సలహాలు ఉచితమే కదా అని తీసిపారేయకండి.. మీ సలహాలకూ మంచి రోజులు వస్తున్నాయి. చాలా కాస్ట్లీగా మారుతున్నాయి. మరి మీరు సిద్ధమేనా? అదెలానో చూడండి...

సమయం సందర్భాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవడం క్లిష్టమైన పనే. కొంతమంది ఏముందిలే అని కొన్ని ఏవో నిర్ణయాలు తీసుకుంటారు. చివరికి చిక్కుల్లో పడుతుంటారు. అలాంటి పరిస్థితే ఓ అమ్మాయికీ జరిగింది. ఇంగ్లాండ్‌లోని బ్రిస్టాల్‌కు చెందిన యువతి తన నిర్ణయాలకు సరైన సలహాలిస్తే రూ. 1.85 లక్షలు ఇస్తానంటూ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ సందర్భంగా Bark.com అనే వెబ్సైట్లో ప్రకటన కూడా ఇచ్చింది. గతేడాది ఎదుర్కొన్న చేదు అనుభవాలతో తన పేరు వెల్లడించలేదు. ఆమె ఇచ్చిన ప్రకటనలోకి వెళ్లితే... గతేడాది న్యూజిలాండ్ విహారానికి వెళ్లినప్పుడు నా చేతిలో చిల్లిగవ్వా లేదు. ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్న డబ్బు కూడా పోగొట్టుకున్నాను. ఆరు నెలలుగా పరిచయం ఉన్న బాయ్‌ఫ్రెండ్‌ని కూడా వదులుకున్నా. ఇన్ని ఘటనల ద్వారా నాకు నేనుగా సరైన నిర్ణయాలు తీసుకోలేనని, తీసుకున్నా అవి నన్ను చిక్కుల్లో పడేస్తాయని అర్థమైంద ని ఆమె చెబుతున్నది. అంతేకాదు. తన నిర్ణయాలపై వాళ్ల అమ్మ కూడా జోక్ చేస్తుందనీ, వారంలో ఏదో ఒక పొరపాటు చేసి తప్పించుకొని తిరుగుతానని అంటున్నది. ఇలా ఇన్ని రోజులు కాలం వెళ్లదీసి చివరకు ఓ నిర్ణయానికొచ్చింది. ఏదైనా చేసేటప్పుడు ఒకరి సలహా తీసుకోవాలనుకున్నది. నెలరోజుల్లో మంచి సలహాలు ఇచ్చే ఒకరిని పట్టుకుంటానంటుంది. వారు ఇచ్చే సలహాలతో మంచి జరిగితే వారినే పర్మనెంట్‌గా కొనసాగిస్తానని తెలిపింది. తనకు సలహాలిచ్చేవారికి అక్షరాలా రూ. 1.85 లక్షలు ఇవ్వాలని నిర్ణయించుకున్నది. ఇప్పుడు ఈ ఆఫర్ సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతున్నది. అదీ విషయం.