సంపాదన మొదలైందా.. కష్టార్జితానికి విలువ తెలుసుకోండి


Sat,August 25, 2018 01:28 AM

MONEY
నేటి యువతలో ఎప్పుడెప్పుడు తమ సొంత కాళ్లమీద నిలబడుదామా? అన్న కుతూహలం కనిపిస్తున్నది. సంపాదనలో దూసుకెళ్లాలన్న ఉత్సాహం తొణికిసలాడుతున్నది. అయితే ఆదాయం, ఖర్చు విషయాల్లో ఓ అవగాహన అనేది తప్పనిసరి. అప్పుడే ఆర్థిక స్థిరత్వం అనేది సిద్ధిస్తుంది. ఏది ఇప్పుడు అవసరం, మరేది ఎప్పుడు అవసరం అన్నది తెలుసుకోవాలి. ఈ పది నియమాలకు కట్టుబడి ఉంటే.. మీ కష్టార్జితానికి సరైన విలువ, గౌరవం దక్కినట్లే.


బ్యాంక్ ఖాతా

బ్యాంక్ ఖాతాతో మీ ఉద్యోగ జీవితాన్ని ఆరంభించండి. మీ సంపాదనను అందులో దాచండి. దీనివల్ల మీకో ఆర్థిక హోదా లభిస్తుంది. రుణ లభ్యతకు అవకాశం ఏర్పడుతుంది. బ్యాంక్ ఖాతాను కేవలం ఓ బాధ్యతగా కాకుండా, మీ ఆర్థిక జీవనానికి ప్రతిబింబంగా పరిగణించండి. డిపాజిట్లు, విత్‌డ్రాలపట్ల దృష్టి పెట్టండి. అప్పుడే మన ఆదాయ, వ్యయాలను అంచనా వేయగలం. అవసరమైన ఖర్చులకే తప్ప, అనవసరమైన ఖర్చులకు ఖాతాలో నుంచి డబ్బును తీయకపోవడమే మంచిది.


బడ్జెట్

మీ ఆదాయంలో మీ ఖర్చెంత? అన్నదానిపై స్పష్టత ఉండాలి. లేకపోతే మిగిలేది ఆర్థిక ఇబ్బందులే. ఇంటి అద్దె, ఆహారం ఇతరత్రా వ్యక్తిగత ఖర్చులు, ప్రయాణాలు వంటి అవసరాలపై నెలనెలా ఎంత వెచ్చిస్తున్నాం.. అన్నది తప్పక తెలిసి ఉండాలి. లేకపోతే లేనిపోని ఖర్చులతో అత్యవసరాలకు డబ్బు లేకుండా పోతుంది. అప్పుడు అప్పుల వైపునకు మళ్లాల్సి వస్తుంది. నిర్ణీత అవసరాలు తీర్చుకున్నాకే పొదుపు గురించి ఆలోచించడం ఉత్తమం. లేదంటే అపజయమేనన్న విషయం మరువరాదు.


ఖర్చులపై నియంత్రణ

ఖర్చులపై నియంత్రణ అనేది అత్యంత కీలకం. ఆదాయం ఉంది కదా.. అని దుబారాకు దిగితే చివరకు మిగిలేది అప్పులే. ఆదాయ మార్గాల్లో హెచ్చుతగ్గులు అనేవి అత్యంత సహజం. నేడున్న సంపాదన.. రేపు పెరుగొచ్చు లేదా తగ్గొచ్చు. కాబట్టి ఖర్చుల విషయంలో ఆచితూచి అడుగేయడం ఎప్పటికైనా మంచిది. అదుపు తప్పిన ఖర్చును దారిలోకి తేవడం చాలా కష్టం. కాబట్టి ఎప్పుడూ మన చేతిలో కాస్త నగదుండేలాగే నడుచుకోవాలి. అలాగే అనవసరంగా క్రెడిట్ కార్డుల జోలికి వెళ్లవద్దు. వీటివల్ల వ్యయ నియంత్రణ సాధ్యం కాకపోవచ్చు.


రుణ చరిత్ర

రుణాలను తీసుకున్నప్పుడు వాటిని సజావుగా చెల్లించాలి. విద్యా రుణం, వాహన రుణం ఎదైనాసరే బ్యాంక్ రికార్డుల్లో మన రుణ చరిత్రను క్లీన్‌గా ఉంచుకోవడం చాలాచాలా అవసరం. అప్పు చెల్లించడంలో అశ్రద్ధ.. మీ రేపటి ఆర్థిక సమర్థతనే ప్రశ్నిస్తుందన్న విషయం మరిచిపోవద్దు. డబ్బు లేదని కిస్తీలు కట్టకుండా తప్పించుకు తిరుగడం చాలా ప్రమాదం. డిఫాల్టర్ ముద్రపడితే భవిష్యత్తులో గృహ రుణాలకు ఇబ్బందులు రావచ్చు. కాబట్టి సొమ్మును చెల్లించలేని పరిస్థితే ఎదురైతే బ్యాంకర్లను సంప్రదించి రీషెడ్యూల్‌కు ప్రయత్నించండి.


పొదుపు

చిన్నతనం నుంచే పొదుపును అలవరుచుకోవడం మంచి లక్షణం. ఖర్చులెన్ని ఉన్నా.. పొదుపు కోసం మన సంపాదనలో కొంత కేటాయించడం మరిచిపోవద్దు. ఆరంభంలోనే పెద్దపెద్ద సేవింగ్స్ జోలికి వెళ్లకుండా.. మీ సామర్థ్యానికి తగ్గట్లుగా ప్రణాళిక వేసుకోవాలి. చిన్న మొత్తమే కదా అని తేలిగ్గా తీసుకోవద్దు. ఇవే రేపటికాలంలో పెద్ద ప్రయోజనాలను అందిస్తాయి. అలాగే వీలైతే రికరింగ్ డిపాజిట్‌తో బ్యాంకుల్లో, ఎస్‌ఐపీ ద్వారా మ్యూచువల్ ఫండ్‌లలో పెట్టుబడులను ప్రారంభించుకోవచ్చు.


లక్ష్య సాధన

ప్రతీ ఒక్కరి జీవితంలోనూ కొన్ని లక్ష్యాలనేవి ఉంటాయి. వాటి సాధనకు బలమైన ఆర్థిక సామర్థ్యం అవసరం. మనం నిర్దేశించుకునే లక్ష్యాలు అందని ద్రాక్షలా ఉండకూడదు. మన స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని లక్ష్యాలను నిర్ణయించుకుంటే వాటిని సాధించడం సులభతరమవుతుంది. అలాగే అన్ని అవసరాలనూ ఒకేసారి తీర్చుకోవడం కంటే ఒక్కటొక్కటిగా నేరవేర్చుకోవడం ఉత్తమం. గృహోపకరణాలైనా, వాహనాలైనా, గృహాలైనా.. ఏవైనాసరే సంపాదనకు తగ్గట్లుగా వాటి విలువ ఉండేలా చూసుకోవాలి.


ఆదాయ మార్గాలు

ఆదాయ మార్గాలు విస్తృతంగా ఉన్నప్పుడే ఆర్థిక లక్ష్యాలు త్వరగా నెరవేరుతాయి. అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్నీ చేజార్చుకోవద్దు. ఉద్యోగం, వ్యాపారం ఏదైనాసరే ప్రగతి అనేది ఉండాలి. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా సంపదనూ పెంచుకునే మార్గాలను అన్వేషించాలి. ఈ విషయంలో ఏమరుపాటు మంచిది కాదు. మనం చేస్తున్న పనిలో లేదా మనమున్న రంగంలో వచ్చే మార్పులను ఒడిసిపట్టుకోగలిగితే విజయం మనదే. సాంకేతికంగా, చదువుపరంగా దృఢంగా ఉంటే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.


పన్ను ప్రయోజనాలు

మన ఆర్థిక ఎదుగుదలలో పన్నులు కూడా కీలకపాత్ర పోషిస్తాయి. ఆదాయాన్ని మరుగునపెట్టడం కంటే, నిజాయితీగా బయటపెట్టి తద్వారా పన్ను ప్రయోజనాలను పొందడం మంచిది. పన్నులు చెల్లించడం వల్ల అనేక లాభాలు కూడా ఉంటాయి. అన్ని ఖర్చులనూ విశదీకరిస్తే ప్రభుత్వ ప్రోత్సాహకాలూ లభిస్తాయి. ముఖ్యంగా గృహ రుణాల వంటి వాటి విషయంలో మరొకరిపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.


అత్యుత్సాహం వద్దు

అత్యుత్సాహం అన్నివేళలా పనికిరాదు. ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాల్లో తొందరపాటుకు తావివ్వకూడదు. స్టాక్ మార్కెట్ల వంటి వాటిల్లో పెట్టుబడులకు అవగాహన తప్పనిసరి. వాటిపై అమితాసక్తి మీ పొదుపు ప్రయోజనాలను దెబ్బతీయవచ్చు. అలాగే త్వరిత లాభాలపట్ల ఆకర్షితులు కారాదు. నకిలీ సంస్థలు ప్రకటించే పథకాల విషయంలో జాగ్రత్త ఉండాలి. మేలైన పెట్టుబడులనే ఎంచుకోవాలి. అప్పుడే మన కష్టార్జితానికి తగిన భద్రత ఉంటుంది.


ఆర్థిక నిర్వహణ

ఆర్థిక లావాదేవీల నిర్వహణ అనేది నైపుణ్యంతో కూడుకున్నది. నిన్నటి అవసరాలు ఎలా ఉన్నాయి?.. నేటి ఖర్చులు ఏమిటీ?.. రేపటి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి?.. అన్నదానిపై అవగాహన ఉండాలి. సమస్యలు అనేవి చెప్పిరావు. సమర్థవంతమైన ఆర్థిక క్రమశిక్షణతోనే ముందుచూపు అనేది అలవడుతుంది. అప్పుడే అనుకోకుండా వచ్చే ఖర్చుల్ని అధిగమించగలుగుతాం. మన ఆర్థిక లక్ష్యాలకూ, జీవిత గమ్యాలకూ చేరువ కాగలుగుతాం.

816
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles