సీరియస్ పాత్రలు కూడా చేయాలనుంది


Sun,March 10, 2019 12:57 AM

ప్రవీణ్‌ను చూస్తే చిన్ననాటి నుంచి మనతో అల్లరల్లరిగా తిరిగే ఓ ప్రియమిత్రుడు స్ఫురణకు వస్తాడు. మాటల్లో విరుపులు, వ్యంగ్యం జోడించిన పంచ్‌లు, చక్కటి సంభాషణ చాతుర్యంతో తెలుగు హాస్యనటుల్లో అతనొక ప్రత్యేకమైన శైలిని సృష్టించుకున్నాడు. కొత్తబంగారులోకంతో చిత్రసీమలోకి అరంగేట్రం చేసిన ఆయన పదకొండేండ్ల ్ర పయాణంలో 120కిపైగా చిత్రాల్లో నటించారు. కెరీర్ సంతృప్తిగా సాగిపోతున్నది. ఇప్పటివరకు లభించిన గుర్తింపుతో చాలా సంతోషంగా ఉన్నాను. కెరీర్‌పరంగా పెద్ద లక్ష్యాలేవి లేవు. వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడమే అని అంటున్నారు ప్రవీణ్. ఆయన కీలక పాత్రలో నటించిన వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి చిత్రం ఈ నెల 15న ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా నమస్తే తెలంగాణతో ప్రత్యేకంగా సంభాషించారు ప్రవీణ్. ఆయన చెప్పిన సంగతులివి...
Praveen

వేరీజ్ ది వెంకటలక్ష్మి చిత్రంలో మీ పాత్ర చిత్రణ ఎలా ఉంటుంది?

-ఈ సినిమాలో చంటిగాడు, పండుగాడు పాత్రల్లో నేను, మధునందన్ కనిపిస్తాం. ఊరిలో ఓ అందమైన ఉపాధ్యాయురాలి వెంటపడుతుంటాం. మా ఇద్దరినీ ఆమె ఓ మంచి పనికోసం ఎలా ఉపయోగించుకుంది? ఊరికి మేలుచేకూరేలా మమ్మల్ని ఎలా ప్రయోజకులుగా మార్చేసిందన్నదే ఆసక్తికరంగా ఉంటుంది. ఆద్యంతం హాస్యప్రధానంగా సాగే చిత్రమిది. హీరోహీరోయిన్లతో పాటు మా రెండు పాత్రలకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది.

హాస్య నటులందరూ హీరోలుగా అరంగేట్రం చేస్తున్నారు. మీరు ఆ ప్రయత్నాలు ఏమైనా చేయబోతున్నారా?

-కమెడియన్స్ హీరోగా నటిస్తే బాగానే ఉంటుంది. అయితే రెండున్నరగంటల పాటు ప్రేక్షకుల్ని మెప్పించాలంటే అందుకు అద్భుతమైన కథ కుదరాలి. ఆద్యంతం నవ్వుల్ని పంచుతూ కథ సాగాలి. యాక్షన్ సినిమాలు చేయడానికి చాలామంది హీరోలు ఉన్నారు కాబట్టి..కామెడియన్స్ హీరోలుగా నటిస్తే యాక్షన్ జోలికి వెళ్లకపోవడమే మంచిది. అలాంటి అవుట్ అండ్ అవుట్ కామెడీ సబ్జెక్ట్‌తో ఎవరైనా నా దగ్గరకు వస్తే హీరోగా తప్పకుండా నటిస్తాను.

హీరోలుగా ప్రయత్నించిన హాస్యనటులు చాలామంది ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు?

-సినిమా ఫలితం కేవలం నటీనటుల చేతిలో ఉండదు. కథను తెరపైకి తీసుకురావడం మొదలుకొని జనాల వద్దకు చేరవేసేవరకు సినిమా అనేక ప్రక్రియల్ని దాటాల్సి ఉంటుంది. ఈ క్రమంలో జయాపజయాల్ని నిర్ధారించే అంశాలు చాలా ఉంటాయి. కాబట్టి ఎవరు హీరోలుగా నటించినా అంతిమంగా మంచి కథాబలం, ట్రీట్‌మెంట్ ఉన్న చిత్రాలే విజయాన్ని సాధిస్తాయి. ఈ సూత్రానికి ఎవరూ అతీతులు కారు.

ప్రస్తుతం మీ కెరీర్ ఎలా సాగిపోతున్నది. సినిమాలపరంగా అవకాశాలు ఎలా ఉన్నాయి?

-2008లో కొత్త బంగారులోకం సినిమా ద్వారా చిత్రసీమలోకి అరంగేట్రం చేశాను. ఈ పదకొండేడ్ల ప్రయాణంలో దాదాపు 125 సినిమాలు చేశాను. ప్రతీ చిత్రం చక్కటి అనుభూతుల్ని మిగిల్చింది. ఈ జర్నీలో కొత్తబంగారులోకం ప్రేమకథా చిత్రమ్ అఆ ప్రేమమ్ రౌడీఫెలో పటాస్ వంటి చిత్రాలు వ్యక్తిగతంగా ఎంతో సంతృప్తినిచ్చాయి. ప్రతీ సినిమాను నేను సమప్రాధాన్యతనిస్తాను. ఫుల్‌లెంగ్త్ క్యారెక్టర్ మొదలుకొని రెండు సీన్స్ ఉన్న పాత్ర వరకు ఒకే రకమైన అంకితభావంతో పనిచేస్తాను. నటుడిగా అది నా బాధ్యతగా భావిస్తాను.

ప్రస్తుతం పరిశ్రమలో కమెడియన్స్ మధ్య ఎలాంటి పోటీ ఉందనుకుంటున్నారు?

-ఆరోగ్యకరమైన వాతావరణంలో హాస్యనటులందరం పనిచేస్తున్నాం. ఒకరకంటే ఒకరికి మంచి గౌరవమర్యాదలున్నాయి.

11సంవత్సరాలుగా పరిశ్రమలో కొనసాగుతున్నారు. కెరీర్‌లో మీకు కావాల్సినంత గుర్తింపు లభించిందనుకుంటున్నారా?

-నాకు వచ్చిన అవకాశాలు, లభించిన గుర్తింపుతో చాలా సంతృప్తిగా ఉన్నాను. పరిశ్రమలో నాకు ఎందరో సన్నిహితులు ఏర్పడ్డారు. ఈ ప్రయాణంలో ఎప్పుడూ బాధపడిన సందర్భం లేదు. ఉన్నంతలోనే చాలా హ్యాపీగా జీవితాన్ని గడుపుతున్నాను.

Praveen1
ప్రస్తుతం జెర్సీలో హీరో నాని పక్కన ఫుల్‌లెంగ్త్ పాత్ర చేస్తున్నాను. మూడు కాలవ్యవధుల్లో జరిగే కథ అది. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలకంటే భిన్నమైన పాత్ర అది. కెరీర్‌లోనే కొత్త పాత్ర చేస్తున్నాననే ఫీలింగ్ కలిగింది. ప్రస్తుతం ఐదు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాను.

ప్రేమకథా చిత్రమ్ తర్వాత మీకు ఆ స్థాయిలో బ్రేక్‌నిచ్చే పాత్ర రాలేదని అంటుంటారు?

-అలాంటిదేమి లేదు. ప్రేమమ్ అఆ చిత్రాల్లో పూర్తినిడివి కలిగిన పాత్రలు చేశాను. అవి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ప్రస్తుతం నటిస్తున్న వేరీజ్ ది వెంకటలక్ష్మిలో కూడా నా పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఐదు ప్రధాన ప్రాతల్లో నాదొకటి.

తెలుగు కమెడియన్స్ అందరూ కలిసి ైఫ్లెయింగ్ కలర్స్ అని ఓ గ్రూప్‌ను క్రియేట్ చేశారు. దాని యాక్టివిటీస్ ఏమిటి?

-ధన్‌రాజ్ ఆ గ్రూప్‌ను క్రియేట్ చేశాడు. అందులో పదమూడు మంది కమెడియన్స్ చాలా యాక్టివ్‌గా ఉంటాం. సందర్భం వచ్చినప్పుడు మేమంతా సరదాగా కలుస్తుంటాం. ఆ టైమ్‌లో సోషల్‌మీడియాలో ఫొటోల్ని షేర్ చేస్తుంటాం.

కమెడియన్స్ చాలా మంది ఆన్‌లొకేషన్‌లోనే తమ పాత్ర తాలూకు డైలాగ్స్, బాడీలాంగ్వేజ్‌లో అవసరమైన మార్పులు చేస్తారని చెబుతుంటారు. మీ కెరీర్‌లో అలాంటి అనుభవాలేమైనా ఉన్నాయా?

/font>-అది పరిశ్రమలో సహజంగా జరిగేదే. దర్శకుడి అనుమతి తీసుకొని మా క్యారెక్టర్‌లో బెటర్‌మెంట్స్ కోసం సలహాలు ఇస్తుంటాం. మేము ఇచ్చే ఇన్‌పుట్స్ వల్ల మరింత సీన్ ఎలివేట్ అవుతుందనే భావన కలిగినప్పుడే అలా చేస్తుంటాం. అంతేకానీ స్క్రిప్ట్, సంభాషణల మార్పు విషయంలో మేము ఎటువంటి జోక్యం చేసుకోం.

కమెడియన్స్‌లో మీకు బాగా స్ఫూర్తినిచ్చిందెవరు?

-నా మీద చాలా మంది ప్రభావం ఉంది. ఒక్కరి పేరు చెప్పలేను. జన్మతః శరీరభాషలో హాస్యం ఉన్నవాడే కమెడియన్ అవుతాడు. హాస్యప్రియత్వం ఉన్నవారే హాస్యనటులు కాగలుగుతారు.

నటుడు, కమెడియన్... రెండు పాత్రల్లో మీరు దేనికి ఎక్కువ గుర్తింపును కోరుకుంటారు?

-నేను ఆ విషయం గురించి ఆలోచించలేదు. ఇప్పటివరకు అయితే హాస్యనటుడిగానే నేను గుర్తింపు సంపాదించుకున్నాను. కామెడీతో పాటు మున్ముందు బలమైన భావోద్వేగాలు మేళవించిన సీరియస్ పాత్రలు చేయాలనుంది.

ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో హాస్యనటుల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు?

-చాలా బాగా చూసుకుంటారు. వ్యక్తులతో ఉండే సాన్నిహిత్యాన్ని బట్టి కంఫర్ట్ లెవల్స్ మారుతుంటాయి. అయితే ఓవరాల్‌గా అందరూ సుహృద్భావంతోనే ఉంటారు.

స్వతహాగా మీరు ఎలాంటి పాత్రలకు ప్రాధాన్యతనిస్తారు?

-ప్రత్యేకమైన పాత్రలంటూ ఏమీలేవు. ఫుల్‌లెంగ్త్ క్యారెక్టర్ చేస్తే ఎక్కువ సంతృప్తి దొరుకుతుంది. సినిమా కథలో కీలక మలుపులకు మన పాత్ర కారణమైతే దానికి ఎక్కువ గుర్తింపు లభిస్తుందన్నది నా అభిప్రాయం. అలాంటి పాత్రలు దొరుకాలని కోరుకుంటాను. ఈ మధ్యకాలంలో నెగెటివ్, సీరియస్ క్యారెక్టర్ చేయాలనే ఆలోచన వస్తున్నది.

ఒక సినిమా విజయంలో హాస్యనటుల పాత్ర ఎంతవరకు ఉందనుకుంటారు?

-ప్రస్తుతం వినోదప్రధాన చిత్రాల్ని ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారు. కామెడీ ప్రధానంగా దర్శకులు, రచయితలు కథల్ని రాసుకున్నప్పుడు కమెడియన్స్‌కు ఎక్కువ అవకాశాలు దొరుకుతాయి. వారి భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. జంధ్యాల, ఇ.వి.వి.సత్యనారాయణ వంటి పెద్ద దర్శకులు ఒక్క సినిమాలో 30కి పైగా హాస్యపాత్రలకు చోటు కల్పించేవారు.

ప్రస్తుతం వెబ్‌సిరీస్‌లు చాలా ప్రాచుర్యం పొందుతున్నాయి. వాటిలో మీరు నటించే అవకాశ ఉందా?

-వెబ్‌సిరీస్‌ల కోసం కొందరు నన్ను సంప్రదించారు. కథ నచ్చితే తప్పకుండా చేద్దామనుకుంటున్నాను. అది కూడా నటనే కదా. భవిష్యత్తులో వెబ్‌సిరీస్‌లకు మంచి డిమాండ్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి అటు వైపు కూడా ప్రయత్నం చేయాలని ఉంది.

రౌడీఫెలో చిత్రంలో నారా రోహిత్ పక్కన కానిస్టేబుల్ పాత్రను చేశాను. చివరలో నమ్మకద్రోహం చేసే నెగెటివ్ క్యారెక్టర్ అది. ఆ తరహా పాత్రను మళ్లీ ఇప్పటివరకు చేయలేదు. ఆ సినిమా సక్సెస్ అయితే కామెడీ కాకుండా వేరే జోనర్‌లో కూడా కొత్తరకమైన పాత్రలు చేయొచ్చనుకున్నాను. అయితే ఆ సినిమా ఫెయిల్యూర్ నన్ను బాగా నిరాశపరిచింది.

సినిమాల్లో నేను కోస్తా ప్రాంతం యాసలోనే మాట్లాడతానని అనుకుంటారు. వాస్తవానికి నాకు తెలంగాణ యాసపై కూడా మంచి పట్టుఉంది. చిక్కడపల్లిలో నేను కొంతకాలం విద్యాభ్యాసం చేశాను. ఆ ప్రాంతంలో మంచి మిత్రులుకూడా ఉన్నారు. స్నేహగీతం చిత్రంలో దర్శకుడు మధురశ్రీధర్‌రెడ్డిగారు నాతో పూర్తిగా తెలంగాణ యాసను పలికించారు.

-సినిమా డెస్క్

564
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles