సిరులొలికించే కురులు


Sat,February 23, 2019 02:57 AM

దాదాపు కొన్ని వందల రకాల హెయిర్ ఎక్స్‌టెన్షన్‌లు మార్కెట్‌లో దొరుకుతున్నాయి. ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్ చేస్తే ఇంటికే వచ్చి మీ జుట్టు ఏ టైప్.. మీకు ఎంత కొలతలో ఎక్స్‌టెన్షన్ కావాలన్నది తెలుసుకుంటారు. లేదా మీరు వాళ్ల దగ్గరకు వెళ్లి ఆర్డర్ ఇచ్చినా తీసుకుంటారు. ఈ ఎక్స్‌టెన్షన్‌లలో రెండు రకాలుంటాయి. ఒకటి.. టిక్‌టాక్స్‌తో వస్తాయి. వీటిని జుట్టు మధ్యలోకి దూర్చి పెట్టుకోవడమే. ఇక రెండోది.. వాల్యూమైజర్ ఎక్స్‌టెన్షన్. ఇదొక బన్‌లా ఉంటుంది. దీనికి చుట్టూ హెయిర్ వస్తుంది. దాన్ని జుట్టు పైకి లేపి అతికిస్తే సరిపోతుంది. మగవాళ్లకి, ఆడవాళ్లకి సపరేట్‌గా ఈ ఎక్స్‌టెన్షన్స్ లభిస్తాయి. ఆడవాళ్లకు.. 14 నుంచి 28 ఇంచుల పొడుగు వరకు జుట్టు అమ్ముతారు. పొడుగును బట్టి డబ్బులుంటాయి. విగ్‌లు కూడా కస్టమైజ్డ్ చేసి ఇస్తారు. ఎక్స్‌టెన్షన్స్, విగ్గులు సుమారు 7 వేల నుంచి సుమారు 25వేల వరకు లభిస్తాయి.

జుట్టున్నమ్మ ఎలాంటి కొప్పయినా వేయొచ్చనేది సామెత.. కానీ దుమ్ము, ధూళి కారణంగా.. ఒత్తిడి వల్ల.. విష జ్వరాలు.. క్యాన్సర్ బారిన పడినప్పుడు.. ఎక్కువ ప్రభావం పడేది జుట్టు పైనే.. అందుకే కొప్పు వేయడం మాట అటుంచి.. కనీసం జడ వేసేంత జుట్టు అయినా మిగిలితే చాలనుకునేవాళ్లున్నారు.. ఈకల్లా మారిన జుట్టుతో నలుగురిలోకి వెళ్లలేక ఇబ్బందులు పడేవాళ్లెంతోమంది.. వారంతా హెయిర్ ఎక్స్‌టెన్షన్స్.. విగ్గులతో.. సమస్యను దూరం చేసుకోవొచ్చు.. మరి అవి అమ్మేదెవరు? ఎక్కడ దొరుకుతాయి? ఇండస్ హెయిర్ ఎక్స్‌టెన్షన్ పేరుతో.. సుమిత కందిమళ్ల ఈ వ్యాపారం చేస్తున్నది.. తలకట్టుకు సరిగ్గా సరిపోయే జుట్టును అరవై దేశాలకు ఎగుమతి చేస్తున్నది.. జుట్టు ఊడడానికి చాలా కారణాలుంటాయి. ఆడ, మగ తేడా లేకుండా బట్టతల వచ్చేస్తుంటుంది. దీంతో నలుగురిలో వెళ్లాలంటే ఇబ్బంది పడేవాళ్ల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు హెయిర్ ఎక్స్‌టెన్షన్స్, విగ్గులను వాడొచ్చు. అయితే ఇవి పెట్టుకున్నా.. పక్క వాళ్లకు విషయం అర్థం కాకుండా నీట్‌గా ఉండాలి. అలా ఉండేలా చేస్తూ.. సరికొత్త వ్యాపార సూత్రాన్ని ప్రారంభించింది సుమిత కందిమళ్ల. పొనీటెయిల్, కర్లీ హెయిర్.. ఇలా ఒక్కటేమిటి మీ జుట్టులో కలిసిపోయేలా ఈ సరికొత్త జుట్టు యాడ్ అయ్యేలా ఇస్తుంది. ఆన్‌లైన్ సర్వీస్‌తో ఆర్డర్ తీసుకొని మీ ఇంటికే పట్టులాంటి జుట్టును పంపిస్తారు.
hair
సొంత బిజినెస్: హైదరాబాద్‌లో పుట్టి, పెరిగిన సుమిత.. భోజిరెడ్డి కాలేజ్‌లో కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసింది. 2001లో పెండ్లి చేసుకొని యూఎస్ వెళ్లిపోయింది. 2005లో ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంది. అప్పటికి గ్రీన్‌కార్డ్ కూడా వచ్చేసింది. ఇక రేపు ఉద్యోగంలో జాయినవ్వాల్సి ఉండగా.. రాత్రి భర్తని లేపి ఉద్యోగం చేయాలని లేదని చెప్పింది. ఆయన ఎందుకు? అనే ప్రశ్న వేశాడు. దానికి సుమిత ఒకరి కింద పనిచేసే బదులు.. సొంతంగా ఏదైనా బిజినెస్ చేస్తే బాగుంటుందనే ఆలోచనను పంచుకుంది. ఆయనకు ఏం చెప్పాలో తెలియక ఆ రాత్రి ఓకే అంటూ నిద్రపోయాడు. పుట్టింట్లో, అత్తగారింట్లో ఎవరూ బిజినెస్ చేసిన దాఖలాలు లేవు. పైగా అమెరికాలో బిజినెస్ అంటే మాటలు కాదని తెలుసు. కానీ సుమితలో ఏదో చేసి తీరాలనే తపన, కసి మొదలయ్యాయి.
hair1
పరదాలే పనికొచ్చాయి: సుమితకి ఏదైనా క్రియేటివ్‌గా చేయాలని ఉండేది. హ్యాండ్ క్రాఫ్ట్స్ ఎక్స్‌పోర్ట్ చేయాలనుకున్నది. కానీ అప్పటికే చాలామంది ఆ బిజినెస్‌లో ఉన్నారని విరమించుకుంది. ఇంతలో ఇండియాకు రావాల్సి వచ్చింది. ఇక్కడికి వచ్చాక చాలామంది కర్టెన్లను బ్యాగుల్లో సర్దుకొని యూఎస్‌కి తీసుకెళ్లడం గమనించింది. వెంటనే లిబర్టీలోని భవాని ఫర్నీచర్ వాళ్లతో టై అప్ అయింది. షిప్పింగ్ మాత్రమే చేస్తే క్రియేటివిటీ ఏముంటుందనుకుంది సుమిత. అందుకే వాటి డ్రేపింగ్.. ఇతర కలరింగ్స్ మీద దృష్టి పెట్టింది. దానికి సంబంధించిన ప్రజెంటేషన్ కోసం ఫొటోషాప్‌లాంటివి నేర్చేసుకుంది. యూఎస్ తిరిగి పయనమైంది. అక్కడికి వెళ్లాక చిన్న చిన్న ప్రాజెక్ట్‌లు చేసింది. అలా రెండు సంవత్సరాలు ఈ బిజినెస్ బాగా నడిచింది.

కొత్త కొత్తగా: మనకు ఒక దాంట్లో లాభం వస్తుందని అక్కడితోనే ఆగిపోకూడదు అనేది సుమిత సిద్ధాంతం. ఇంకా ఏదో చేయాలనే తపన. అందుకే ఇదే బిజినెస్‌ని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లాలనుకుంది. తన వర్క్ చూసి ఇంటిరీయర్ డిజైనింగ్ కంపెనీ గంట చొప్పున డబ్బులు ఇచ్చి ఉద్యోగమిచ్చింది. కొంతకాలానికి బిల్డర్స్‌తో మోడల్ హోమ్స్‌కి కూడా పూర్తి ఇంటీరియర్ చేయడం మొదలుపెట్టింది. మంచి లాభాలు వచ్చాయి. జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో అనుకోని ఒక సంఘటన వల ఆ బిజినెస్‌ని పక్కకు పెట్టాల్సి వచ్చింది. షిప్‌మెంట్ లేట్ అయింది. దాంతో బిల్డర్ కాస్త రూడ్‌గా మాట్లాడాడు. కర్టెన్లు షిప్పింగ్ చేసుకోవడం కాదు.. మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ఇలాంటి గొడవలు రావనుకుంది. అలా కశ్మీర్ నుంచి క్రుయల్ ఫ్యాబ్రిక్స్‌ని తనే కాంబినేషన్లు చెప్పి నేయించేది. యూఎస్‌లో ఆ కర్టెన్లు స్టిచ్చింగ్ చేయించి అలా తనే ఒక సరికొత్త ఒరవడికి నాంది పలికింది. 2006లో ఎమ్‌డీఎస్ పేరుతో ఆ కంపెనీకి నామకరణం చేసింది. 2008లో యూఎస్‌లో జరిగిన ట్రేడ్ షోలో తన ప్రొడక్ట్స్‌ని ప్రజెంటేషన్ ఇచ్చింది. వాళ్లు సుమిత వర్క్ నచ్చి తన దగ్గర నుంచి ఫ్యాబ్రిక్‌లను కొనుక్కోవడానికి సిద్ధమయ్యారు. అలా 2010 వరకు ఇదే బిజినెస్‌లో ఉంది. ఇక తను లేకున్న వ్యాపారం నడుస్తుందని భావించింది. ఇండియాకి తిరిగి రావాలనుకుంది.

ఇండియాకు రాక: ముందు నుంచి సుమితకు ఇండియాలో ఉండాలనే ఆశ. అందుకే అట్లాంటాలో బిజినెస్ పూర్తిగా సెట్ చేసింది. 2011లో ఇండియాకు వచ్చేసింది. అక్కడ భర్త మొత్తం సెట్ చేసి ఒక సంవత్సరంలో వస్తానని చెప్పారు. అప్పటిదాకా ఎలా ఉండాలని ఆలోచించింది. తనకు నెయిల్‌పాలిష్ వేయడమంటే సరదా. దాన్నే ఒక ఉపాధిగా కూడా మార్చుకోవచ్చని గ్లామ్ నెయిల్ పేరుతో నెయిల్‌పాలిష్ పెన్నులను అమ్మింది. ఇవి మిగతా వాటితో పోలిస్తే కాస్త డిఫరెంట్. వీటితో నెయిల్ ఆర్ట్‌లు వేసుకోవడం చాలా సులువు. నుమాయిష్‌లో మొదట దీన్ని పరిచయం చేసింది. అలా ఆర్డర్లు పెరిగాయి. కాకపోతే వీటిని యూఎస్ నుంచి తెప్పించి తయారు చేయాలి. దిగుమతి కష్టంగా మారడంతో ఈ గ్లామ్ నెయిల్‌కి ఫుల్‌స్టాప్ పడింది.

జుట్టు ప్రయోగాలు : ఒకసారి సుమిత భర్త ఫ్రెండ్ హ్యూమన్ హెయిర్ గురించి ఆరా తీశాడు. ఇండియా వాళ్ల హెయిర్ చాలా బాగుంటుంది. దానికి బిజినెస్ కూడా ఎక్కువని అనడంతో అటువైపుగా వారిద్దరి ఆలోచనలు మొదలయ్యాయి. తెలంగాణలో అప్పటిదాకా దీనికి సంబంధించిన ఫ్యాక్టరీలు లేవని తెలిసింది. అయితే దిగితే గానీ దీని లోతేంటో అర్థం కాలేదు సుమిత దంపతులకు. ఎక్స్‌టెన్షన్స్ ఎలా చేయాలనే దానికి ఇంట్లోనే ప్రయోగాలు మొదలుపెట్టింది. చిక్కులు పడకుండా, కలరింగ్ విషయంలోనూ అన్ని జాగ్రత్తలు తీసుకుంది. యూఎస్‌లోని ఎక్స్‌పర్ట్స్‌ని ఇండియాకి పిలిపించి వారి దగ్గర శిక్షణ తీసుకుంది. అలా ఇండస్ ఎక్స్‌టెన్షన్ మొదలైంది. మెహదీపట్నంలో వీరికి ఒక ఇల్లు ఉంది. దాన్ని ఖాళీ చేయించి అక్కడ ఈ ఫ్యాక్టరీ ప్రారంభమైంది. కానీ వాళ్లు అక్షన్‌కి తీసుకున్న జుట్టు వాళ్లనుకున్న రేంజ్‌లో రాలేదు. దీంతో మొదటిసారి బిజినెస్‌లో నష్టం చవిచూసింది. దానికితోడు తను నమ్మి పెట్టుకున్న కొంతమంది ఉద్యోగులు కూడా మోసం చేయడంతో మరింత దెబ్బ. అయినా వెనుకడుగు వేయకుండా కొనసాగిస్తున్నది.
hair2

సెలూన్ మొదలు పెట్టాలని..

చిన్నప్పుడు భరతనాట్యం నేర్చుకున్నా. పదో తరగతి వరకు క్లాసికల్ డ్యాన్స్‌లో పర్ఫ్‌మెన్స్ ఇచ్చిన. నాకు మెడిసిన్ చేయాలని కోరిక ఉండేది. కానీ కుదరలేదు. నాలో నాయకత్వపు లక్షణలెక్కువ. అందుకే మొదటి నుంచి నాకు ఉద్యోగం చేయడం కన్నా బిజినెస్ ప్రారంభించాలనే ఆలోచన ఎక్కువ ఉండేది. అలా అనుకోకుండా ఇంటీరియర్ డిజైనరయ్యాను. ఆ తర్వాత ఒక కంపెనీనే మొదలుపెట్టాను. ఇప్పటిదాకా మేం సుమారు 60 ఇతర దేశాలకు ఎక్స్‌టెన్షన్లు, విగ్గులను అమ్ముతున్నాం. ఇండియాలో ఈ బిజినెస్ కాస్త తక్కువనే చెప్పాలి. అడపదడపా వచ్చినా ఈ బిజినెస్‌ని మరింత పెంచాలనే ఆలోచనలో ఉన్నాం. హైదరాబాద్‌లో సెలూన్‌ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నాం. త్వరలో ఓ పెద్ద కంపెనీతో ఈ బిజినెస్‌ని విస్తృతం చేయాలనే ఆలోచన కూడా ఉంది. నచ్చిన, మెచ్చిన జుట్టును మేం ఇస్తున్నాం కాబట్టే మా బిజినెస్ పెరుగుతున్నది. మరిన్ని వివరాల కోసం www.indushairextensions.com చూడొచ్చు అంటున్నది సుమిత.

-సౌమ్య నాగపురి
-జి. భాస్కర్

1330
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles