శిఖరాన సెన్సెక్స్ మ్యూచ్‌వల్ ఫండ్ ఇన్వెస్టర్ల కింకర్తవ్యం


Sat,August 25, 2018 01:34 AM

MutualFounds
ఈ ఏడాది ప్రారంభం నుంచి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టంచే అనేక సంఘటనలు జరిగాయి. బడ్జెట్‌లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌ను ప్రవేశపెట్టడంతో మార్చి నెల ముగిసేలోగా హోల్డింగ్స్‌ను ఈక్విటీ ఇన్వెస్టర్లు అమ్ముకోవడంతో సెంటిమెంట్ బలహీనపడింది. ఆ తర్వాత మ్యూచువల్ ఫండ్స్‌ను పునః వర్గీకరించడానికి సెబీ పూనుకుంది. అదే సమయంలో రాబడులు కూడా తగ్గుముఖం పట్టడంతో మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీల షేర్లు తీవ్ర కరెక్షన్‌కు లోనయ్యాయి. గత కొన్నేండ్లలో మంచి రాబడులను అందించిన ఈ షేర్లు ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకున్నాయి. మరో వైపు సెన్సెక్స్ రోజుకో గరిష్ఠ స్థాయిలను తాకుతూ 38000 స్థాయిని వేగంగా అధిగమించింది. సాధారణ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల మదుపు నుంచి ఏమి ఆశించవచ్చునన్నదే ప్రశ్న. ఇప్పటికే ఉన్న మ్యూచువల్ ఫండ్ మదుపును తిరిగి తీసుకోవాలా? రాబడి మరింత పెరిగే అవకాశం ఉందా? లేదా భారీ ఒడిదుడుకులు చూడబోతున్నామా? ఈ ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం.


తెలుసుకోవాల్సిన జవాబు

మీరు నిర్దేశించుకున్న లక్ష్యానికి అనుగుణంగా మదుపు చేయడం చాలా ముఖ్యం. మనకంటూ ఒక లక్ష్యం లేకుండా మదుపు చేయడం తగనిపని. అందుకే మీరు ఇటీవలి కాలంలో మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేస్తున్నట్టయితే మిమ్ముల్ని మీరు ఈ అంశాలను ప్రశ్నించుకోండి. ఒకటి, మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకునే దిశగా మీరు ఎంతవరకు చేరుకున్నారు? మార్కెట్లు పెరగడం, పతనం కావడం చాలా సహజం. మీరు మీ లక్ష్యం మీద దృష్టిని పెట్టడమే ముఖ్యం. అందుకు తగ్గట్టుగా మదుపు చేస్తుండడమే చేయాల్సింది. ఉదాహరణకు వచ్చే ఏడాది మీరు విహరయాత్రలకు వెళ్లాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నారని అనుకుందాం. దానికోసం మీరు రిస్క్ తక్కువగా ఉండి ఒడిదుడుకులు లేని లిక్విడ్ మ్యూచువల్ ఫండ్‌లో మదుపు చేయవచ్చు. అయితే అదే రిటైర్‌మెంట్ లాంటి దీర్ఘకాల లక్ష్యానికి తగ్గట్టుగా మదుపు చేయాలంటే కాస్త రిస్క్‌ను తీసుకోవాల్సిందే. దీర్ఘకాలంలో మంచి రాబడులను ఇచ్చే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయవచ్చు. ఒకవేళ ఇప్పటికే మీరు లక్ష్యాన్ని నిర్దేశించుకోకుండా మదుపు చేయడం ప్రారంభించినట్టయితే వాటిని ఒకసారి సమీక్షించండి. మీ లక్ష్యాలను, ఆశయాలను అవి నేరవేర్చగలవో లేదో పరిశీలించండి. లక్ష్యం లేకుండా మదుపు మొదలు పెట్టి ఉన్నట్టయితే మీ అవసరాలు తగిన మ్యూచువల్ ఫండ్‌ను ఎంపిక చేసుకుని ఉండకపోవచ్చు. లక్ష్యం లేకుండా మదుపు చేస్తున్నట్టయితే తొందరపాటుగా వాటి నుంచి బయటపడతారా? ఆ పని చేయకండి. మదుపు మొత్తాలను సమర్దంగా నిర్వహించడానికి ఇన్వెస్ట్‌మెంట్ సలహాదారున్ని సంప్రదించండి. లాక్ ఇన్ పీరియడ్, ఎగ్జిట్ లోడ్, రాబడులపై పన్ను తదితర అంశాలు మీ మదుపుతో ముడిపడి ఉంటాయి.

MutualFounds2

మీ లక్ష్యాన్ని చేరుకున్నారా?

ఇప్పటికే మీరు మదుపు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారని అనుకుందాం. దాన్ని మీరు ఇప్పటికే చేరుకున్నారా? ఈక్విటీల్లో మదుపు చేయడం అంటే ప్రతి రోజూ ఒడిదుడుకులతో పోరాటం చేయడమే. అందుకే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో మదుపు ద్వారా మీ లక్ష్యాన్ని ఇప్పటికే చేరుకుని ఉంటే ఆ ఫండ్‌లో నుంచి వైదొలిగి ఒడిదుడుకులు చాలా తక్కువగా ఉండే లిక్విడ్ మ్యూచువల్ ఫండ్లలోకి మీ మదుపును మళ్లించండి. ఆ రకంగా మీ సొమ్ము భద్రంగా ఉంటుంది. ఒడిదుడుకులకు దూరంగా ఉంటుంది. అలాగే మీ లక్ష్యాన్ని నేరవేర్చేందుకు మదుపు మొత్తాన్ని వెనక్కి తీసుకుని నగదుగా మార్చుకోవచ్చు. ఒకవేళ ఇప్పటివరకు మీ లక్ష్యాన్ని చేరుకోలేకపోతే, మీరు ఎంచుకున్న ఫండ్‌లో మదుపు చేస్తూ పోతూ ఉండాలి. మార్కెట్‌లో తరచూ వచ్చే హెచ్చుతగ్గులు దీర్ఘకాలంలో లాభాలను సాధించేందుకు అవకాశాలను కల్పిస్తాయి. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకునేంత వరకూ మదుపు చేయడం మానొద్దు.

MutualFounds1

సిప్ మార్గం బెటర్

గత నెల రోజులుగా సెన్సెక్స్ కొత్త గరిష్ఠ స్థాయిలను ఏర్పాటు చేస్తూ వస్తున్నది. ఈ నేపథ్యంలో కొత్త ఇన్వెస్టర్లు మొత్తం డబ్బంతా మంచి రాబడిని ఇచ్చిన ఈక్వీటీ షేర్లలో పెట్టుబడిగా పెట్టాలనుకుంటారు. ఉదాహరణకు ఈ ఆగస్టు నెలలోనే 8 నుంచి 12 శాతం నష్టపోయిన మ్యూచువల్ ఫండ్ స్కీములు అనేకం వున్నాయి. ఈ మ్యూచువల్ ఫండ్లలో ఏకమొత్తంగా మదుపు చేస్తే మార్కెట్ ర్యాలీ కొనసాగితే స్వల్ప కాలంలో మంచి లాభాలాను సాధించవచ్చునని మీరు భావిస్తుండవచ్చు. అయితే ఇలాంటి మదుపులో అనేక రిస్క్‌లను తట్టుకోగలగాలి. అందుకోసం సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఐపీ) పద్దతిని ఎంచుకోవచ్చు. ప్రతి నెలా కొత్త మొత్తాన్ని నిర్దేశించుకున్న తేదీలలో క్రమపద్ధతిలో మదుపు చేస్తుండాలి. పట్టికలో పేర్కొన్న ఉదాహరణను మనం కాస్త లోతుగా చర్చిద్దాం. ఉదాహరణకు ఏబీసీ బ్లూచిప్ ఫండ్‌లో మార్కెట్లు ఉచ్ఛ స్థితిలో ఉన్న జనవరి నెలలో ఏక మొత్తంగా మదుపు చేశారని అనుకుందాం. సంక్రాంతి సమయంలో మీరు మదుపు చేసినప్పుడు ఫండ్ ఎన్‌ఏవీ రూ. 54 అయితే అందులో మీరు లక్ష రూపాయలను మదుపు చేశారని అనుకుందాం.


ఎనిమిది నెలలు గడిచిన తర్వాత ఆగస్టు 15 నాడు ఫండ్ ఎన్‌ఏవీ రూ. 51. దీంతో మీరు చేసిన మదుపు మీ 5.55 శాతం నష్టం వచ్చి మీరు మదుపు చేసిన మొత్తం విలువ లక్ష నుంచి రూ. 94,445కు పడిపోతుంది. కానీ, ఈ ఎనిమిది నెలల్లో అదే మొత్తాన్ని సిప్ పద్ధతిలో మదుపు చేసి ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం. మీరు మదుపు చేయాలనుకున్న లక్ష రూపాయలను ఎనిమిది నెలల్లో సమాన భాగాలుగా ప్రతినెల 15వ తేదీన సిప్ పద్దతిలో మదుపు చేశారని అనుకుందాం. ప్రతినెల ఫండ్ ఎన్‌ఏవీ మారుతూ ఉంటుంది. ఈ ఎనిమిది నెలల్లో 54, 50, 49, 47. 51 చొప్పున ఎన్‌ఏవీలు నమోదు అయ్యాయని భావిద్దాం. అలాంటప్పుడు సగటున రూ. 49.804 ఎన్‌ఏవీతో మదుపు చేశారు. ప్రస్తుతం ఎన్‌ఏవీ రూ. 51గానే పరిగణిద్దాం. జనవరి నెలలో ఉన్న రూ. 54 ఎన్‌ఏవీతో పోల్చితే తక్కువగానే ఉంటుంది. కానీ, మీ మదుపు మాత్రం లాభాల్లో ఉంటుంది. ఎందుకంటే మీరు ప్రతి నెలా క్రమం తప్పకుండా కొనుగోలు చేయడం వల్ల మార్కెట్ ఒడిదుడుకుల్లో సగటు ధరకు కొనుగోలు చేయడం వల్ల మీ మదుపు లాభాల్లో ఉంది.


రిస్క్‌లను పరిశీలించండి

ప్రతి మదుపు రిస్క్‌తో కూడుకున్నదే. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్‌గా మీరు మదుపు చేస్తున్న మ్యూచువల్ ఫండ్ స్కీములకు సంబంధించిన రిస్క్‌లను తెలుసుకోండి. ఉదాహరణకు, మీరు స్మాల్ క్యాప్ ఇన్వెస్టర్ అనుకుందాం. ఒడిదుడుకులు సహజంగా ఉంటాయి కనుక మీ మదుపు దీర్ఘకాలానికి అయి ఉండాలి. సాధారణంగా బ్లూచిప్ ఫండ్లలో మదుపు చేస్తే లాంగ్ టర్మ్ లో ఉత్తమ రాబడులను ఇస్తాయి. అలాగే స్మాల్‌క్యాప్ ఫండ్లతో పోల్చితే ఒడిదుడుకులు తక్కువగా ఉంటాయి. వీటిలో ఫండమెంటల్‌గా పటిష్టంగా ఉన్న కంపెనీలలోనే మదుపు చేస్తారు కనుక రాబడుల్లో స్ధిరత్వం ఉంటుంది. అదే స్మాల్ క్యాప్ ఫండ్లు భారీ ఒడిదుడుకులకు లోనవుతాయి కనుక లాభాలతో ఆ ఫండ్ల నుంచి బయటపడడం అంత తేలిక కాదు.

అదిల్ శెట్టి సీఈవో, బ్యాంక్‌బజార్.కామ్

470
Tags

More News

VIRAL NEWS