సయాటికా విడుపు-10


Sat,August 17, 2013 12:10 AM


సయాటికాను దూరం చేసే కొన్ని యోగాసనాలు ఈవారం...
ఏకపాద శలభాసనం
బోర్లా పడుకుని చుబుకం నేలకు ఆన్చాలి. చేతులు శరీరానికి సమాంతరంగా కాళ్ల కిందుగా ఉంచాలి. నెమ్మదిగా గాలి పీల్చుకుని కుడికాలును వీలున్నంతపైకి లేపి 5 నుంచి 8 సెకన్లపాటు ఆ స్థితిలో ఉంచాలి. గాలి వదులుతూ నెమ్మదిగా కాలు కిందికి తీసుకురావాలి. కాలు పైకి లేపి ఉంచినప్పుడు మోకాలి వద్ద వంచకుండా ఉండాలి. ఇలా మూడు సార్లు చేయాలి. ఇదే విధంగా ఎడమకాలితో కూడా మూడు సార్లు చేయాలి.
yoga
పూర్ణ శలభాసనం
ముందు బోర్లా పడుకోవాలి. చుబుకం నేలకు ఆనేట్లుగా ఉంచాలి. చేతులు కాళ్ల కిందుగా ఉంచాలి. నెమ్మదిగా గాలి పీల్చుకుని రెండు కాళ్లను మోకాలి దగ్గర వంచకుండా వీలున్నంత పైకి ఎత్తాలి. ఆ స్థితిలో ఉండగలిగినంత సేపు ఉండాలి. మొదట్లో కొద్దిగా మాత్రమే కాళ్లను ఎత్తగలిగినా, సాధన చేసే కొద్దీ ఎక్కువ పైకి ఎత్తగలుగుతారు. నడుము, పొట్ట దగ్గర కండరాలు శక్తివంతం అవుతున్న కొద్దీ కాళ్లు పైకి ఎత్తవచ్చు. ఎక్కువ సమయం కూడా ఉంచగలుగుతారు.
ఉపయోగాలు :
- కాళ్లను, కాలి కండరాలను శక్తివంతం చేస్తుంది.
-రుతు సంబంధమైన సమస్యలను నివారిస్తుంది.
- బ్యాక్‌పెయిన్, సయాటికా నొప్పిని తగ్గిస్తుంది.
- వెన్నెముకను దృఢంగా ఉంచుతుంది.
-జీర్ణ వ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది.
- మూత్రాశయాన్ని శక్తివంతం చేస్తుంది.
- ప్రసవం తరువాత మహిళల్లో వచ్చే నడుంనొప్పి నివారణకు బాగా ఉపయోగపడుతుంది.
ఆకర్ణ ధనురాసనం
రెండు కాళ్లూ ముందుకు చాచి దండాసనంలో కూర్చోవాలి. ఎడమకాలు మడిచి కుడిచేతితో ఎడమకాలు బొటనవేలును పట్టుకుని చెవి వరకు లాగి పట్టుకోవాలి. ఇప్పుడు ఎడమ చేతితో నేలకు సమాంతరంగా చాపి ఉన్న కుడికాలు బొటనవేలు పట్టుకునే ప్రయత్నం చేయాలి. కొద్దిగా కష్టంతో కూడుకున్నదే అయినా సాధనతో సాధించవచ్చు. ఇలా ఉండగలిగినంత సేపు లేదా 10 సెకన్లపాటు ఈ స్థితిలో ఉండాలి. తరువాత ఇలాగే కుడికాలితో కూడా చేయాలి.
ఉపయోగాలు :
-మోకాళ్లు, పిక్కలు శక్తివంతమవుతాయి.
-భుజ కండరాలు పటిష్ఠమవుతాయి.
-నాడీవ్యవస్థ ఉత్తేజితం అవుతుంది.
జాగ్రత్తలు :
- నడుం నొప్పి ఉన్నవారు చేయకూడదు.
గమనిక
- యోగాకి ముందు వార్మప్ ఎక్సర్‌సైజెస్ (సూక్ష్మ వ్యాయామాలు) తప్పనిసరిగా చేయాలి.

4389
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles