సేవా కిరణం


Wed,February 13, 2019 12:41 AM

ఆకలి తెలిసినోడికే అన్నం విలువ తెలుస్తుంది. పేదరికం తెలిసినోడికే పేదోడి కష్టాలు తెలుస్తాయి. అందుకే.. వాళ్ల కష్టాల్లో పాలు పంచుకోవాలి అనుకుంటారు. పేదరిక రేఖల్ని తుడిచేయాలి అనుకుంటారు. ఈ గజిబిజీ జీవితంలో ఇప్పటికీ అలాంటివాళ్లు ఉన్నారా? ఎందుకు లేరు? అలాంటి ఓ ఆదర్శ యువకుడి పరిచయం.
dr-gummadi-kiran
మీ దగ్గర యాభై రూపాయలు ఉంటాయి. అప్పుడే ఒకరు వచ్చి అన్నా ఆకలిగా ఉంది ఓ నలబై రూపాయలు ఇవ్వు అంటే ఏం చేస్తారు? ఛల్.. నా దగ్గర ఉన్నవే యాబై.. దాంట్లో నీకు నలభై ఇచ్చి నేనేం చేయాలి? అంటామా లేదా? కానీ ఒక యువకుడు మాత్రం అలా అనడం లేదు. తన జీతంలో సగం సమాజ సేవకే ఖర్చు చేస్తున్నాడు. అతడే డాక్టర్ గుమ్మడి కిరణ్. అందరూ ముద్దుగా సేవా కిరణం అని పిలుస్తుంటారు.


మాతృభూమిపై ప్రేమ

కిరణ్ తనకొచ్చే జీతంతో హాయిగా ఉండగలడు. కానీ తనకెంతో ఇచ్చిన మాతృభూమిపై ఉన్న మిగతావాళ్ల పరిస్థితి ఏంటి అని ఆలోచించాడు. పేదరికం, ఇప్పటికీ ప్లాట్‌ఫామ్స్‌పై పడుకొని కాలం వెళ్లదీస్తున్నవారి దీనగాథలు అతన్ని ఆలోచింపజేశాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఆరోగ్యంపై.. అక్షరాస్యతపై అవగాహన గురించి అధ్యయనం చేశాడు. ఈ గడ్డమీద పుట్టినవారిగా మనకంటూ ఓ బాధ్యత ఉండాలని సేవారంగంలోకి దిగాడు.


సగం జీతం వారికే

భావోద్వేగంతో అప్పటికప్పుడు ఓ నిర్ణయం తీసుకోవడం వేరు.. దానిని అమలు చేయడం వేరు. కానీ కిరణ్ దానిని వందకు వందశాతం అమలు చేస్తున్నాడు. తన నెల జీతంలో సగం (రూ. 10 వేలు) పేదల కోసం ఖర్చు పెడుతున్నాడు. పేదలకు బట్టలు.. వికలాంగులకు వీల్ చైర్లు.. మెడికల్ క్యాంపులు.. ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నాడు.


ఆయన ఏం చేస్తాడు?

కూకట్‌పల్లిలోని రామ్‌దేవ్‌రావు ట్రస్టు దవాఖానలో ఆప్తోమెట్రిస్ట్‌గా పనిచేస్తున్నాడు. గ్రామీణ నేపథ్యమున్న కిరణ్ సహాయ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని తాళ్లపేట ఆయన సొంత ఊరు. ఆదిలాబాద్‌లోని ఆదివాసీ గూడేల్లో ఇప్పటికీ నాటు వైద్యంపైనే ప్రజలు ఆధారపడుతుంటారు. అలాంటివారికి ప్రత్యేకంగా ఓ మెడికల్ వ్యాన్ ఏర్పాటు చేసి ఆదివాసీల ఆరోగ్య పరిరక్షణ బాధ్యతలు తీసుకున్నాడు కిరణ్.


వారసత్వంగా..

కిరణ్ తండ్రి రాజలింగు ఆర్ అండ్ బీలో గ్యాంగ్ మజ్దూర్‌గా పని చేసేవారు. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్యం అందించేవారు. ఆయన మరణానంతరం సేవా కార్యక్రమాలను వారసత్వంగా చేపట్టాలని అనుకున్నాడు కిరణ్. తండ్రి పేరు మీద గుమ్మడి రాజలింగు ఫౌండేషన్ ఏర్పాటు చేశాడు. ఉమ్మడి ఆదిలాబాద్, నల్గొండ, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో 2 వేల మందికి ఉచిత వైద్య చికిత్సలు అందించాడు. 650 మందికి సొంత ఖర్చుతో కంటి అద్దాలు అందించాడు. 150 మందికి రక్తం అందించాడు.


dr-gummadi-kiran2
కిరణ్ సేవలను గుర్తించిన బెంగళూరుకు చెందిన ఇండియన్ విక్టోరియల్ యూనివర్శిటీ ఫర్ పీస్ అండ్ ఎడ్యుకేషన్ విశ్వవిద్యాలయం కిరణ్‌కు గౌరవ డాక్టరేట్ అందించింది. 2017లో మాజీ గవర్నర్ రోశయ్య ది బెస్ట్ ఆప్తమాలజీ సర్వీస్ అవార్డును అందజేశారు. నాకు అన్నీ ఇచ్చిన ఈ సమాజానికి నా వంతుగా ఏదైనా చేయాలి.. అనుకునే మా నాన్న బాటలో ముందుకు వెళ్తున్నా అని చెబుతున్నాడు యువ సేవా తరంగం కిరణ్.


-పడమటింటి రవికుమార్

393
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles