సయాటికా విడుపు-5


Sat,July 13, 2013 01:12 AM

yoga
మనం సరిగా కూర్చోవాలన్నా, సరిగా నిలబడాలన్నా వెన్నెముక పనితీరు బాగుండాలి. ఆ వెన్నెముక డిస్క్‌ల మూలంగా వచ్చే సయాటికా నొప్పి మనల్ని ఏ పని సరిగా చేయనివ్వదు. మరి ఆ నొప్పి ఉపశమనానికి వేసే మేరుదండాసనం, మర్కాటాసనాలే ఈ వారం యోగా...

మేరుదండాసనం
వెల్లకిలా పడుకొని చేతులు రెండూ భుజాలకు సమాంతరంగా ఉంచాలి. ఇప్పుడు కుడికాలి పాదం ఎడమ మోకాలి మీద ఉంచాలి. గాలి పీల్చుకుని, గాలి వదులుతూ తలను కుడివైపు, కాళ్ళను ఎడమవైపుకి తిప్పాలి. ఇలా పదిసెకన్లపాటు ఉండి శ్వాస పీల్చుకుంటూ తలను మధ్యకు తీసుకువచ్చి మళ్ళీ శ్వాస వదులుతూ తలను ఎడమవైపు, కాళ్ళను కుడి వైపుకి తిప్పాలి. ఈ స్థితిలో నడుం వద్ద వెన్నెముక ట్విస్ట్ అయ్యి మనకు చాలా రిలాక్సింగ్‌గా ఉంటుంది. ఇదేవిధంగా ఎడమ పాదం కుడి మోకాలు మీద పెట్టి చేయాలి. ఇలా కుడివైపుకు ఐదుసార్లు, ఎడమ వైపు ఐదుసార్లు చేయాలి.

ఉపయోగాలు :
- వెన్నెముక శక్తివంతమవుతుంది.
- వెన్నెముక చుట్టు పక్కల ఉండే కండరాలు, నరాలు శక్తివంతమవుతాయి.
- కొద్దిగా నొప్పి ఉన్నప్పుడు చేసినా చాలా రిలీఫ్‌ని పొందగలుగుతాం.

మర్కటాసనం
నేల మీద వెల్లకిలా పడుకొని రెండు చేతులు భుజాలకు సమాంతరంగా ఉంచాలి. ఇప్పుడు గాలిపీల్చుకుంటూ కుడికాలిని 90 డిగ్రీల వరకు పైకి తీసుకెళ్ళాలి. ఆ తర్వాత గాలి వదిలివేస్తూ కుడికాలిని నెమ్మదిగా ఎడమచేతివైపు వంచి కుడికాలి బొటనవేలును పట్టుకోవాలి. మొదటిసారి చేసినప్పుడు ఇది కఠినతరంగా ఉంటుంది. అప్పుడు మోకాలిని వంచితే కాలు సులభంగా అందుతుంది. అలా పట్టుకున్న తర్వాత కాలిని చాచవచ్చు. ఇదే స్థితిలో పదిసెకన్లపాటు ఉండాలి. తిరిగి గాలిని పీల్చుకుంటూ కాలిని 90డిక్షిగీలు తీసుకెళ్ళాలి. గాలిని వదిలేస్తూ మామూలు అంటే యథాస్థితికి తీసుకురావాలి. ఇదేవిధంగా ఎడమకాలితో కూడా చేయాలి. ఎడమకాలితో ఐదుసార్లు, కుడికాలితో ఐదుసార్లు రిపీట్ చేయాలి.

ఉపయోగాలు :
- వెన్నెముక శక్తివంతమవుతుంది.
- వెన్నెముక చుట్టు పక్కల ఉండే కండరాలు, నరాలు శక్తివంతమవుతాయి.

గమనిక
- యోగాకి ముందు వార్మప్ ఎక్సర్‌సైజెస్ (సూక్ష్మ వ్యాయామాలు) తప్పనిసరిగా చేయాలి.

3729
Tags

More News

VIRAL NEWS