాధించింది. ప్రత్యేకించి మురుగుకాల్వలలో పద్మవ్యూహం వంటి చోట్ల చిక్కుపనులను సైతం ఇది సమర్థవంతంగా నిర్వహించిందని పరిశోధకులు తెలిపారు.


ఎనీబోట్స్, రోబోటిక్ సిస్టమ్స్ ల్యాబ్ పరిశోధకులు సంయుక్తంగా అభివృద్ధి పరిచిన ఈ ఎనీమల్ రోబో సమీప భవిష్యత్తులో ఏదో ఒకరోజు మురుగు వ్యవస్థలకు చక్కగా ఉపయోగపడగలదని పరిశోధకులు భరోసా ఇస్తున్నారు. జురిచ్ నగరంలోని పారిశుధ్య కార్మికులు నిరంతరం మురుగు వ్యవస్థల పైపులైన్లలోకి దిగి నడవాల్సి రావడమేకాక కొన్నిచోట్లయితే పాకుతూ, పడుకొని కూడా వెళ్లవలసి వస్తుంది. ముఖ్యంగా ఆ నగరంలో ఈ మార్గాలు దాదాపు 62 మైళ్ల దూరం పొడుగునా భూగర్భంలో నిర్మితమై ఉన్నాయి. ఈ పైపులైన్లలోని గోడలు, నేలలపై పగుళ్లు వంటి (డ్యామేజెస్) ప్రమాదాలను వారు నిరంతరం పరీక్షిస్తుంటారు. ఈ విధి నిర్వహణ తీవ్ర అనారోగ్యకరమేగాక ఒక్కోసారి ప్రాణాంతకం కూడా.


ఇంతటి క్లిష్టమైన, ఇరుకైన మురుగుకాల్వల పైపులైన్లలో ఎనీమల్ రోబో చక్కగా ప్రయాణించగలదని ప్రయోగాత్మకంగా నిరూపణైంది. ప్రస్తుతమున్న సాంకేతికత వల్ల యాంత్రిక వ్యవస్థలకు ఇది సాధ్యం కావడం లేదు. కాబట్టే, దీని తయారీకి తాము పూనుకున్నట్లు వారు చెబుతున్నారు. ఎనీమల్‌కు జంతువుకు మాదిరిగానే నాలుగు కాళ్లున్నాయి. అవి భావ వ్యక్తీకరణ సాంకేతికతను కలిగి వున్నాయి. 19.5 అంగుళాల పొడవున ఎనీమల్ రోబో నిర్మితమైంది. దీని తలలో వివిధ రకాల స్పెన్సర్లతోకూడిన ఒక శక్తివంతమైన కెమెరా ఉంది. మురుగుకాల్వల పైపులైనులోకి దింపి పై(ఉపరితలం) నుంచి పరిశోధకులు రిమోట్ సాయంతో నియంత్రిస్తుంటారు. ఇటీవలి నమూనా ప్రయోగంలో వారు విజయం సాధించారు. నిర్వాహకులు ఇచ్చిన ఆదేశాలను రోబో ఆటోమేటిక్ (స్వయంచలితం)గా ఆచరణలో పెట్టింది.


ఉపరితలానికి 13 అడుగుల కింద, భూగర్భంలో పైప్‌లైన్ లోపల చిమ్మచీకటేకాక నేల పూర్తిగా తడిగా, జారుతూ ఒక్కోచోట పాకురుపట్టి ఉంటుంది. అక్కడి ఉష్ణోగ్రతలూ ప్రయోగశాలలోకంటే అల్ప స్థాయిలోనే ఉంటాయి. ఎనీమల్ రోబో పైపు మార్గంలో నడుస్తున్నప్పుడు యాంత్రిక ధ్వని వినిపిస్తుంది. సమీపంలోని పైప్‌లైను మురుగునీరు బయటకు వచ్చే చోటు నుంచి కాలుష్యజలాలతోపాటు ఈ ధ్వనులు వినవస్తుంటాయి. మూడేళ్ల పరిశోధనాత్మక కృషి ఫలితంగానే ఈ రోబో సిద్ధమైంది. థింగ్ (THING: sub-Terranean Haptic InvestiGator) ప్రాజెక్ట్‌గా దీనిని వారు వ్యవహరిస్తున్నారు. ఇందులో త్రీడి కెమెరాలు లేజర్ సెన్సర్లను వినియోగించినట్టు పరిశోధకులు చెప్పారు.


వచ్చే ఏడాది రాగి లోహపు గనులలోనూ ఎనీమల్ రోబోని ప్రాథమిక స్థాయిలో పరీక్షించనున్నట్టు పరిశోధకులు తెలిపారు. మురుగుకాల్వల కంటే కూడా భిన్నమైన గనులలో, అక్కడి అతిసూక్ష్మస్థాయి వాతావరణంలో దీని పనితనాన్ని పరీక్షిస్తారు. ఈ గనులలో వాతావరణం వేడిగా, దుమ్ము ధూళి నిండిన గాలి, గులకరాళ్ల నేలతో అడ్డదిడ్డంగా ఉంటుంది. కాగా, పై ప్రయోగాలలో భాగంగా ఎనీమల్ రోబో మురుగు పైప్‌లైన్‌లో చీకట్లలో తన హెడ్‌లైట్లనూ వినియోగించుకున్నట్టు వారు చెబుతున్నారు. తన మార్గంలోని పరిసరాలను ఇది స్కానింగ్ తీసి ఉపరితలంలోని పరిశోధకులకు చేరవేసింది. ఎనీమల్ కళ్లు రోట్‌వీలర్ (Rottweiler: తీవ్ర ఆగ్రహంతో వుండే పెద్ద శునకం)ను పోలి ఉన్నట్లు వారు వివరించారు. ఇది సెకనుకు 5,00,000 చొప్పున వివిధ కొలతలను ఒక రోజంతా నమోదు చేసినట్లు వారు పేర్కొన్నారు.

Robo1

పదేళ్ల కృషికి ఫలితం

ఎనీమల్ రోబో రూపకల్పన వెనుక పరిశోధకుల పదేళ్ల కృషి ఉంది. 2015లోనే పూర్తిస్థాయిలో తొలి మూల నమూనా (ప్రొటోటైప్) సిద్ధమైనా ఇటీవలె ప్రయోగాత్మక పరీక్షలు పూర్తి చేశారు. ఇప్పటికి ఈ రోబో ఆటోమేటిక్‌గా తన సెన్సర్ల సహాయంతో చూడడం, వినడం, తాకడం చేస్తున్నది. పరిసరాలలోని గాలి పీడనాన్ని నమోదు చేస్తున్నది. అక్కడి ధ్వనులు, వస్తువులను పసిగడుతున్నది. ప్రత్యేక చేయితో లోపల వుండే తలుపుల్ని తెరుస్తుంది కూడా. బటన్‌ను నొక్కి వ్యవస్థలను మొదలు పెడుతుంది. ఈ రోబో కళ్లు, చెవులు, ముక్కు అన్నీ మనుషులకంటే మించిన అనూహ్యస్థాయిలో గ్రహణశక్తిని ప్రదర్శిస్తున్నాయని పరిశోధకులు ప్రకటించారు. పరిసరాల్లోని ఉష్ణోగ్రతలను, వాతావరణంలోని వాయువులను అత్యంత కచ్చితత్వంతో నమోదు చేస్తుందని, దీనికున్న కొన్ని శక్తులైతే సూపర్ హ్యూమన్‌మ్యాన్‌ను గుర్తుకు తెస్తాయని వారన్నారు.


- దోర్బల బాలశేఖరశర్మ

910
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles