సప్త వర్ణాల విజయగాథ!


Sat,January 19, 2019 11:04 PM

పెళ్లికి ఒప్పుకోలేదని ఒకడు.. ప్రేమ నిరాకరించిందని మరొకడు.. శారీరకంగా దక్కలేదని అక్కసుతో ఇంకొకడు.. ఆడపిల్లల జీవితాలతో చెలగాటమాడుతూనే ఉన్నారు. తనకు దక్కనిది వేరొకరికి దక్కకూడదు అనే స్వార్థంతో అందమైన జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తున్నారు. తిరస్కరించినందుకు యాసిడ్ దాడులకు పాల్పడుతూ.. క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. యేటా 200 మంది మహిళలు మన దేశంలో యాసిడ్ దాడులకు గురవుతున్నారు. ఆ బాధితుల్లో కొంతమంది బలవంతంగా ప్రాణాలు తీసుకుంటే.. మరికొంతమంది ఇలా స్ఫూర్తిదాతలుగా విజయం సాధించారు.
Resham-Khan

రేషం ఖాన్

21 యేండ్ల రేషం ఖాన్ లండన్‌లో యాసిడ్ దాడికి గురైంది. అది కూడా తన 21వ పుట్టినరోజు నాడే. ఆ సమయంలో తన స్నేహితులు విరాళాలు సేకరించి కొంత వైద్యానికి అందించారు. ఆస్పత్రిలో ఉన్నప్పుడు తన బ్లాగ్‌లో దాడి జరిగిన తీరు, తన ఆరోగ్య వివరాలు, వైద్యులు స్పందిస్తున్న తీరును వివరంగా రాసేది. వీటితో పాటుగా తన తాజా ఫొటోలను కూడా పోస్టు చేసేది. అలా కొన్నాళ్లకు కోలుకున్నది రేషం ఖాన్. ప్రస్తుతం యాసిడ్ దాడి బాధితుల పక్షాన పోరాడుతూ.. స్ఫూర్తిదాయక పాత్ర నిర్వహిస్తున్నది.


LAXMI-WITH-MICHELLE

లక్ష్మీ అగర్వాల్

2005లో ఢిల్లీకి చెందిన ఈ యువతి యాసిడ్ దాడిలో తన రూపురేకల్ని పూర్తిగా కోల్పోయింది. తాను ప్రస్తుత రూపానికి రావడానికి ఎన్నో సర్జరీలు చేయించుకున్నది. కొన్నాళ్లకు ధైర్యం తెచ్చుకొని తనలాంటి బాధితుల తరఫున పోరాడుతున్నది. యాసిడ్ దాడులను నిరసిస్తూ.. ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ఓ టీవీ చానెల్‌లో హోస్ట్‌గా వ్యవహరించింది. స్టాప్ యాసిడ్ అటాక్స్ పేరుతో ఓ ఎన్జీఓను నిర్వహిస్తూ.. సమాజంలో చైతన్యం నింపుతున్నది. తాను చేస్తున్న నిస్వార్థ సేవకు గాను ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్ అవార్డ్‌ను అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా భార్య మిచెల్లి అందజేశారు.


Mamatha

మమతా దేవి

2010లో మద్యానికి బానిసైన తన భర్త చేసిన యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడింది మమతా దేవి. అప్పుడు ఆమె గర్భవతి. పిల్లలు వద్దని, అబార్షన్ చేయించుకోవాలంటూ భర్త, అత్తమామలు ఒత్తిడి తేవడంతో తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. అయినా వదలని తన భర్త.. ముఖంపై యాసిడ్ పోసి, ఆమె జీవితాన్ని నరకంగా మార్చాడు. అప్పుడు మేక్ లవ్ నాట్ స్కార్స్ ఎన్జీఓ మమతాదేవికి అండగా నిలిచింది. దాంతో ఇంగ్లిష్, ఆర్ట్‌పై పట్టు సాధించింది. ప్రస్తుతం ఉడెన్ జ్యూవెలరీ తయారు చేస్తూ.. వ్యాపారవేత్తగా ఎదిగింది.


Reshma-Qureshi

రేష్మా ఖురేషి

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ యువతి.. ముంబైకి చెందిన టాక్సీ డ్రైవర్ యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడింది. ఆ దాడి నుంచి కోలుకున్న తర్వాత 2015లో #EndAcidSale క్యాంపెయిన్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించింది. విచ్చలవిడిగా యాసిడ్ అమ్మకాలను నిరసిస్తూ గొంతెత్తి నినదించింది. నేటికీ తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నది. అందం కోసం వాడే సౌందర్య సాధనాలు మార్కెట్‌లో విచ్చల విడిగా దొరికినట్లు.. యాసిడ్ కూడా దొరుకుతుందని, యాసిడ్ అమ్మకాలు నిలిపివేయాలని పోరాడుతున్నది. మరోవైపు తనకు ఇష్టమైన ఫ్యాషన్ ప్రపంచంలో మెళుకువలు నేర్చుకున్నది. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ షోలో ర్యాంప్‌వాక్ చేసింది రేష్మా. తన చదువు అయిపోయిన వెంటనే రేడియో జాకీగా ఉద్యోగం సంపాదించింది.
ఆత్మైస్థెర్యానికి మించిన ధైర్యం లేదంటూ నిరూపించింది.


Rupa

రూప

15 యేండ్ల వయసులో తన పినతల్లి ద్వారా యాసిడ్ దాడికి గురైంది రూప. ఆమెకు చిన్నప్పటి నుంచి క్లాత్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టం. దాడి నుంచి కోలుకున్న తర్వాత.. తన కుటుంబ సభ్యులు, ఎన్జీఓ ప్రోత్సాహంతో ఓ బొటిక్ ప్రారంభించింది. దాని కోసం ఢిల్లీ నుంచి లక్నోకు ఎన్నోసార్లు ప్రయాణించింది. ఆ తర్వాత ఆన్‌లైన్ అమ్మకాతో లాభాల బాట పట్టింది. యాసిడ్ దాడి బాధితులతో ఓ ఫ్యాషన్ షో కూడా నిర్వహించింది. అలా స్వయం శక్తితో ఎదిగి అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా నారీ శక్తి పుస్కారం అందుకున్నది.


Monica-Singh

మోనికా సింగ్

2005లో లక్నోలోని తన తల్లిదండ్రులను చూసేందుకు వచ్చిన మోనికా సింగ్‌పై యాసిడ్ దాడి జరిగింది. దీంతో తన ఆశయలన్నీ అడియాశలయ్యాయి. అయినా ధైర్యం కోల్పోకుండా ముందడుగు వేసింది. మృగాళ్ల అకృత్యాలను ప్రశ్నిస్తూ.. బాధితులకు అండగా నిలుస్తున్నది. లింగ వివక్షపై పోరాడుతున్నది. ఐక్యరాజ్య సమితి నిర్వహించిన ఉమెన్ గ్లోబల్ యూత్ చాంపియన్ అగైనెస్ట్ జండర్ బేసిడ్ వైలెన్స్ కార్యక్రమంలో ప్రసంగించింది. ప్రస్తుతం ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ చైతన్యం నింపుతున్నది. బాధితులను సాధికారత దిశగా ప్రోత్సహించేందుకు ఫ్యాషన్ రంగాన్ని ఎంచుకున్నది. దాని ద్వారా ఎంతోమందికి చేయూతనిస్తున్నది మెనికా సింగ్.


Acid-Attacks

మరికొన్ని స్ఫూర్తిగాథలు

-1999లో తోటి ఉద్యోగి యాసిడ్ దాడిలో త్రీవంగా గాయపడింది హసీనా హుస్సేన్. అతనితో పెండ్లికి ఒప్పుకోకపోవడంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆ దాడి తర్వాత హసీనా ఎనేబుల్డ్ ఇండియా అనే సంస్థలో చేరి దృష్టిలోపం ఉన్న చిన్నారులకు కంప్యూటర్ స్కిల్స్ నేర్పుతున్నది.
-తన బంధువైన ఓ యువకుడి యాసిడ్ దాడిలో తన రూపాన్ని కోల్పోయింది అర్చన. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లి దాదాపు 40 సర్జరీలు చేయించుకున్నది. మేక్ లవ్ నాట్ స్కార్స్ ఎన్జీఓ ద్వారా మృగాళ్ల అరాచకాలపై పోరాడుతున్నది.
-2013లో తన బావ యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడింది సాప్నా. ఆమెకు మేక్ లవ్ నాట్ స్కార్స్ ఎన్జీఓ అండగా నిలిచింది. జిగురు తయారు చేసే కంపెనీలో ఉద్యోగం ఇప్పించింది. ఆ ఫ్యాక్టరీలో అంచెలంచెలుగా ఎదిగింది సాప్నా. ప్రస్తుతం ప్యాకేజింగ్ విభాగానికి ఇన్‌చార్జ్, సూపర్‌వైజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నది.
-ముంబైలోని కల్వా ప్రాంతానికి చెందిన లలిత బెన్‌బాన్సీ తన బంధువుల యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడింది. 17 సర్జరీల తర్వాత కోలుకున్నది. ఆమెను ఇటీవలే రాహుల్ పెండ్లి చేసుకున్నాడు.
-వీరితోపాటు ఇలాంటి ఎంతోమంది బాధితులు ఆత్మైస్థెర్యంతో నూతన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అలాంటి వారికి అండగా ఉండాలి.
-డప్పు రవి

1352
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles