సయాటికా విడుపు-7


Sat,July 27, 2013 12:22 AM

సయాటికాకు శస్త్ర చికిత్స ఒక్కటే మార్గమని అందరూ అనుకుంటారు. అయితే శస్త్ర చికిత్స చేసినా కొన్నిసార్లు ఇది తిరగబెట్టే అవకాశం ఉంది. అందుకని దైనందిన అలవాట్లలో మార్పులు చేసుకుంటే తొలి దశలోనే ఈ సయాటికాను అదుపు చేయవచ్చు. అలా సయాటికాను అదుపులో ఉంచే భుజంగాసనం, దానిలోని వేరియేషన్స్ ఈవారం మీకోసం...

yoga
భుజంగాసనం
ముందుగా బోర్లా పడుకోవాలి. పాదాలు దగ్గరగా ఉంచాలి. చేతులు రెండూ భుజాల కిందుగా, నాభి భాగానికి పక్కగా, శరీరానికి దగ్గరగా ఉంచాలి. అరచేతులు పూర్తిగా నేలకు ఆనాలి. నెమ్మదిగా గాలిపీలుస్తూ... ముందుగా తలను, తరువాత శరీర ఊర్థ్వ భాగాన్ని పైకి లేపాలి. నడుము భాగం వరకూ పైకిలేపి, తలను ఆకాశంవైపు ఎత్తాలి. ఇదే స్థితిలో 5 నుంచి 8 సెకన్లపాటు ఉండాలి. నెమ్మదిగా గాలి వదులుతూ యథాస్థితికి రావాలి.

పూర్ణ భుజంగాసనం
ముందుగా బోర్లా పడుకోవాలి. పాదాలు దగ్గరగా ఉంచాలి. చేతులు రెండూ భుజాలకు కిందుగా, పక్కటెముకల పక్కగా శరీరానికి దగ్గరగా ఉంచాలి. నెమ్మదిగా గాలిపీలుస్తూ ముందుగా తలను తరువాత శరీర ఊర్థ్వ భాగాన్ని పైకి లేపాలి. నడుము భాగం వరకూ పైకి లేపి తలను ఆకాశంవైపు ఉంచాలి. ఇదే స్థితిలో 5 నుంచి 8 సెకన్ల పాటు ఉండాలి. నెమ్మదిగా గాలి వదులుతూ యథాస్థితికి రావాలి.

విశిష్ట భుజంగాసనం
బోర్లా పడుకోవాలి. రెండు చేతుల వేళ్లను ఒకదానికి ఒకటి జత చేసి, అరచేతులు భూమికి ఆన్చి ఛాతి కిందుగా ఉంచాలి. కుడి పాదాన్ని ఎడమ పాదం మీదుగా వేయాలి. ఇప్పుడు నెమ్మదిగా గాలిపీలుస్తూ, తలతోపాటు శరీర ఉపరిభాగాన్ని పైకి లేపి 5 నుంచి 8 సెకన్ల పాటు ఇదే స్థితిలో ఉండాలి. తరువాత యథాస్థితికి రావాలి. ఇదే విధంగా ఎడమ పాదాన్ని కుడిపాదం మీదుగా వేసి చేయాలి. రెండువైపులా మూడు సార్లు రిపీట్ చేయాలి.

తిర్యక్ భుజంగాసనం
పాదాలు రెండింటిని కొద్ది దూరం ఉంచాలి. గాలి పీల్చుకుంటూ తలను పైకి లేపాలి. ఎడమ పాదాన్ని నెమ్మదిగా మోకాలి వద్ద వంచి పాదాన్ని ఆకాశంవైపు ఉంచాలి. ఇప్పుడు నెమ్మదిగా గాలి వదులుతూ శరీరాన్ని కుడి వైపు తిప్పి ఎడమ పాదాన్ని చూడటానికి ప్రయత్నించాలి. 5 నుంచి 8 సెకన్ల పాటు ఇదే స్థితిలో ఉన్న తరువాత తలను మధ్యకు తీసుకొచ్చి గాలి వదులుతూ బోర్లా పడుకోవాలి. ఇదే విధంగా శరీరాన్ని ఎడమవైపు తిప్పి కుడిపాదాన్ని చూసే ప్రయత్నం చేయాలి.

జాగ్రత్తలు :
- హెర్నియా, పెప్టిక్ అల్సర్ ఉన్నవారు చేయకూడదు.
- స్పాండిలైటిస్ ఉన్నవారు తలను వెనక్కి మరల్చకుండా సాధారణ స్థితిలో ఉంచాలి.
- ఆసనం వేసేటప్పుడు అరచేతి వేళ్లు దగ్గరగా ఉండాలి.
- నాభికింద భాగం మీద ఏవిధమైన ఒత్తిడి పడకూడదు.
- ప్రారంభ దశలో శరీరపు బరువు మొత్తం చేతుల మీద ఉంటుంది.
- శరీరం పైకి వెళ్లేటప్పుడు ముందు ఏ భాగం భూమిని వీడుతుందో తిరిగి వచ్చేటప్పుడు అదే భాగం భూమిని తాకాలి.
-ఇవి వేసిన తరువాత వెంటనే ఆహారం తీసుకోవాలి.

గమనిక
- యోగాకి ముందు వార్మప్ ఎక్సర్‌సైజెస్ (సూక్ష్మ వ్యాయామాలు) తప్పనిసరిగా చేయాలి.

సంగీత అంకత
యోగా ట్రైనర్, బ్యూటీ ఎక్స్‌పర్ట్, 9705665266

4281
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles