సత్యశోధన ఆయుధంగా..


Fri,March 11, 2016 12:02 AM

శక్తిసాధనే మార్గంగా! ప్రతి ఇంట్లో ఒక వివేకానందుడు పుట్టాలి. నిరంతర అధ్యయనం జరగాలి.. ప్రతి ఒక్కరూ సత్యశోధన చేయాలి. సత్యశోధన ఆయుధంగా.. శక్తిసాధన మార్గంగా జీవించాలి అనే నినాదంతో పని చేస్తున్నారు. పారిశ్రామిక రంగాన్ని వదిలి.. స్వార్థభారతి స్వచ్ఛంధ సంస్థను స్థాపించారు. వేల సంఖ్యలో వర్క్‌షాపులను నిర్వహిస్తున్నారు. ఆ సంస్థ వ్యవస్థాపకులు యడ్లపల్లి మోహనరావుపై ప్రత్యేక కథనం.
mohanrao
వేలమంది పోలీసులు.. లక్షల మంది విద్యార్థులు.. వందల గ్రామాల ప్రజలు.. ఇరవై వేదపాఠశాల విద్యార్థులకు మోహన్‌రావు మోటివేషన్ క్లాసులు నిర్వహించారు. రాష్ట్రంలో ఏ గ్రామం నుంచి అయినా, ఎవరు పిలిచినా వెళ్లి వ్యక్తిత్వ వికాస, ఆత్మజ్ఞాన విషయాలను సులభశైలిలో వివరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులకు చదువులు, భవిష్యత్తు పట్ల, ఆత్మన్యూనత భావాల్ని పోగొట్టే లక్ష్యంతో వేలాది శిబిరాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దే అధ్యాపకులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వారికి ఆత్మజ్ఞానం అందిస్తే వారిలో మార్పు వస్తుందని, తద్వారా నవతరాన్ని చక్కగా తీర్చిదిద్దాలని భావించారు. అటవీ శాఖ అధికారులకు, పోలీసులకు, డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్, రాజీవ్ యువ కిరణాలు, ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఇప్పటి వరకు 15 వందలకు పైగా సత్సంగాలు నిర్వహించారు. సత్యశోధన కాంతులను దేశవ్యాప్తం చేస్తున్నారు. స్వార్థభారతిని నేటి జ్ఞాన నిధిగా వెలుగొందించే ప్రయత్నం చేస్తున్నారు.

వ్యక్తిత్వ వికాస తరగతులు..


పారిశ్రామిక రంగంలో ఉన్నతి సాధించారు మోహన్‌రావు. 1995లో సిద్ధసమాధి యోగ తరగతులకు హాజరయ్యారు. ఆ యోగవిధానం ఆయనను అమితంగా ఆకర్షించింది. యోగసాధనతో పాటు సత్సంగాకు హాజరయ్యారు. మనసుకు తోచిన నాలుగు మంచి మాటలు ఇతరులతో పంచుకుంటూ ఉండేవారు. వ్యక్తిలో ఉన్న అనంతమైన శక్తి భయం, ఆత్మన్యూనత, మరణ భయం కారణంగా వృథా అవుతుందని, ఈ మూడింటిని ఆత్మజ్ఞానంతో జయిస్తే మనిషిలోని శక్తి వెలికి వస్తుందంటారాయన. తద్వారా మన జీవితాలు అనంతమైన ఆనందంతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న సత్యాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం ప్రారంభించారు. 2007లో స్వార్థభారతి పేరిట స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ర్టాల్లో కూడా వ్యక్తిత్వ వికాస తరగతులు చెప్పడానికి వెళతారు. ఆత్మజ్ఞాన విషయాలను సులభశైలిలో వివరిస్తారు. చిన్నారులకు చదువులు, భవిష్యత్తు పట్ల భయం పోగొట్టే లక్ష్యంతో వేలాది పాఠశాలల్లో లక్షలాది విద్యాప్రతిర్థులను మంచి పౌరులుగా తీర్చి దిద్దేందుకు కంకణం కట్టుకున్నారు.

ఇలా చేద్దాం..


ప్రతి ఇల్లూ జ్ఞానకేంద్రం కావాలని ఏ ఒక్కరో ఆలోచిస్తే సరిపోదు. ఏ ఒక్కరో ఈ దిశగా పయనిస్తే సరిపోదు. ప్రతి ఒక్కరూ సత్యశోధన దిశగా అడుగులు వేయాలి. వారిలో అనంతమైన శక్తిని గుర్తించుకోవాలి. ఆ శక్తిని వెలికితీయాలి. అప్పుడే అద్భుతమైన సమాజం ఆవిష్కృతం అవుతుంది. అందుకు జరగాల్సిందల్లా ప్రతి ఇల్లూ ఒక సత్యశోధనా కేంద్రం కావాలి. ప్రతి ఇంట్లో ఒక వివేకానందుడు ఉదయించాలి. పెద్దలు, చిన్నలు భయాన్ని వీడి ప్రకాశమానంగా ఆనందించగలిగితే దివ్యభారతం ఆవిష్కృతమవుతుంది. ఇందుకు సాధన జరగాలి. ముఖ్యంగా వయోధికులు కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తమలోని శక్తిని గుర్తెరిగి, తమకు ఎంతో ఇచ్చిన సమాజానికి చేతనైన సాయం చేయాలి. నిరంతర అధ్యయనంతో పాటు ప్రాణాయామం, ఆసనాల ద్వారా శరీరాన్ని మనసును ఆరోగ్యవంతం చేసుకోవాలి. నేను తక్కువ అనుకుంటూ గతంలో ఏర్పరుచుకున్న భావాల్ని తొలిగించుకోవాలి. మోహన్‌రావును ఆహ్వానించానుకునే వారు 98480 42602, 92465 42602లో సంప్రదించవచ్చు.

సంస్థతో సామాన్యుల చెంతకి..


స్వార్థ అంటే మన సంగతి మనం చూసుకోవడం కాదు. స్వ.. అర్థం మనలో ఉన్న అనంతమైన శక్తి సద్వినియోగం చేసుకోవడం.. అవసరమైన జ్ఞానాన్ని సాధించడం కోసం మన జీవితం, ఆత్మ అర్థాన్ని, పరమార్థాన్ని వెరసి ఆత్మజ్ఞానాన్ని తెలియజేయడమే స్వార్థభారతి సంస్థ ప్రథమ ప్రయోజనం. భారతి అంటే భా అంటే ప్రకాశమార్థాన్ని గ్రహించి, ఎరుకతో జీవితాన్ని ఆనందించేలా చేయాలనే సంకల్పంతో స్వార్థభారతి సంస్థను ఏర్పాటు చేశారు. నేటి ఆధునిక ప్రపంచంలో మనిషిని, మనిషిగా చూడని ఈ రోజుల్లో కూడా సాటి వ్యక్తి గురించి వారి మానసిక అభివృద్ధి గురించి, ఆలోచిస్తున్న ఏకైక వ్యక్తిగా మోహన్‌రావును పలువురు ప్రముఖులు కొనియాడుతున్నారు.

ప్రముఖుల ప్రతిస్పందనలు


-యడ్లపల్లి మోహన్‌రావు సత్యశోధన-శక్తి సాధన శీర్షికతో రాసిన పుస్తకం ఈ తరం యువతకు ఎంతగానో ఉపయోగపడుతుందని గవర్నర్ నరసింహన్ అభిప్రాయపడ్డారు.
-సత్యానికి దూరమై తప్పటడుగులు వేస్తున్న సమాజానికి సత్యశోధనతో శక్తివంతం చేయాలనే ప్రయత్నంలో కృతకృత్యులని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రయ్య అభినందించారు.
-మానసిక, ఆధ్యాత్మిక ప్రేరణతో విషయాలను పరిశీలించే ప్రక్రియను తన రచన ద్వారా సుసాధ్యం చేస్తున్న మోహన్‌రావు.. తన లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు ఆకాంక్షించారు.
-అజహర్ షేక్
-సాయిలు

887
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles