సెల్‌ఫోన్ ఎక్కువగా వాడితే క్యాన్సర్ వస్తుందా?


Mon,December 24, 2018 01:19 AM

మా అబ్బాయి వయస్సు 32 సంవత్సరాలు. ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఎక్కువగా సెల్‌ఫోన్‌లో మాట్లడుతూ.. బ్రౌజ్ చేస్తూ ఉంటాడు. సెల్‌ఫోన్‌ను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని విన్నాను. ఇది నిజమేనా? మూ డేండ్ల వయసున్న మనవడు కూడా ఈ ఫోన్‌తోనే ఎక్కువ గడుపుతున్నాడు. వాళ్లను అలా చూస్తుంటే ఆందోళన రోజురోజుకూ పెరిగిపోతున్నది. వీటివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఏర్పడుతాయి?
-కనకలక్ష్మి, నిజామాబాద్
Councelling
కనకలక్ష్మి గారూ.. సెల్‌ఫోన్ నుంచి రేడియేషన్ వచ్చే మాట నిజమే. సెల్‌టవర్‌కు దూరంగా ఉన్నప్పుడు, సిగ్నల్ బలహీనంగా ఉన్నప్పుడు, కాల్ కనెక్టయ్యే ప్రయత్నం జరుగుతున్నప్పుడు రేడియేషన్ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల జనాలకు రకరకాల అనుమానాలు.. అపోహలు ఉన్నాయి. సెల్‌ఫోన్ ఎక్కువగా వాడితే మెదడులో గడ్డలు వస్తాయనేది కూడా ఇలాంటి ఒక అపోహే. సెల్‌ఫోన్ వాడితే క్యాన్సర్ వస్తుందని నిర్ధారిస్తూ ఇప్పటివరకైతే ఎలాంటి ఆధారాలూ లభించలేదు. పలు అధ్యయనాల ప్రకారం.. వీటి నుంచి రేడియేషన్ అయితే వెలువడుతుంది. అది క్యాన్సర్‌కు దారితీస్తుందా లేదా? అనేది మాత్రం నిర్ధారణ చేయలేం అనేది కొందరి అధ్యయనాలు తెలియజేస్తే.. సెల్‌ఫోన్ రేడియేషన్స్ వల్ల మెదడుకు క్యాన్సర్ సోకే ప్రమాదం పొంచి ఉందని కొందరి అధ్యయనాలు చెప్తున్నాయి. ఇలాంటి గందరగోళ అధ్యయనాల వల్లే మీలాంటివారు ఆందోళన చెందుతున్నారు.

అయితే తెలుసుకోవాల్సిన ఒక అంశం ఉంది. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ సెల్‌ఫోన్స్ వెలువరించే రేడియేషన్ స్థాయి తగ్గుతూ పోతుంది. సెల్‌ఫోన్ రేడియేషన్ గురించి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలు, అధ్యయనాలు పూర్తి వాస్తవాలను తేల్చిచెప్పేలోపు మనం కొన్ని ముందు జాగ్రత్తలను పాటించాలి. సెల్‌ఫోన్ రేడియేషన్‌కు సంబంధించిన సురక్షిత స్థాయి అంటూ స్పెసిఫిక్ అబ్జర్వేషన్ రేట్ (ఎస్‌ఏఆర్)ను నిర్ణయించారు. ఆ పరిధిలో ఉన్న ఫోన్‌లు వదలి సాధారణ ఫోన్‌లు వాడాలి. సంభాషణలు క్లుప్తంగా ఉండేట్లు చూసుకోవాలి. వాడటం తప్పనిసరి అయినప్పుడు హ్యండ్స్ ఫ్రీ అటాచ్మెంట్‌ను ఉపయోగించడం, మరీ చెవికి ఆనించి దగ్గరగా పెట్టుకోవడం కాకుండా కొద్ది సెంటీమీటర్ల దూరంలో ఉంచుకొని మాట్లాడటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. రింగ్ చేసిన నంబర్, కనెక్ట్ అయిన తర్వాత మాత్రమే సెల్‌ఫోన్‌ను చెవి వద్దకు తీసుకోవాలి. వీలైన సందర్భాల్లో ఎస్‌ఎంఎస్, యాప్ బేస్ద్ మెసేంజింగ్, డేటా సెర్చింగ్ వంటి అవసరాలకు మాత్రమే సెల్‌ఫోన్‌ను పరిమితం చేయాలి.

ప్రత్యేకించి పిల్లలను సెల్‌ఫోన్ వాడకానికి దూరంగా ఉంచాలి. పిల్లల మెదడు లేత కణాలతో కూడి ఉంటుంది. వాటిగుండా రేడియేషన్ నిరాకంటంగా ప్రయాణిస్తుంది. అందువల్ల సెల్‌ఫోన్ రేడియేషన్ ప్రభావం పెద్దవాళ్ళతో పోలిస్తే పిల్లల్లో చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గడిచిన ఐదారేళ్ల నుంచే మరీ ఎక్కువగా పిల్లల చేతుల్లోకి సెల్‌ఫోన్స్ చేరుతున్నాయి. పదేళ్ళు పోతేగాని సెల్‌ఫోన్ రేడియేషన్ ఎటువంటి ప్రభావం చూపుతుందన్నది కచ్చితంగా తెలిసిరాదు. అంతవరకు ముందుజాగ్రత్తలు తీసుకోవాలి.
-డాక్టర్ ఆనంద్ బాలసుబ్రమణ్యం సీనియర్ న్యూరోసర్జన్ యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్

753
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles