సంహిత.. కొత్త చరిత!


Sat,January 19, 2019 11:12 PM

పిల్లలూ! పిట్టకొంచెం కూత ఘనం అనే సామెతను మీరు వింటూనే ఉంటారు. ఆ సామెతకు ఈ బుడుగు సరైన నిదర్శనం. ఎందుకంటే పదేండ్లకే పదో తరగతి, 12 యేండ్లకే ఇంటర్..16 యేండ్లకే ఇంజినీరింగ్ పూర్తి చేసింది మరి. అది కూడా అషామాషీగా కాదు.. అన్నీ ఫస్ట్ ర్యాంకులే సాధించింది. ఇంకో విషయం ఏంటంటే.. కామన్ అడ్మిషన్ టెస్ట్(క్యాట్)లో 95.95 శాతం స్కోర్
సాధించి కొత్త చరిత్రను సృష్టించింది.

kasibhatta-samhitha
ఎలాంటి బ్యాక్‌లాగ్స్ లేకుండా ఇంజినీరింగ్ పూర్తి చేయాలంటే నాలుగేండ్ల్లు పడుతుంది. లేకపోతే ఇంకా రెండేండ్లు పడుతుంది. అలాంటిది మన హైదరాబాద్‌కు చెందిన ఈ టీనేజర్ ఫస్ట్‌క్లాస్‌లో ఇంజినీరింగ్ పాసైంది. అది కూడా 16 యేండ్లకే. క్యాట్ ఎంట్రెన్స్‌లో 95.95 శాతం స్కోర్‌తో దేశంలోనే అతి పిన్న వయస్కురాలైన ఇంజినీర్‌గా చరిత్రకెక్కింది. ఈ ర్యాంకుల రాకెట్ పేరు సంహిత. చుదువులో ఎప్పుడూ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటుంది. అలా అని చదువుకే పరిమితం కాదు. సంగీతం, చిత్రలేఖనం ఇతర రంగాలలోనూ ప్రావీణ్యం సాధించింది. పదహారేండ్లకి ఇంజినీరింగ్ పూర్తి చేసిన మొదటి భారతీయురాలిగా గుర్తింపు పొందింది.


బాలమేధావి ప్రయాణం ఇలా..

సంహిత తండ్రి పేరు ఎల్ ఎన్ కాశీభట్ట. తల్లి గీత. వీరిది హైద్రాబాద్. సంహితకి మూడేండ్లు ఉన్నప్పుడు ఒక పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చాడు నాన్న. అందులో 200 దేశాల పేర్లు, వాటి రాజధానులు, దేశాల జెండాలున్నాయి. వాటన్నంటినీ గుర్తుపెట్టుకొని తడబడకుండా చెప్తుండేది. అది చూసిన తల్లిదండ్రులు, బంధువులు ఆశ్చర్యపోయేవారు. తల్లిదండ్రులు ఆలస్యం చెయ్యకుండా ఆమె తెలివికి పదును పెట్టారు. క్రమంగా స్టేజ్ షోలు ఇచ్చే స్థాయికి ఎదిగింది సంహిత. ఐదేండ్ల నుంచే వేదికల మీద ప్రసంగించడం మొదలు పెట్టింది. అప్పుడు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఇచ్చిన పుస్తకాన్ని చదివి.. సౌర కుటుంబం గురించి 15 పేజీల వ్యాసం రాసింది. దానిని అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు పంపింది. ఆ వ్యాసాన్ని చూసి ఆశ్చర్యపోయిన ఆయన.. తనను కలిసే అవకాశం కల్పించారు. సంహిత ప్రతిభ తెలుసుకున్న మాజీ రాష్ట్రపతి యు ఆర్ వెరీ గుడ్ గాళ్ అంటూ ప్రశంసించారు. ఆ మాటలను ఎప్పటికీ మర్చిపోలేనని చెబుతున్నది సంహిత. రెట్టించిన ఉత్సాహంతో తీవ్రవాదం, ఆర్థిక వ్యవస్థపై అనేక వ్యాసాలు రాసి, చిత్రాలు వేసి ప్రముఖల ప్రశంసలు పొందింది. ఇందుకు పుస్తకాలు, వార్తా పత్రికలు ఎక్కువగా చదివేది.


చిన్న వయసులోనే పెద్ద చదువు..

పదేండ్లకి పదో తరగతి పూర్తి చేసింది. 12 యేండ్లకి ఇంటర్మీడియట్ 89 శాతంతో పూర్తి చేసింది. తర్వాత ప్రభుత్వ అనుమతితో హైదరాబాదులోని సీబీఐటీ కళాశాలలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో సీటు సాధించింది. అప్పుడే దేశంలోనే అతిపిన్న వయసులోనే ఇంజినీరింగ్ పూర్తి చేసిన రికార్డు సొంతం చేసుకున్నది. తాను ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడు రెండు జడలు వేసుకొని కాలేజ్‌కు వెళ్లేదట. అక్కడి విద్యార్థులందరూ తనని ఎవరి చెల్లివి అని ప్రశ్నించేవారట. అప్పుడు సంహిత నేనూ మీలాగే విద్యార్థిని అని చెబితే అశ్చర్యపోయేవాళ్లని తన అనుభవాలను(నవ్వుతూ) గుర్తు చేసుకుంటున్నది సంహిత. ఇంజినీరింగ్‌లో ఈవెంట్స్‌కు, పలు ప్రాజెక్ట్‌లకు టీం లీడర్‌గా ఉండేది. అప్పుడే తనకు లీడర్‌షిప్ అలవడింది. అందుకే ఎంబీఏ చేసేందుకు క్యాట్ ఎంట్రెన్స్ రాసి చరిత్రకెక్కింది.
-వనజ వనిపెంట


samhitha2

టార్గెట్ ఫైనాన్షియల్ అనలిస్ట్!

ఐఐఎంలో ఫైనాన్స్ చేయడం నా మొదటి లక్ష్యం. ఆ తర్వాత అమెరికాలోని సీఎఫ్‌ఏ ఇనిస్టిట్యూట్ నుంచి ఛార్టెడ్ ఫైనాన్సియల్ అనలిస్ట్ అవ్వడం నా తదుపరి లక్ష్యం. దాని వల్ల దేశ ఆర్థికాభివృద్ధిలో నా వంతు పాత్ర నిర్వహించాలనేది నా జీవిత ఆశయం. నేను అందరితో చాలా సరదాగా ఉంటా. అలాగని నిత్యం చదువులతో బిజీగా ఉండను. సినిమాలు బాగా చూస్తా. మహేశ్‌బాబు అంటే ఇష్టం. ఆయన సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే. నా కృషి, పట్టుదల వెనుక తల్లిదండ్రుల పాత్ర మరవలేనిది.
- సంహిత, క్యాట్ టాపర్

998
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles