సత్ప్రవర్తనే శ్రీరామరక్ష


Sat,December 29, 2018 01:03 AM

ఎవరితో ఎలా ప్రవర్తించాలి? ఏ విధంగా నడుచుకుంటే ఇబ్బందులు రావు? అనే విషయాలను ఆండాళ్ తల్లి తన పాశురాల ద్వారా మనకు తెలిపే ప్రయత్నం చేసిందని చిన జీయర్ స్వామి చెప్పారు. సమాజంలో ఒక్కొక్కరితో ఒక్కో విధంగా వ్యవహరించాల్సి వస్తుందని, అలాంటి విశేషాలన్నింటినీ అమ్మ చెప్పిందన్నారు. గోదాదేవి గోప బాలికలను మేల్కొల్పే విధానాన్ని జాగ్రత్తగా గమనిస్తే అనేక మంచి విషయాలు మనకు తెలుస్తాయని స్వామి వారు అన్నారు.
swami
శాస్ర్తాలన్నీ గ్రంథాలయాల ద్వారా తెలుసుకోవాలంటే చాలా సమయం పడుతుందని, వినడం వల్ల చాలా విషయాలు తెలుస్తాయని చిన జీయర్ స్వామి అన్నారు. పెద్దలు, అనుభవజ్ఞులైన పండితుల నుంచి మనం అనేక విశేషాలను గ్రహించవచ్చని ఆయన సూచించారు. అదే విధంగా తమ గ్రామానికి వచ్చిన పండితులు, అనుభవజ్ఞులైన వారి మాటలు వినడం ద్వారానే గోపికలు జ్ఞానాన్ని సంపాదించగలిగారని, అటువంటి ధర్మజ్ఞుడు అంటే పెద్దల ద్వారా జ్ఞానాన్ని ఆర్జించిన ఉత్తముడిగా భావిస్తారని చిన జీయర్ స్వామి వివరించారు.
రాముడు కూడా చిన్నతనం నుంచే ఋషులు, మునుల ద్వారా జ్ఞానాన్ని ఆర్జించే వాడు. అంతటి జ్ఞానం ఉన్న రాముడు వనవాసానికి అడవులకు వెళ్ళినప్పుడు కొంతమంది మునీశ్వరులు సైతం ఆయన్ను అడిగి తమ సందేహాలను నివృత్తి చేసుకునే వాళ్లని స్వామివారు తెలిపారు. ప్రహ్లాదుడు, రాముడిని జ్ఞానవృద్ధులంటారని, జ్ఞానం ద్వారా వారికి పరిపక్వత ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. మంచి విషయాలు తెలుసుకునే సమయంలో పెద్ద, చిన్న అనే తేడా ఉండదని, మంచి మాటలు ఎవరు చెప్పినా వినవచ్చని చిన జీయర్ స్వామి సూచించారు. అరమరికలు లేకుండా అందరితో కలిసిపోతూ తనకు తెలిసిన సమాచారం ఇతరులతో పంచుకుంటూ, వారికి తెలిసిన విషయాలను తాను కూడా తెలుసుకుంటూ ఉండే వ్యక్తిని శీలవృద్ధుడిగా భావిస్తారు. ఆ కోవకు చెందిన వాడే రాముడు కూడా అని స్వామి వారు పేర్కొన్నారు.

రాముడు పరిపక్వత కలిగిన వాడు కాబట్టే, అందరినీ కలుపుకు పోతూ ఉండేవాడని చిన జీయర్ స్వామి చెప్పారు. ధర్మశాస్ర్తాల్లో మహిళలకు మంచి ప్రాధాన్యం ఇచ్చారు. గృహిణుల వద్ద అనేక విషయాలను నేర్చుకోవాలని ధర్మశాస్ర్తాలు రచించిన ఆపస్తంభుడనే ఋషిపుంగవుడు కూడా సూచించాడని, ఎవరికి ఏ సందేహం వచ్చినా ఇంట్లోని మహిళా పెద్దలను సంప్రదించాలని ఆయన చెప్పాడని చిన జీయర్ స్వామి గుర్తుచేశారు. ఏ పనైనా చేసే ముందు అనుభవజ్ఞులైన మహిళల సలహాలు తీసుకోవడం ఎంతో ఉత్తమమని, దానిని చిన్నతనంగా భావించరాదని, అలా తీసుకున్న సలహాలు మేలు చేకూర్చే విధంగా ఉంటాయని స్వామి వారు తెలిపారు. మంచి విషయాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సరే అందరూ గ్రహించాలని, లోకంలో ఉండే ప్రతి ప్రాణి నుంచి కూడా ఏవో విషయాలు నేర్చుకోవచ్చని చెబుతూ, గోపికలు కూడా అదే విధంగా పలు విషయాలను అండాళ్ తల్లి ద్వారా తెలుసుకున్నారని చిన జీయర్ స్వామి వివరించారు.

నేర్చుకునే ప్రక్రియలో కుల, మత భేదం లేకుండా ఉండాలని, జీవిత సత్యాలు తెలుసుకోవాలంటే ఎవరు చెప్పినా వినాలని స్వామి వారు చెప్పారు. ప్రకృతి, కీటకాలు, చంద్రుడు, ఆకాశం నుంచి కూడాఎన్నో విషయాలు నేర్చుకోవచ్చన్నారు. తెలుసుకోవాలన్న జిజ్ఞాస అనేది ఉంటే ఎక్కడి నుంచైనా జ్ఞానాన్ని పొందవచ్చని ఆయన సవివరంగా చెప్పారు. తారతమ్యాలు లేకుండా ఉంటేనే అందరూ కలిసి ఏదైనా సాధించగలుగుతారని, మంచి పని చేసే సమయంలో తక్కువ, ఎక్కువ అనే తేడాలు లేకుండా ఉండాలని ఆయన సూచించారు. ఒకరు నొకరు తమ స్థాయిలను ఎంచుకుంటూ కూర్చుంటే తలపెట్టిన కార్యాలు విజయవంతం కావని కొన్ని సందర్భాల్లో వాటిని వదిలేయాలని చిన జీయర్ స్వామి వివరించారు.

జనవరి 14 వరకు ప్రవచనాలు

swami1
హైదరాబాద్ వేదికగా ధనుర్మాసోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. నందగిరి హిల్స్‌లోని మైహోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు నివాసంలో ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి 9:30 గంటల వరకు తిరుప్పావై పఠనం, చిన జీయర్ స్వామి ప్రవచనాలు, సాయంత్రం 6 గంటల నుంచి 8:30 గంటల వరకూ విష్ణు సహస్ర నామ పఠనం, అనంతరం చిన జీయర్ స్వామి వారి ప్రవచనాలు కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలు జనవరి 14వ తేదీ వరకు జరుగనున్నాయి. గోదాదేవి ధనుర్మాస వ్రతాన్ని 30 దినాలు ఆచరించింది. అందులో 5 దినాల్లో వ్రతమంటే ఏమిటో ఆండాళ్ తల్లి పరిచయం చేసింది. తర్వాతి పది పాటలలో పదిమంది గోపికలను పరిచయం చేస్తూ జీవితంలో మానవులు అలవర్చుకోతగిన వాస్తవాలను తెలియజెప్పింది. శుక్రవారంతో ఈ మహోత్సవాలు 13వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం నాడు త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామి భక్తులను ఉద్దేశించి ప్రవచనం చేస్తూ, ధనుర్మాసోత్సవ వైశిష్ట్యాన్ని సోదాహరణల పూర్వకంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జూపల్లి రామేశ్వరరావు, ఆయన సతీమణి శ్రీకుమారితోపాటు వారి కుటుంబ సభ్యులు, పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు.

పసుపులేటి వెంకటేశ్వరరావు

871
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles