సంపద సృష్టికి ఇరవైల్లోనే బీజం వేయండి


Sat,December 29, 2018 12:32 AM

రెండు పదుల వయసు.. బాధ్యతల బరువెరుగని ప్రాయం. సరదాలే సర్వస్వంగా భావించే మనసు. కోరికలకు పట్టపగ్గాలు లేని జీవితం. కానీ.. కాస్త ఆలోచిస్తే మీ సంపద సృష్టికి సరైన పునాదులు వేసుకోగలిగింది ఈ ఇరవైల్లోనేనన్నది తెలుస్తుంది. ఈ యుక్త వయసులో మీరు అందిపుచ్చుకునే అలవాట్లే.. మీ జీవన గమనాన్ని నిర్దేశించగలవు. ఆర్థిక క్రమశిక్షణ అనే మొక్కను మీ ఇరవైయ్యవ ఏట నాటితే.. అరవైయ్యవ ఏట అంతులేని ఆనందం మీ సొంతమే. ఇందుకు మీరు గొప్పగొప్ప త్యాగాలనేమీ చేయనక్కర్లేదు. గుట్టలు, కొండలను ఎక్కనూ అక్కర్లేదు. కేవలం కొన్ని ఆర్థికపరమైన నిర్ణయాలను ఆచరణలో పెడితే చాలు. మీ కలల జీవితం మీ కండ్ల ముందే ఉంటుంది.అందుకు ఈ ఆరు సూత్రాలను పాటించండి.
Bhima

బీమా కవరేజీ

ఓవైపు లక్ష్యాల సాధన కోసం పనిచేస్తూ.. మరోవైపు జీవితాన్ని ఆస్వాదిస్తున్న ఇరవై ఏండ్ల వయసువారికి బీమా కవరేజీపై దృష్టి పెట్టాలంటే కాస్త బోరింగ్‌గానే భావించవచ్చు. కానీ అలాంటి తీరు సరికాదు. భవిష్యత్తు ఎలా? ఉంటుందో మనకు తెలియదు. ఊహించలేని ఎన్నో మలుపులకు మన జీవితం గురికావచ్చు. కాబట్టి రేపటి రోజున ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రణాళికలు వేసుకోవడం.. ఆ దిశగా ముందుకెళ్లడం చాలాచాలా మంచిది. ఇలాంటి వాటిల్లో ఒకటే బీమా. అనుకోని ఉపద్రవాల నుంచి మనవాళ్లని రక్షిస్తుంది. కనీసం టర్మ్ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమాలనైనా కొనుగోలు చేయండి. దురదృష్టవశాత్తు మీరు చనిపోతే మీపై ఆధారపడినవారు, మిమ్మల్నే నమ్ముకున్నవారు అన్యాయం కాకుండా ఉంటారు. వారికి బీమా సొమ్ము చేదోడువాదోడుగా ఉంటుంది. అలాగే ఆరోగ్య బీమా కూడా. అనారోగ్యం పాలైనప్పుడు ఆస్పత్రి ఖర్చుల భారాన్ని తగ్గించుకోవచ్చు. వయసు ఆధారంగానే బీమా పాలసీల ప్రీమియం కూడా ఉంటుంది కాబట్టి చిన్న వయసులో బీమాతో పెద్ద ప్రయోజనాలనే అందుకోవచ్చు.

రిటైర్మెంట్ ఫండ్

రిటైర్మెంట్ ఫండ్‌తోనే మీ సంపద ప్రణాళికకు శ్రీకారం చుట్టండి. ఎందుకంటే వృద్ధాప్యంలో తలెత్తే ఆర్థిక సమస్యల్ని అలవోకగా జయించడానికి రిటైర్మెంట్ ఫండ్ ఎంతగానో దోహదపడుతుంది. హెచ్‌ఎస్‌బీసీ అధ్యయనం ప్రకారం 68 శాతం భారతీయులు ముసలితనంలో కుటుంబం నుంచే ఆర్థిక అవసరాలను పొందుతున్నట్లు తేలింది. 30 శాతం మంది మాత్రమే వృద్ధాప్యంలోనూ తమ ఆర్థిక అవసరాలను సొంతంగా తీర్చుకోగలుగుతున్నారు. ఈ ఒక్క కారణం చాలు రిటైర్మెంట్ ఫండ్ అనేది మీకు ఎంత ముఖ్యమో చెప్పడానికి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)లో పెట్టుబడులు పదవీవిరమణ అనంతర కాలంలో చక్కని భరోసాను కల్పిస్తాయి. పీపీఎఫ్ పెట్టుబడులు ఎంతో సురక్షితం. ఆకర్షణీయమైన రాబడి కూడా ఉంటుంది. పన్ను ప్రయోజనాలూ వర్తిస్తాయి. 15 సంవత్సరాల కాలపరిమితితో నెలకు రూ.3,000 చొప్పున పెట్టుబడులు పెడితే.. ప్రస్తుత వడ్డీరేటు 8 శాతం ప్రకారం రూ.10 లక్షల 55,674లను అందుకోవచ్చు. నెలనెలా రూ.5,000 సేవింగ్స్ చేస్తే రూ.17 లక్షల 59,457లను పొందవచ్చు.

అత్యవసర నిధి-పొదుపు

అత్యవసర లేదా అగంతుక నిధి ఏర్పాటు అన్నది అందరికీ ప్రధానమే. ఆపత్కాలంలో ఈ నిధి మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను అనేక విధాలుగా ఆదుకోగలదు. ఊహించని వైద్య ఖర్చులను తీర్చగలదు. నగదు అవసరాల నిమిత్తం ఏర్పాటు చేసుకునే ఈ నిధి కోసం రికరింగ్ డిపాజిట్లను చక్కని మార్గాలుగా భావించవచ్చు. దాదాపు 7 శాతం రాబడినిచ్చే ఈ పెట్టుబడులతో చికిత్స వ్యయంతోపాటు తదనంతర కాలం ఖర్చులను అధిగమించవచ్చు. ఇక సేవింగ్స్ ఖాతాల్లోనూ తగిన మొత్తాలను నిల్వ చేసుకోండి. తక్షణ సహాయార్థం ఇవి ఉపయోగపడగలవు. స్వల్ప, మధ్యకాలిక లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి సాయపడగలవు. వాహన, గృహ కొనుగోళ్ల సమయంలో డౌన్‌పేమెంట్లనూ చేసుకోవచ్చు. శుభకార్యాల ఖర్చులను భరించవచ్చు. 3-5 ఏండ్ల కాలవ్యవధితో డెబ్ట్ ఫండ్స్‌ను ఎంచుకుంటే 8-9 శాతం ప్రతిఫలం చేతికందుతుంది. ఆదాయం పెరిగినప్పుడు సేవింగ్స్‌ను కూడా పెంచుకోవాలన్న సూత్రాన్ని మరువరాదు.
money

కెరియర్‌కు ప్రాధాన్యత

ఇరవై ఏండ్ల వయసులో కెరియర్‌ను తీర్చిదిద్దుకోవడానికి ఎంతో సమయం ఉంటుంది. చిన్నచిన్న సేవింగ్స్.. భవిష్యత్తులో పెద్దపెద్ద అవసరాలనే తీర్చగలవు. ముఖ్యంగా మీరు బాగుంటేనే మీ లక్ష్యాలు సాకారం కాగలవు. కాబట్టి వృత్తిపరంగా నైపుణ్యం సాధించడానికీ ప్రాధాన్యత ఇవ్వండి. భవిష్యత్తు ప్రకాశవంతంగా ఉండే కోర్సులపై దృష్టి పెట్టండి. సర్టిఫికెట్ కోర్సు, పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిగ్రీ, డిప్లొమా ప్రోగ్రాం వంటివి ఉపయుక్తంగా ఉంటాయి. సంపాదనే ముఖ్యమన్న ధోరణిలో కాకుండా చదువుకూ పెద్దపీట వేయాలి. అప్పుడే మీ సంపద సృష్టికి బలమైన పునాదులు పడుతాయి. ఇక ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ అస్సలు పనికిరాదు. దురలవాట్ల జోలికి వెళ్లకుండా లక్ష్యాలపై మనసు పెట్టండి. యోగా, మార్షల్ ఆర్ట్స్ తదితర వాటిని ఆచరించండి. శరీరం ధృడంగా ఉంటే, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడే చేసే పని చక్కగా నెరవేరగలదు.

దీర్ఘకాలిక లక్ష్యాల కోసం..

ప్రతీ మనిషి జీవితంలో దీర్ఘకాలిక లక్ష్యాల సాధన అనేది అత్యంత కఠిన పరీక్ష. ఆర్థికపరమైన ఈ లక్ష్యాల సాధనకు ఈక్విటీ-లింక్డ్ మ్యూచువల్ ఫండ్స్‌ను ఉపయోగించుకోండి. పిల్లల విద్యావసరాలు, సొంతింటి కల సాకారానికి ముందస్తు ప్రణాళికతో చేసే పెట్టుబడులు, పొదుపే కీలకం. ఎస్‌ఐపీల ద్వారా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ల్లో పెట్టుబడులు మంచి ఆలోచనగా చెప్పవచ్చు. కనీసం ఏడేండ్లుండే పెట్టుబడులను ఎంచుకుంటే లాభదాయకంగా ఉంటుంది. దాదాపు 12-15 శాతం రాబడులను పొందవచ్చు. ఆదాయం లేదా మీ జీతం పెరిగిన ప్రతీసారి ఓ కొత్త మ్యూచువల్ ఫండ్‌ను ఆరంభించవచ్చు. స్టాక్ మార్కెట్లకు అనుబంధంగా ఉన్న ఈ పెట్టుబడులు దీర్ఘకాలంగా లాభాలనే అందించే అవకాశాలు ఎక్కువ. లక్ష్యాలు, వాటి ప్రాధాన్యతాక్రమంలో ఈ పెట్టుబడులను ప్లాన్ చేసుకోండి.
Adhil

రుణాన్ని సద్వినియోగం చేసుకోండి

రుణాలంటే చాలామంది భయపడిపోతారు. అయితే ఈ భయాలను వీడి రుణాలను ఎలా? సద్వినియోగం చేసుకోవాలో ఒక్కసారి ఆలోచించండి. అప్పుడు రుణాలతో చేకూరే ప్రయోజనాలూ మనకు గోచరిస్తాయి. ఉదాహరణకు ఓ చిన్న వ్యక్తిగత రుణం తీసుకుని, దాన్ని సకాలంలో చెల్లిస్తున్నారనుకోండి.. అప్పుడు మీ క్రెడిట్ స్కోర్ బాగా పెరుగుతుంది. గృహ రుణాల సమయంలో ఈ క్రెడిట్ స్కోర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే స్థోమతకు మించిన రుణాల జోలికి మాత్రం వెళ్ళవద్దు. దీన్ని తిరిగి చెల్లించకపోతే మీ రుణ పరపతి దెబ్బతింటుంది. అలాగే అవసరం ఉన్నా.. లేకున్నా.. రుణాల వైపు చూడకూడదు. అదేపనిగా రుణాలు తీసుకున్నా, కాలపరిమితికి ముందే రుణాలు చెల్లించినా, ముఖ్యంగా గోల్డ్ లోన్ల వంటి వాటిలో ముందస్తు చెల్లింపులు జరిపి సదరు లోన్లను ముగించినా క్రెడిట్ స్కోర్ దెబ్బతినే వీలున్నది. కాబట్టి రుణం విషయంలో జాగ్రత్త వహిస్తూనే.. వాటిని సద్వినియోగపర్చుకుంటే బోలెడన్నీ లాభాలుంటాయి.

585
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles