e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, May 12, 2021
Home జిందగీ సిరిసిల్ల పాటల సిలక!

సిరిసిల్ల పాటల సిలక!


సంగీతం నేర్చుకోవాలనేది ఆమె కల. నేర్చుకున్నది. తర్వాత ఏం చేయాలి? డిగ్రీ చేసి మ్యూజిక్‌ టీచర్‌ కావాలని లక్ష్యం పెట్టుకున్నది. అది అంత ఈజీనా? ఆ లోపు టాలెంట్‌ ఏంటో నిరూపించుకోవాలని, జానపదాలవైపు మళ్లింది నాగలక్ష్మి సుంకోజు.

అమ్మాయిలకు బంగారం అంటే చాలా ఇష్టం. నాగలక్ష్మి బంగారాన్ని చూస్తూనే పెరిగింది. పసిడి ధగధగలకన్నా పాటల మిలమిలలే ఆమెకు ఇష్టం. చిన్నప్పటి నుంచే పాడటం మొదలుపెట్టింది. పాటతోపాటు పెద్దవుతూ ఇప్పుడు జానపద జాతరలో మేటిగా నిలిచింది నాగలక్ష్మి సుంకోజు. ఆమె పాటల ముచ్చట్లు..

సిరిసిల్ల పాటల సిలక!

మాది స్వర్ణకారుల కుటుంబం. మా ఊరు సిరిసిల్ల దగ్గర తంగల్లపల్లి. మా నాన్న సత్యనారాయణ సుంకోజు. ఆభరణాలు చేస్తడు. అమ్మ అరుణ. మేం ముగ్గురం ఆడపిల్లలం. మా తాత లక్ష్మయ్య ఊర్లో హరికథలు చెప్తుండేదట. ఆయన కళే నాకు వారసత్వంగా వచ్చిందని అంటుంటరు.

నలుగురిలో నేను..
అప్పుడు నేను మూడో తరగతి. స్కూల్లో యాన్యువల్‌ డే ప్రోగ్రామ్‌. పాటలు, డ్యాన్స్‌, డ్రామాలు అంటే ఇంట్రెస్ట్‌ ఉన్నవాళ్లు చేతుల్లేపండి’ అని అనౌన్స్‌ చేసిండ్రు. నేను, ఇంకో ముగ్గురు మాత్రమే ‘పాటలు పాడతం’ అని పేరు రాయించుకున్నం. టీచరే ఒక పాట ఇచ్చి ప్రాక్టీస్‌ చేయించింది. మూడు రోజుల ప్రాక్టీస్‌ తర్వాత ‘నాలో నిను చూసుకోగా నాతో మురిపించుకోగా’ పాట పాడిన. అందరూ మెచ్చుకున్నరు. ‘పెద్ద సింగర్‌వైతవ్‌’ అన్నరు.

పేరెంట్స్‌ మీటింగ్‌లో..
మధుప్రియ పాటలు బాగా వింటుండేదాన్ని. సీడీ వేసుకొని ప్రాక్టీస్‌ చేద్దును. అప్పుడు నేను ఆరో తరగతి. స్కూల్లో పేరెంట్స్‌ మీటింగ్‌ జరుగుతున్నది. స్టూడెంట్స్‌ ప్రతిభ ఎలా ఉందో టీచర్లు పేరెంట్స్‌కు చెప్తున్నరు. తమ పిల్లలగురించి తల్లిదండ్రులకు అక్కడే అర్థమైతుంది. అట్లా నా వంతు వచ్చింది. ‘పాటలు బాగా పాడుతది’ అని మెచ్చుకొని ఒక పాట పాడమన్నరు టీచర్లు. ‘ఆడపిల్ల ఆడాపిల్ల ఆడాపిల్లనటా నేను పాడూ పిల్లనటా’ పాట పాడిన. నాన్న సప్పుడు చేయలే. ఇంటికి వచ్చేసినం.

నాన్న మెచ్చుకోలు
మీటింగ్‌ అయిన మల్ల తెల్లారి, ‘నాన్నా! నేను పాడితే అందరూ మెచ్చుకుండ్రు. నువ్వేమో సైలెంట్‌గా ఉన్నవ్‌. నచ్చలేదా?’ అని అడిగిన. ‘నచ్చక పోవడం కాదురా. సంతోషాన్ని బిగ వట్టుకున్నా. ఇంటి కొచ్చినంక చెప్పుదామని అక్కడేమీ అనలేదు. మస్తు పాడినవ్‌ బిడ్డా. ఇప్పుడు చెప్తున్నా సూడూ! నీకు పాటలంటే ఇష్టముంటే నేర్చుకో. మంచిపేరు సంపాదించు’ అని చెప్పిండ్రు. చాలా సంతోషమైంది. ‘నాన్న కోసమైనా బాగా పాడాలె’ అనిపించింది. ఇట్లా ప్రతీ తరగతికి మెరుగవుతూ టెన్త్‌ అయిపోయేసరికి పాటపై స్పష్టమైన అవగాహనకు వచ్చిన.

స్వరాలయ సంగీతం
టెన్త్‌ తర్వాత మా టీచర్‌ నాకో సలహా ఇచ్చిండ్రు. ‘నీ గొంతు బాగుంది. అద్భుతంగా పాడగలవు. నువ్వు ఎప్పటికీ కొనసాగించాల్సిన ప్రక్రియ పాట. ఇదే నీకు కెరీర్‌ అవుతుంది. నాకు తెలిసిన ఫ్రెండ్‌ ఒకావిడ సంగీతం నేర్చుకుంటుంది. నీకు ఆసక్తి ఉంటే చెప్పు. ఆమెకు అటాచ్‌ చేసి పంపుతా’ అన్నరు. టీచర్‌ నా మేలుకోసం అంత మంచిగ చెప్తే కాదంటనా? ‘నేర్చుకుంటా మేడమ్‌’ అన్నాను. సిరిసిల్లలోని ‘స్వరాలయ మ్యూజిక్‌ అకాడమీ’లో చేరిన. మూడేండ్లు పూర్తయింది. ప్రస్తుతం వేములవాడలోని ధార్మిక కాలేజీలో ఎఫ్‌జెడ్‌సీ డిగ్రీ ఫస్టియర్‌ చదువుతున్నా. సంగీతం నేర్చుకుంటూనే చాలా కాంపిటీషన్స్‌లో పాల్గొన్నా. అప్పటి వరకు స్కూల్‌ ప్రోగ్సామ్‌లోనే పాల్గొన్న నాకు, ఇదంతా కొత్తగా అనిపించింది. నేర్చుకోవడానికి అవకాశం లభించినట్లయింది. ఎక్కువగా అన్నమయ్య కీర్తనలు, సినిమా పాటలు పాడుతుండేదాన్ని.

తొలి అవకాశం
స్వరాలయ అకాడమీలో నేర్చుకుంటున్నప్పుడు ఒకరోజు ప్రవీణ్‌ కాయితోజు సార్‌ అక్కడికి వచ్చిండ్రు. మా సార్‌ అతనికి ఫ్రెండ్‌ అంటా. అప్పటికే ప్రవీణ్‌ సార్‌కు ఫోక్‌లో మంచి పేరున్నది. ‘కొత్త సాంగ్‌ తీస్తున్నం. ఎవరన్నా బాగా పాడే అమ్మాయి ఉంటే చూడు’ అని మా సార్‌తో అంటే, ఆయన నా పేరు చెప్పిండ్రు. నన్ను అడిగితే ‘ఓకే’ అన్నాను. డెమోగా ఒక పాట పాడించి ఫైనల్‌ చేసిండ్రు. ఫస్ట్‌ పాట సాయిబాబా మ్యూజిక్‌లో ‘జొన్నశేను కాడ పిల్లా’. ఈ పాట మంచి గుర్తింపును తీసుకొచ్చింది. దాని తర్వాత ‘నల్లమద్ది చెట్లా కిందా’ పాడిన. నా కెరీర్‌కు పునాది పడినట్లయింది.

ఇష్టంతో పాడిన పాట
ఇప్పటిదాకా నేను దాదాపు 80 జానపద పాటలు పాడిన. వాటిలో నాకు టర్నింగ్‌ పాయింట్‌ ‘రామగిరి పోదామె రాయే సెల్లెలా’ పాట. అసలు మామూలు స్పందన కాదు. ఎక్కడికి వెళ్లినా నన్ను ‘రామగిరి నాగలక్ష్మి కదా’ అనేంత పేరు తీసుకొచ్చింది. ఈ పాటను నక్క శ్రీకాంతన్న వాళ్ల అమ్మ లక్ష్మి రాసింది. ఆ తర్వాత నాకు బ్రేక్‌ ఇచ్చిన పాట ‘జొన్న సేన్ల నువు నిలుచుంటే’ పాట. యూట్యూబ్‌లో ఓ ఊపు ఊపింది. రామగిరి పాట నాకు పేరు తీసుకొస్తే, జానపదంతో ఎప్పటికీ గుర్తుండి పోయేట్లుగా జొన్న సేన్ల పాట చేసింది. ‘సిరిమల్లె చెట్టుకింద సిరిచందన’ పాట చానా ఇష్టంతో పాడిన.

మ్యూజిక్‌ టీచర్
సంగీతం నాలుగ్గోడల మధ్య సాగే ప్రక్రియ. రాణించాలంటే కొంత సమయం పడుతుంది. పైగా సినిమాలకు మాత్రమే పాడే అవకాశం ఉంటుంది. జానపదం అయితే ఇటు సినిమాలకు పాడొచ్చు, అటు పల్లె పదాలు పాడొచ్చు. కాబట్టి, సినిమాల కోసమే అని ఎదురుచూస్తూ ఖాళీగా ఉండే బదులు ఏదో ఒకటి చేసి యాక్టివ్‌గా ఉండాలన్న ఉద్దేశ్యంతో జానపదం వైపు మళ్లిన. పల్లె పదాలద్వారా జీవితం తెలుస్తుంది. డిగ్రీ తర్వాత సంగీతం టీచర్‌గా స్థిరపడి నాలాంటి ఎంతోమందికి సంగీతం నేర్పాలన్నది నా లక్ష్యం.

షూట్స్‌నుంచి వచ్చేసరికి లేట్
అవుతుంటే, ఒక్కోసారి ‘ఎందుకురా’ అంటరు నాన్న. కానీ, అది అప్పటి మందమే. నేను పాడటం నాన్నకు, అమ్మకు ఇష్టం. అప్పుడప్పుడు పాటలు ప్రాక్టీస్‌ చేస్తుంటే ‘ఎప్పుడూ ఏం ఒర్లుడే’ అని అంటుంటరు. కానీ, ఎక్కడ నాకు షూటింగ్‌ ఉన్నా నాన్ననే తీసుకెళ్లి మల్లా తీసుకొస్తడు.
ఆ సపోర్ట్‌ వల్లే ఇక్కడిదాకా వచ్చిన.

దాయి శ్రీశైలం

Advertisement
సిరిసిల్ల పాటల సిలక!
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement