సిమ్ స్వాప్‌తో.. ఖాతాకు కన్నం


Wed,February 20, 2019 01:26 AM

ఇప్పటి వరకు సిమ్‌స్వాప్ వల్ల దాదాపు రూ.200 కోట్లకు పైగా దోచుకున్నారు. వందలమంది ఈ సిమ్‌స్వాప్ బారినపడి మోసపోయారు. ఓ అపరిచిత నంబర్ నుంచి మీకు కాల్ వస్తుంది. ముందు మీ మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ చేసుకోమంటారు. ఆ తర్వాత మెల్లమెల్లగా మీ వివరాలన్నీ కూపీ లాగుతారు. మీ బ్యాంక్ వివరాలు, క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు తెలుసుకుంటారు. అలా మొత్తం ఆరుసార్లు వేర్వేరు నెంబర్లతో మీకు కాల్ చేసి మీ వివరాలన్నీ మీకు తెలియకుండా చేజిక్కించుకుంటారు. ఆ తర్వాత ఓ రోజు మీ ఖాతాలో ఉన్న డబ్బులన్నీ మాయమవుతాయి. ఇదే.. సిమ్‌స్వాపింగ్ ఫ్రాడ్. అసలేంటీ సిమ్ స్వాపింగ్? ఖాతాకు కన్నం ఎలా వేస్తారు? ఏం చేస్తారు? మనకేంటి నష్టం. ఈ స్టోరీ చదివి తెలుసుకోండి.
All-Sims
ముంబైలో షా అనే వ్యాపారవేత్తకు డిసెంబర్ 26న అర్ధరాత్రి వరుసగా ఆరు కాల్స్ వచ్చాయి. పడుకునే ముందు మొబైల్ సైలెంట్ మోడ్‌లో పెట్టి పడుకున్న షాకు ఆ కాల్స్ వినిపించలేదు. ఉదయం లేచి చూస్తే ఆరు మిస్డ్‌కాల్స్ ఉన్నాయి. ఆ నంబర్ యూకే నుంచి వచ్చింది. ఆ నంబర్‌కి ఎన్నిసార్లు కాల్ చేసినా కలువలేదు. కొద్దిసేపటి తర్వాత ఏదో అవసరం ఉండి తన కాంటాక్ట్స్‌లోని వేరే వ్యక్తికి ఫోన్ చేద్దామని కాల్ కలిపాడు. అతనికి కూడా ఫోన్ కలువలేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఎవరికీ ఫోన్స్ కలువడం లేదు. అనుమానం వచ్చి కస్టమర్ కేర్‌కి కాల్ చేశాడు. మీరే కదా.. మీ నంబర్ మార్చుకుంటున్నట్టు, ఈ నెంబర్‌ని బ్లాక్ చేయమని ఇంతకు ముందే కాల్ చేశారు అని కస్టమర్ కేర్ ప్రతినిధి సమాధానమిచ్చాడు. అనుమానం వచ్చి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు షా. అప్పటికే షా అకౌంట్లోంచి రూ. 1.86 కోట్ల రూపాయల నగదు మాయమయ్యింది. మనకు తెలియకుండానే మన నంబర్‌కి కాల్ చేసి అందులోని సమాచారమంతా సేకరించి బ్యాంకులో ఉన్న నగదునంతా దోచేస్తున్నారు. సిమ్ స్వాపింగ్ అనే టెక్నాలజీ వాడి సైబర్ మోసగాళ్లు అటు బడాబాబులతో పాటు, సామాన్యుల జేబులకు కూడా చిల్లు పెడుతున్నారు. దీనికి అడ్డుకట్ట వేయాలంటే ఏం చేయాలి?

అసలేంటీ సిమ్ స్వాపింగ్?

మన మొబైల్‌కి రకరకాల విదేశీ నంబర్లతో ఫోన్ చేస్తారు. హెల్త్ ఇన్సూరెన్స్, బ్యాంకు లోన్, ఆన్‌లైన్ సర్వే, ఫ్రీ ఇన్సూరెన్స్, కొత్త క్రెడిట్‌కార్డు ఇలా రకరకాల పేర్లతో కాల్స్ చేసి మన సమాచారమంతా సేకరిస్తారు. నకిలీ ఐడెంటిటీకార్డు సృష్టించి మనం వాడుతున్న నంబర్‌ను బ్లాక్ చేయిస్తారు. ఆ స్థానంలో మరో సిమ్‌కార్డు తీసుకుంటారు. బ్యాంకులు, క్రెడిట్‌కార్డులు, ఆన్‌లైన్ బ్యాంకింగ్‌లకు ఆ నంబరును అనుసంధానం చేస్తారు. ఆపై మన ఖాతాలోని డబ్బునంతా తమకు అనుకూలంగా ఉన్న ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటారు.
SimCard

ఎప్పుటి నుంచి?

ఇది 2011లో మొదలైన అతిపెద్ద స్కామ్. టెక్నాలజీ మీద బాగా పట్టున్న హైటెక్ మోసగాళ్లు టెక్నాలజీని ఉపయోగించుకొని ఆన్‌లైన్ చోరీలకు పాల్పడుతున్నారు. గ్రూపులుగా ఏర్పడి ఈ సిమ్ స్వాపింగ్ చేస్తుంటారు. 2013లో అమెరికా, యూరప్ దేశాల్లో ఈ తరహా సైబర్ నేరాలు తొలిసారిగా బయటపడ్డాయి. గతేడాది ఈ సిమ్ స్వాపింగ్ ద్వారా రూ. 200 కోట్ల రూపాయలు కాజేశారు. నెట్ బ్యాంకింగ్ ఉపయోగిస్తూ పాస్‌వర్డ్‌లు, యూజర్‌నేమ్‌ల విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోని వారే ఈ సిమ్ స్వాపింగ్ బారిన ఎక్కువగా పడుతున్నారు.

పత్రాలు జాగ్రత్త..

మీ పేరు, అడ్రస్, ఫొటో తదితర వివరాలతో ఉన్న ఐడీ కార్డులు, పత్రాలు, మీరే అని నిర్ధారించే పత్రాలు ఎవరికీ అంత సులభంగా ఇవ్వకండి. అలా ఇవ్వడం వల్ల వారు ఆ పత్రాలను మిస్‌యూజ్ చేసే ప్రమాదం ఉంది. కొత్తవారికి మీ వ్యక్తిగత పత్రాలు, ఐడీ కార్డులు అస్సలు ఇవ్వకండి. మీ పేరుతో నకిలీ సిమ్‌కార్డులు తీసుకొని మోసానికి పాల్పడవచ్చు. మీకు తెలియకుండానే ఆ మోసంలో మీరు భాగస్వాములవుతారు. ఫలితంగా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అందుకే మీకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలు జాగ్రత్తగా చూసుకోండి.
avoidhacking

ఎలా జాగ్రతపడాలి?

-వరుసగా కొన్ని గంటల పాటు మీ మొబైల్‌లో సిగ్నల్ సమస్య ఉన్నదంటే మీ సిమ్ స్వాపింగ్ గురవుతున్నట్టు గమనించాలి. వెంటనే మీ మొబైల్ ఆపరేటర్‌కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి.
-ఎప్పటికప్పుడు మీ బ్యాంక్ బ్యాలెన్స్, స్టేట్‌మెంట్లు చెక్ చేసుకోండి. మొబైల్ నంబరుతో పాటు మీ మెయిల్‌కి కూడా బ్యాంకింగ్ అప్‌డేట్స్ వచ్చేలా సెట్ చేసుకోండి.
-మీ సిమ్‌కార్డు బ్లాక్ అయినా.. ఈమెయిల్ ద్వారా మీ ఖాతాలో జరుగుతున్న లావాదేవీల గురించి అప్‌డేట్స్ తెలుసుకోవచ్చు. మీ ప్రమేయం లేకుండా లావాదేవీలు జరిగితే వెంటనే బ్యాంకులో ఫిర్యాదు చేయవచ్చు.
-మీ సిమ్‌కార్డు మీద ఉన్న 20 అంకెల సిమ్‌కార్డు కోడ్‌ని ఎవరికీ చెప్పకండి. కస్టమర్ కేర్ నుంచి కాల్ చేస్తున్నట్టుగా చేసి మీ సిమ్‌కార్డు నంబర్ తెలుసుకోవడానికి మోసగాళ్లు ప్రయత్నిస్తారు. అదంతా మోసం.. అస్సలు నమ్మకండి.
-అవసరమైతే మీరే కస్టమర్ కేర్‌కి కాల్ చేసి ఇలా అడుగుతున్నారు. నా సిమ్‌కార్డుకు ఉన్న సమస్యేంటి? అని అడిగి తెలుసుకోండి.
-ఎక్కడ పడితే అక్కడ మొబైల్ నంబర్ రాయకండి. అందరికీ కనిపించేలా మొబైల్ నెంబర్ ఉంచకండి. మీ నంబరు మీద మోసగాళ్ల కండ్లు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
-మీ మొబైల్‌కి వచ్చిన ఓటీపీ నంబర్ ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు.
-కొన్నిసార్లు కస్టమర్ కేర్ నుంచి చేస్తున్నట్టు ఫోన్ చేసి 1 నొక్కండి, 2 నొక్కండి అని కోరుతారు. అప్పుడు వారు చెప్పినట్టు చేస్తే మీ జుట్టు మోసగాళ్ల చేతికి చిక్కినట్టే.
-వెబ్‌సైట్, కంప్యూటర్లలో మీ బ్యాంకింగ్‌కి సంబంధించిన పాస్‌వర్డులు సేవ్ చేయకండి.
-థర్డ్‌పార్టీ యాప్‌ల ద్వారా అస్సలు ఆన్‌లైన్ లావాదేవీలు జరుపకండి.
image

ఎలా చేస్తారు?

సిమ్ స్వాపింగ్ చేయాలనుకున్న సైబర్ మోసగాళ్లు తాము ఎంచుకున్న నంబర్ మీద నిఘా వేసి ఉంచుతారు. వారి ఫేస్‌బుక్, వాట్సప్, ట్విట్టర్, యూట్యూబ్‌లాంటి సోషల్ మీడియా అకౌంట్లతో పాటు, ఆ నంబర్‌తో అనుసంధామై ఉన్న బ్యాంక్ అకౌంట్ల సమాచారాన్ని కూడా సేకరిస్తారు. ఈ సమాచారం సేకరించడానికి దాదాపు మహిళా టెలీకాలర్స్ సాయం తీసుకుంటారు సైబర్ కేటుగాళ్లు. ఫోన్‌కాల్‌కి స్పందించకపోతే లక్కీ డ్రా అంటూ మెసేజ్‌లు పంపిస్తారు. ఆ మెసేజ్‌లో వచ్చిన లింకు ఓపెన్ చేశామో.. అంతే సంగతులు. మన మొబైల్‌లోని సమాచారమంతా వారి చేతుల్లోకి వెళ్లిపోతుంది. అలా సేకరించిన సమాచారంతో మొబైల్ ఆపరేటర్లకు ఫోన్ చేసి తాము నంబర్ మార్చుకోవాలనుకుంటున్నట్టు, ప్రస్తుతం ఉన్న నంబర్ బ్లాక్ చేయాలంటూ రిక్వెస్ట్ పెట్టుకుంటారు. ప్రాసెస్‌లో భాగంగా మొబైల్ ఆపరేటర్లు అడిగిన అన్నీ ప్రశ్నలకు మన నుంచి సేకరించిన వివరాల ఆధారంగా సరైన సమాధానాలు ఇస్తారు. దీంతో ఆపరేటర్లు సులభంగా నంబర్ బ్లాక్ చేసి, కొత్త నంబర్ ఇస్తారు. అంతే.. మీ సిమ్ స్వాప్ అయినట్టే.

909
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles