సిరిధాన్యాల.. చెల్లెండ్ల సంఘం జాతర!


Sat,February 9, 2019 02:11 AM

మన పూర్వీకులు ఏం తినేవాళ్లు? చాలా గట్టిగా ఉండేటోళ్లు. పైగా వందేళ్లు బతికుండేటోళ్లు. ఇప్పుడున్న బీపీ.. షుగర్‌ల వాసనైతే వాళ్లకు తెలియనే తెలియదు. అప్పటికీ.. ఇప్పటికీ ఈ తేడా ఏంటి? ఆధునికతేమో ఆకాశానికెక్కుతున్నది. ఆరోగ్యాలేమో పాతాళంలో పాతరపెట్టేస్తున్నాయి. ఏదో ఒకటి చేసి తిరిగి పాతతరం లెక్క ఆరోగ్యంగా ఉండలేమా? ఉండొచ్చు.. అది ఒక్క పాత తరహా పంటలతోనే! మన పూర్వీకుల ఆరోగ్య.. ఆయుష్షు మంత్ర చిరుధాన్యం. కొర్రలు తిని నాలుగు అర్రలకు ఒకేరోజు రాళ్లు లేపేవాళ్లు. సామలు తిని సాయంత్రం దాకా ఉండేవాళ్లు. జొన్నరొట్టె తిని జోరుమీద పనిచేసేవాళ్లు. ఆ గట్టిదనమే వాళ్లను వందేండ్లు బతికించింది. ఏ రోగమూ నొప్పీ లేకుండా కాపాడింది. మళ్లీ ఆ పాత పంటలైన కొర్రలు.. సామలు.. తైదలు.. సజ్జలు.. జొన్నలు.. అవిసెలు తింటేనే ఆరోగ్యంగా.. ఆయుష్షుతో ఉండొచ్చు అంటున్నారు సిరిధాన్యాల చెల్లెండ్ల సంఘం మహిళలు. సిరిధాన్యాల పట్ల అవగాహన కల్పించేందుకు గత ఇరవైయేండ్లుగా ప్రజల్లో.. రైతుల్లో అవగాహన కల్పిస్తున్నారు.
Dhanyam

పాత పంటల జాతర

ఎక్కడైనా దేవతను కొలుస్తారు. మొక్కులు చెల్లిస్తారు. నైవేధ్యాలు సమర్పిస్తారు. కానీ సంగారెడ్డి జిల్లాలోని కొన్ని మండలాల్లో విత్తనాలను కొలుస్తారు. ఎద్దును.. ఎవుసాన్ని తలుస్తారు. దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ ద్వారా ప్రతీయేటా నెలరోజుల పాటు జాతర నిర్వహిస్తారు. ఈ జాతరను పాత పంటల జాతరగా పిలుస్తుంటారు. జనవరి 14వ తేదీన జహీరాబాద్ మండలం అర్జున్ నాయక్ తండాలో అట్టహాసంగా ప్రారంభమైంది ఈ జాతర. ప్రజల్లో చిరుధాన్యాలపై అవగాహన కల్పించడమే ఈ జాతర ముఖ్య ఉద్దేశం. దీంట్లో భాగంగా మహిళా రైతులు తాము పండించిన పంటలను ప్రదర్శిస్తున్నారు. సేంద్రియ ఎరువుల ఆవశ్యకత.. మిశ్రమ పంటల సాగుపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ జాతరకు కర్ణాటక.. మహారాష్ట్ర.. గుజరాత్.. ఒడిశా.. తమిళనాడు.. నాగాలాండ్ వంటి రాష్ర్టాల నుంచి కూడా రైతులు తరలివస్తుండటం పాత పంటల జాతర ప్రాముఖ్యాన్ని తెలియజేస్తున్నది.

ఎక్కడ జరుగుతున్నాయి?

సంగారెడ్డి జిల్లా.. జహీరాబాద్.. ఝరాసంగం.. న్యాలకల్.. రాయికోడ్ మండలాల్లో1999లో ప్రారంభమైంది ఈ జాతర. ఈ సంవత్సరం జహీరాబాద్, కోడెం, మొగురం మండలాల్లోని 23 గ్రామాల్లో జరుగుతున్నది. కార్యక్రమం జరుగుతున్నది సంగారెడ్డిలోనే అయినా వివిధ ప్రాంతాల నుంచి ఈ ఉత్సవాలకు వెళ్తున్నారు చాలామంది. సిరిధాన్యాల ఆవశ్యకత ఏంటి? ఆరోగ్య ప్రదాయినిగా అవి ఎలా నిలుస్తున్నాయో ఈ జాతర ద్వారా ప్రజలకు అర్థమయ్యేట్లు సందేశాలు ఇస్తున్నారు. వ్యవసాయంలో సిరిధాన్యాల సాగు తగ్గిపోయి వాణిజ్య పంటలకే ప్రాధాన్యం ఇస్తున్న సమయంలో తిరిగి పాత పంటలవైపు రైతుల దృష్టి మళ్లించేందుకు ఈ జాతర దోహదం చేస్తున్నది. అంతరించిపోయే దశకు చేరుకున్న సిరిధాన్యాల సాగు ప్రాముఖ్యతను దశదిశలా చాటేలా చేస్తున్నది.
Dhanyam4

అత్తా కోడళ్ల ఆట పాటలు

ఊరికో సంఘం ఉందిక్కడ. అదే కోడళ్ల సంఘం. ఏం చేస్తుంది ఈ సంఘం అంటే.. అత్తల నుంచి వారసత్వంగా సిరిధాన్యాల సాగు పద్ధతులు, పాతతరం ఆహారపు అలవాట్లను నేర్చుకుంటున్నారు. ఆరోగ్యకరమైన పంటల.. వంటల విషయంలో వారసత్వ మార్పిడి జరుగుతున్నది ఇక్కడ. కనుమరుగవుతున్న సిరిధాన్యాల గొప్పతనాన్ని భవిష్యత్తు తరాలకు తెలియజేయాలన్నదే అత్తా కోడళ్ల ఆలోచన. పాత పంటల జాతర జరుగుతున్న ఊర్లళ్లో ఈ అత్తా కోడళ్లు ఆడుతూ పాడుతూ కనిపిస్తున్నారు. ధ్వంసమైన జీవన వైవిధ్యం ఊపిరిపోసుకుంటున్నది. అత్తలు కొర్రలు సామలు ఉయ్యాలో.. దండిగ పండెనే ఉయ్యాలో అంటూ కోలాటం పాటలు పాడుతుంటే.. తలచీ తలచీ తైదలు పెడదాం భయపడకే చినదానా.. కోరి కోరీ కొర్రలు వెడుదాం అంటూ కోడళ్లు పాట అందుకుంటూ జాతరను సాగులా విజయవంతం చేస్తున్నారు.

మాచునూరులో ముగింపు

ఈ యేడాది పాత పంటల జాతరలో భాగంగా 23 గ్రామాలను లక్ష్యంగా పెట్టుకున్నారు. దాదాపు లక్ష్యం పూర్తికా వచ్చింది. ఫిబ్రవరి 13వ తేదీన ఝరాసంగం మండలం మాచనూరులో జాతర ముగింపు ఉత్సవాలు జరగనున్నాయి. మహిళా రైతులే ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్న ఈ కార్యక్రమంలో ఎడ్లా బంతులేయన్నో ఎడ్లా బంతూలు.. కట్టుడు బందాయెయన్నో కట్టుడె బం దాయె. మక్కా పంటాలెయన్నో.. మందూలెక్కువాయే.. మందులెక్కువాయెయన్న మందూలెక్కువాయె.. సన్నంపంటాలెయన్నో సప్పుడె బందాయె.. సప్పుడె బందాయెయన్నా సప్పుడె బందాయె అంటూ పాత సాగు పద్ధతులను గుర్తుచేస్తున్నారు. సిరిధాన్యాలతో పర్యావరణానికి.. ఆరోగ్యానికి జరిగే మేలు గురించి అందరికీ అవగాహన కల్పిస్తున్నారు.
Dhanyam2

జాతర ఇచ్చే సందేశం

మన పూర్వీకుల్లా మనమూ ఆరోగ్యంగా.. నిండు ఆయుష్షుతో ఉండాలంటే కొర్రలు.. సజ్జలు.. జొన్నలు.. సామలు వంటివి తినాలి. అంతకన్నా ముందు యువ రైతులు వాటిని సాగు చేయాలి. సేంద్రియ పద్ధతిలో సాగుచేస్తే మంచి దిగుబడి వస్తుంది. వెనకటికి జొన్న గట్క.. జొన్న అంబలి తాగినవాళ్లు వందేళ్లకు పైగా బతికితే.. ఇప్పుడు నలభై యేండ్లే అతి కష్టమ్మీద బతుకుతున్నారు. ఖరీఫ్‌లో మినుము, పెసర, కంది, సజ్జ, పచ్చజొన్నలు, రబీలో శనగ, తెల్ల కుసుమ, సాయి జొన్న, అవిస, వామ పంటలు సాగుచేసి లాభాలు పొందాలని సూచిస్తున్నారు. డీడీఎస్ ద్వారా తాము ఏర్పాటుచేస్తున్న పాత పంటల జాతర నేటి తరానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనీ.. హైదరాబాద్ నుంచి విద్యార్థులు.. ప్రొఫెషనల్స్ జాతరకు వస్తున్నారనీ మార్పు కచ్చితంగా వస్తుందనీ అంటున్నారు డీడీఎస్ డైరెక్టర్ సతీష్.

ఊరూరా ఎడ్లబండ్ల ప్రదర్శన

Dhanyam1
మహిళా రైతులు పండించిన సిరిధాన్యాలను 16 ఎడ్లబండ్లపై ప్రదర్శిస్తారు. అవే స్టాల్స్ అన్నమాట. ప్రదర్శించిన ఎడ్లబండ్ల ముందు సిరిధాన్యాలు సౌఖ్యమే లచ్చిమీ అంటూ మహిళలు పాడే పాటలు ప్రదర్శనకు వచ్చినవాళ్లను ఆకట్టుకుంటున్నాయి. కోరీ కోరీ కొర్రలు వెడుదాం అంటూ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. బండ్లు ఊరి నుంచి మరో ఊరికి వెళ్తుండగా ఆ యొక్క పల్లెలలోనా దేవా.. సిరి ధాన్యాలున్నాయా దేవా అంటూ బుర్రకథలు చెప్తున్నారు కళాకారులు. జాతర జరుగుతున్న ఊరినంతా అందంగా ముస్తాబు చేయడంతో సంగారెడ్డిలోని గ్రామాలకు కొత్త కళ వచ్చింది. సంపూర్ణ ఆరోగ్యానికి సిరి ధాన్యాలు వాడాలనీ.. ఆనాటి పంటలను.. ఈనాటి వారికి చేరువయ్యేలా అందరూ కృషి చేయాలని ఉత్సవాల సందర్భంగా వక్తలు చెప్తున్నారు.
-దాయి శ్రీశైలం
Dhanyam5

2076
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles