శుభసంకల్పానికి ఆది.. ఉగాది


Fri,April 5, 2019 11:43 PM

నిఖిల జగతిలోని ప్రతీ ప్రాణి జీవనంలో మార్పును తీసుకొస్తూ, జీవన ఒరవడిలో నూతన ఉత్సాహాన్ని నింపుతూ ఆహ్లాదాన్ని పంచే ఋతుధర్మానికి ప్రతీక ఉగాది. లోకంలోని జీవ జాతులన్నీ విధి నిర్వహణలో వెనుకపడవచ్చేమో గాని, ఋతు ధర్మం మాత్రం గతి తప్పదు. గతి తప్పని జీవితాన్నే కదా.. ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. కాబట్టి మన ఆలోచనల్లో, బతికే విధానంలో, సమాజం పట్ల ఏర్పరచుకున్న భావనల్లో, బాధ్యతల్లో మార్పునూ, నూతనత్వాన్నీ ఆహ్వానించమనే సందేశమిస్తుంది ఉగాది. సకల చరాచర సృష్టికీ ఆది ఉగాది. ప్రతీ యుగానికీ ఆదిలో 84 లక్షల జీవరాశుల్ని సృష్టించి విశ్వరచనకు శ్రీకారం చుట్టిన యుగాది మనలోని మనల్ని నూతన ఒరవడి దిశగా పయనింపజేసే ఉగాదిగా ఆవిష్కృతమవుతుంది. వినూత్న సిద్ధాంతాలకు ఆహ్వానం పలుకుతుంది. విలువైన జీవితాలను పొందికగా కొత్త సంవత్సరంలోకి నడిపిస్తుంది. ఆచరణకు అనుగుణంగా రాబోయే వత్సరమై స్వాగతిస్తుంది.
ugadipachadi
యుగాది.. సంవత్సరాది.. ఉగాది : కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం అనేవి పునరావృతం అవుతూ అనంతమైన, అద్భుతమైన సృష్టిని అనాదిగా నడిపిస్తున్నాయి. కృతయుగం-1,728,000, త్రేతాయుగం-1,296,00, ద్వాపరయుగం -8,64,000, కలియుగం 432,000 వేల సంవత్సరాలనీ శాస్ర్తాలు చెబుతున్నాయి. కాలగణన పటిష్టంగా నిర్దేశించిన సంస్కృతీ పరంపరలో ప్రతీయుగంలో వచ్చే మొదటి సంవత్సరమే యుగాది అనీ రెండో సంవత్సరం నుంచి యుగం ముగిసేవరకూ వచ్చే అన్ని మొదటి రోజులూ సంవత్సరాదులుగా చెప్పబడ్డాయి.

సంవత్సరస్తు ప్రథమో ద్వితీయ పరివత్సరః
ఇద్వత్సరస్తృతీయస్తు చతుర్ధశ్చానువత్సరః
పంచమోవత్సరాశ్చాత్ర కాలోయం యుగ సంజ్ఞకః

ప్రభవాది సంవత్సరాలలో మొదటిది సంవత్సరం, రెండోది పరివత్సరం, మూడోది ఇద్వత్సరం, నాలుగోది అనవత్సరం, ఐదోది వత్సరం అనీ, ఈ ఐదింటి కాలానికి యుగం అనే పేరునూ పేర్కొంది విష్ణుపురాణం. కాబట్టి యుగారంభమైన తొలి సంవత్సరం ఉగాదిగా, మిగతావన్నీ సంవత్సరాదులుగా జరుపుకోవాలని శాస్ర్తోక్తం. తొలి శ్రీకారం ఎప్పుడూ శుభారంభమే, కాబట్టి దానికి గుర్తుగా ప్రతీ సంవత్సరాదిని ఉగాదిలా జరుపుకొని అందరూ బాగుండాలనే సంకల్పంతో శుభాభినందనలు పంచుకోవాలి.

బ్రహ్మ తన సృష్టిని బ్రహ్మకల్పం ఆరంభమయ్యే మొదటి సంవత్సరమైన ప్రభవలో, మొదటి మాసమైన చైత్రమాసంలో, ఋతువులలో మొదటిదైన వసంత ఋతువులో, మొదటి తిథి అయిన పాడ్యమి రోజు, మొదటివారం అయిన ఆదివారం, మొదటి నక్షత్రం అయిన అశ్వనీ నక్షత్రంలో రోజులో మొదటి భాగమైన పగలు, ఆ పగటిలో మొదటిదైన బ్రహ్మీ ముహూర్తంలో అద్భుతంగా ప్రభవింపజేశాడు. అదే యుగానికి ఆది.. ఉగాది.. సంవత్సరాది.
శాలివాహన శకం: దైవారాధనలో సంకల్ప మంత్రాలకు ఆధారమైన బ్రహ్మ కల్ప, శ్వేత వరాహకల్పాన్ని తెలుపుతూ చదివే శ్రీవిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆదన బ్రహ్మణఃద్వితీయ పరార్దే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే శాలివాహన శకే అనేది కాలమానం. దాని ప్రాముఖ్యతనూ తెలుపుతుంది. శాలివాహన చక్రవర్తి క్రీ. శ. 79లో పట్టాభిషక్తుడైనప్పటి నుంచీ ఈ యుగాన్ని శాలివాహన శకంగా పేర్కొన్నారు.

క్రీ.శ. నాలుగవ శతాబ్దంలో వరాహమిహిరుడు వసంత విఘత కాలాన్ని సంవత్సరాదిగా ప్రకటించినట్లు చరిత్ర చెబుతున్నది. కలియుగం ప్రారంభమై ఇప్పటికి 5,117 సంవత్సరాలు ముగిశాయి. ఈ సంవత్సరాది వికారి నామ 5118వ సంవత్సరంగా నిర్దేశించబడింది. చాంద్రమానాన్ని అనుసరించి మాసగణనం చేయాలనీ, శుక్ల పక్షంలో నెలను లెక్కించాలనీ కమలాక భట్టు పేర్కొన్నట్లు చెబుతారు. చైత్ర శుద్ధపాడ్యమిని ప్రతీ సంవత్సరం శుభదినంగా, సంవత్సరాదిగా, ఉగాదిగా నిర్దేశించారు. చైత్ర మాస శుక్లపక్షమి ప్రతిపదాతిధి పాడ్యమిన సూర్యోదయ సమయంలో పాడ్యమి తిథి ఎప్పుడు ఉంటుందో ఆరోజే ఉగాది పండుగని హిమాద్రి గ్రంథంలో ఉంది. సృష్ట్యాదిని చరితార్థం చేయడానికే సృష్టి ఉద్భవించిన మొదటి సంవత్సరం ప్రభవ అన్న పేరుతో ప్రారంభమై, బ్రహ్మకల్పం అంతమయ్యే చివరి సంవత్సరం క్షయ నామంతో ముగియడం విశేషం.

వసంత రాగాల మధుమాసం: భారతీయతకు మూలం వేదం. ఆ వేదంలో అత్యంత పవిత్రమైన పనీతంగావించే వసంత ఋతువు వర్ణన, చైత్రమాస ప్రస్తావన ఉంది. మధుశ్చ, మాధవశ్చ వాస్తవికావృతూ.. అని యజుర్వేదంలో ఉన్నది. మధుమాసం, మాధవ మాసాలలో వసంత రుతువు ఉంటుందనీ, వేదంలో మొదటి మాసానికి మధుమాసమనీ, రెండో మాసానికి మాధవ మాసమనీ పేరు. వేదంలో పేర్కొన్న మధు, మాసాలు చైత్ర, వైశాఖ మాసాలుగా జ్యోతిష శాస్త్రం నిర్ధారించింది. చిత్తా నక్షత్రంలో సంబంధం ఉన్న చైత్ర మాసం అనేక శుభ విశేషాలు కలిగిన వసంత కాలంగా సంవత్సరాదికి ఆలవాలమైంది.

షడ్రుచుల ఉగాది పచ్చడి : ఉగాది పండుగ రోజున షడ్రుచుల మేళవింపైన ఉగాది పచ్చడిని సేవించడం సంప్రదాయం. ఈ రోజున సూర్యోదయానికి ముందే తలంటు స్నానం చేసి, నూతన వస్ర్తాలు ధరించి, సూర్య నమస్కారం చేసి, భగవంతుని ఆరాధించి సంకల్పాదౌ నూతన వత్సనామ కీర్తనం అని కొత్త సంవత్సరం పేరు చెబుతూ సంకల్పం చెప్పాలని ధర్మసింధువు చెబుతుంది. తర్వాత వేపపువ్వు పచ్చడిని దేవునికి నివేదించి, దాన్ని ఆరగించాలి.
మధుర (చెఱకు గడలు), ఆమ్ల(చింతపండు), కటు(మిరియాలు), కషాయ(మామిడి), లవణ(ఉప్పు), తిక్త(వేపపువ్వు) అనే షడ్రుచుల మేళవింపు అయిన ఉగాది పచ్చడిని సంస్కృతంలో నింబకుసుమ భక్షణం అంటారు. వసంతకాలంలో వచ్చే రుగ్మతలను తొలిగించే దివ్యౌషధంగా పనిచేస్తుంది ఉగాది పచ్చడి. దీన్ని సేవిస్తే శతాయుర్వజ్ర దేహయుః ర్వసంసత్కరాయ సర్వారిష్ట వినాశాయా నింబ కుసుమ భక్షణం అన్నట్లు దృఢమైన దేహంతో పాటు అదృష్టం కలిసి వస్తుందనేది శాస్త్ర వచనం. సర్వారిష్టాలనూ తొలిగించి, సర్వసంపదలనూ కలిగించి, అదృష్టాన్ని వృద్ధిచేసి ధీర్ఘాయువునూ, వజ్రాతుల్య దేహదారుఢ్యాన్ని ప్రసాదిస్తుంది ఉగాది పచ్చడి. సేవనం, భక్షణం. ఆనందకర, బాధాకర పరిస్థితులన్నింటినీ సమానంగా స్వీకరించే మానసిక ధోరణి మనకు అలవాటు కావాలనే సందేశానికి షడ్రుచుల ఉగాది పచ్చడి ప్రతీకగా నిలుస్తుంది.

పూర్ణకుంభ దానం : జీవితమనే ప్రయాణంలో ఎన్నో మలుపులూ, గెలుపులూ ఉంటాయి. అధైర్యపడకుండా మన కర్తవ్యాన్ని సవ్యంగా నిర్వర్తిస్తూ మందుకు వెళ్ళాలనే ైస్థెర్యాన్నీ, ఉత్సాహాన్ని అందిస్తుంది ఉగాది. ఆశీర్వచనాల వెల్లువే అందుకు ఆలంబన. కనుక ఉగాది పండుగ రోజున పూర్ణ కుంభ దానం, ప్రపాదానంగా శాస్ర్తాల్లో చెప్పబడింది. యథాశక్తి రాగి, వెండి, పంచలోహం లేదా మట్టితో చేసిన కొత్త కుండను కలశంలా చేసి, దానం చేసినట్లయితే, నూతన సంవత్సరంలో మనం కోరుకున్నవన్నీ నెరవేరుతాయని నమ్మకం. కొత్త బట్టలూ, పూర్ణకుంభ దానం అర్హులకిచ్చి, వారి ఆశీస్సులు పొందడం వల్ల విశేష ఫలితం లభిస్తుంది.

పంచాగ శ్రవణం: పంచాంగం అంటే తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఐదు అంగాల సమాహారం. సంపద కోసం తిథి, ధీర్ఘాయువు కోసం వారం, పాప విముక్తి కోసం నక్షత్రం, రోగ విముక్తి కోసం యోగం, విజయం కోసం కరణం అనే అయిదు అంగాలను పంచాంగాలుగా తెలుసుకోవాలి. ఆచార పరంపరగా వస్తున్న పంచాంగ శ్రవణం వల్ల నూతన సంవత్సరంలో కలిగే ఆదాయవ్యయాలు, శుభాశుభాలు, గ్రహచారాలు ముందుగా తెలుసుకొని జాగ్రత్తగా వ్యవహరించాలని గ్రహించాలి. శాస్త్ర విధిగా పంచాంగం విన్న వారికి, చదివిన వారికి సూర్యుని వల్ల శౌర్యం, తేజస్సు, చంద్రుని వల్ల భాగ్యం, వైభవం కుజుని వల్ల సర్వమంగళాలు, బుధుని వల్ల బుద్ధివికాసం, గురుని వల్ల జ్ఞానం, శుక్రుని వల్ల సుఖం, శని వల్ల దుఃఖరాహిత్యం, రాహువు వల్ల ప్రాబల్యం, కేతువు వల్ల ప్రాముఖ్యం కలుగుతుందని విశ్వాసం. ప్రతీ మనిషికీ అసలైన ఊపిరి రేపటి రోజు బాగుంటుందనే ఆశ. అదే మనిషిని ముందుకు నడిపించేలా ప్రేరేపిస్తుంది. పంచాంగ శ్రవణం వల్ల ఈ సంవత్సరమంతా బాగుంటుందనే ఆలోచనే మనిషిని కార్యోన్ముఖుణ్ణి చేస్తుంది.

ఆకాంక్షల పర్వం: ఆమని కోయిల రాగాలు, లేత మామిడి పులుపులు, వేపపువ్వుల చేదులు, చెరకు మధుర రసాలు ఋతురాగమై జీవితాల్లో ఆహ్లాదం పంచితే ఆచారాలూ, సంప్రదాయాలు ఉగాది సాక్షిగా నూతన సంవత్సరం శుభాలకు నెలవై ఆనందాన్నీ, నమ్మకాన్నీ ఇస్తాయి. శ్రీవికారి నామ సంవత్సరం ఆకాంక్షలు నిండిన ఆనందపు తోరణాలు, విశ్వ శాంతిని కాంక్షించే సదాలోచనలు, సర్వజగతికీ శుభం కలుగాలనే సద్భావనలు అందరి జీవితాలకూ పరిచయం చేయాలని కోరుకోవాలి. ఆరంభం ఎప్పుడూ శుభారంభమే. ఆనందాలకూ, ఆకాంక్షలకూ ఆహ్వానమే. అందుకే శ్రీవికారి నామ సంవత్సర ఆరంభం ఉగాది వైభవంగా పరిఢవిల్లాలని ఆకాంక్షిద్దాం.

ఉగాది పండుగ రోజున షడ్రుచుల మేళవింపైన ఉగాది పచ్చడిని సేవించడం సంప్రదాయం. ఈ రోజున సూర్యోదయానికి ముందే తలంటు స్నానం చేసి, నూతన వస్ర్తాలు ధరించి, సూర్య నమస్కారం చేసి, భగవంతుని ఆరాధించి
సంకల్పాదౌ నూతన వత్సనామ కీర్తనం అని కొత్త సంవత్సరం పేరు చెబుతూ సంకల్పం చెప్పాలని ధర్మసింధువు
చెబుతుంది. తర్వాత వేపపూవు పచ్చడిని దేవునికి నివేదించి, దాన్ని ఆరగించాలి.
-ఇట్టేడు అర్కనందనాదేవి

1732
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles