e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, May 17, 2021
Home చింతన శారదా పీఠం భారతీ తీర్థం

శారదా పీఠం భారతీ తీర్థం

శారదా పీఠం భారతీ తీర్థం
  • శృంగేరి భారతీ తీర్థ మహాస్వామి సప్తతి పూర్తి మహోత్సవం నేడు

మన భారతదేశం వేదభూమి, తపోభూమి.ఇక్కడ ప్రతి ప్రాంతం దివ్యక్షేత్రమే! ప్రతి నదీ పుణ్యతీర్థమే!!వాటి పవిత్రతను కాపాడేందుకు, సనాతన వైదిక ధర్మ పరిరక్షణకు ఎన్నో పీఠాలు వెలిశాయి.భారతీయ ధార్మిక సంపత్తికి రక్షణ కవచంగా నిలిచాయి.అలాంటి వాటిలో మహిమాన్వితమైనది శృంగేరిలోని శారదా పీఠం .శంకర భగవత్పాదుల నుంచి కొనసాగుతున్న గురు పరంపరలో ఎందరో సిద్ధపురుషులు, తపోధనులు జగద్గురువులుగా భరతజాతికి ధార్మిక మార్గాన్ని నిర్దేశిస్తున్నారు. ఆ పరంపరలో 36వ జగద్గురువులుగా భాసిల్లుతున్నారు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామి. నేటితో 70 వసంతాలు పూర్తి చేసుకున్న శ్రీచరణులకు సప్తతి పూర్తి మహోత్సవం నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా జగద్గురువుల జీవిత విశేషాలు స్మరించుకుందాం.

ఓ యతిశేఖరుడు అడుగులు వేస్తున్నాడు.హిమాచలం నుంచి మొదలైందా నడక.ముందు దండకమండలధారి.వెనుక వీణాపాణి.ఆయనే ఆదిశంకరులు.ఆవిడే శారదాంబ.అమ్మ అందెల సవ్వడి చెవిన పడక శంకరాచార్యులు వెనక్కి తిరిగారు.వాగ్దేవి అక్కడే శారదాంబగా నిలిచిపోయింది.భారతికొలువుదీరిన పుణ్యస్థలి, భారతావనిని రక్షిస్తున్న ఆధ్యాత్మిక కేంద్రం శృంగగిరి.

ప్రశాంత తుంగానది తీరం.
ఓ కప్ప పురిటి నొప్పులు పడుతున్నది.ఓ పాము దానికి నీడ పడుతున్నది.బుసలు కొట్టే నాగు గొడుగు పట్టడం ఏమిటి? దానికింద మండూకం భయపడక సేద తీరడం ఏమిటి?ఆదిశంకరులకే ఆశ్చర్యం!తపోనిధి సంపన్నుడు రుష్యశృంగుడు తిరుగాడిన ప్రాంతమని అర్థమైంది.ఆయన తపోదీక్ష నుంచి వెలువడిన శాంతి తరంగాలు యుగాలు దాటినా ఆ కొండలను ప్రశాంతంగా ఉంచుతున్నాయని అవగతమైంది.ఆ క్షణమే! శృంగగిరిపై దక్షిణామ్నాయ శారదా పీఠాన్ని స్థాపించారు ఆదిశంకరులు.దేశం నాలుగు దిశలా ఉన్న పీఠాలకు గురుపీఠంగా నిర్ణయించారు.

అప్పటి ఆదిశంకరులు.. ఇప్పటి భారతీతీర్థులు!
శృంగేరి పీఠం శోభ దేదీప్యమానంగా వెలుగొందుతూనే ఉంది. ఆనాడు బ్రహ్మాంశ సంభూతులైన సురేశ్వరాచార్యులు మొదలు ఈనాటి అపర శంకరాచార్యులుగా శోభిల్లుతున్న భారతీతీర్థ స్వామి వరకు వారందరి తపోనిష్ఠ అసమానం. వారి కార్యదీక్ష అనితరసాధ్యం. అందుకే, జగద్గురువులయ్యారు. జగత్తుకు సరైన మార్గాన్ని నిర్దేశిస్తున్నారు.

గురువును వెతుక్కోవడం శిష్యుని అదృష్టం అయితే, శిష్యుడిని కనుక్కోవడం గురువు బాధ్యత. అభినవ విద్యాతీర్థ మహాస్వామికి తన శిష్యుడి ప్రతిభ గురించి ఏనాడో తెలుసు. సంస్కృతంలో అనర్గళంగా మాట్లాడే తనని చూసి ముచ్చటపడేవారు. అప్పుడు ఆ శిష్యుడి వయసు పదేండ్లు. పేరు సీతారామాంజనేయులు. ఆర్ధనిమీలిత నేత్రాలతో ఆ కుర్రవాడ్ని ఆశీర్వదించారు విద్యాతీర్థులు. ఐదేండ్లకు మళ్లీ మహాస్వామి దర్శనం లభించింది ఆ యువకుడికి. ఇద్దరి సంభాషణంతా సంస్కృతంలోనే సాగింది. స్వామిలో శిష్య వాత్సల్యం కలిగింది. శిష్యుడిలో గురువుపై అచంచలమైన విశ్వాసం ఏర్పడింది. ఎంతలా అంటే ఉజ్జయినిలో స్వామి చాతుర్మాస దీక్ష చేస్తున్నారని తెలిసి ఎవరికీ చెప్పకుండా అక్కడికి వెళ్లిపోయారు సీతారామాంజనేయులు. గురువు అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందగలిగారు. స్వయంగా విద్యాతీర్థులే శిష్యుడికి పాఠాలు చెప్పారు. తత్వాలు నేర్పించారు. శాస్ర్తాలు అధ్యయనం చేయించారు. భాష్యాలు బోధించారు. అలా తన తర్వాత తన స్థానాన్ని అలంకరించే శక్తిగా శిష్యుడిని తీర్చిదిద్దారు అభినవ విద్యాతీర్థులు.లౌకిక చింతల చెరనుంచి తన శిష్యునికి విముక్తి కల్పించే సమయం ఆసన్నమైంది.

సీతారామాంజనేయులు తల్లిదండ్రులను పిలిపించి ‘మీ బిడ్డడు ఇక శారదాంబ ముద్దుబిడ్డడు’ అన్నారు. సీతారామాంజనేయుల అవతార లక్ష్యానికి నాంది పలికారు. 1974 నవంబర్‌ 11 శృంగగిరి కోలాహలంగా ఉంది. సీతారామాంజనేయులు శారదా పీఠానికి ఉత్తరాధికారిగా, శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ స్వామిగా యోగపట్టాన్ని అందుకున్నారు. నాటి నుంచి జగద్గురువులైన అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి సన్నిధిలో ఆధ్యాత్మిక సాధన చేస్తూ తపోదీక్షలో తరించారు. గురువులు నిర్దేశించిన మార్గాన్ని తు.చ. తప్పకుండా అనుసరిస్తూ వారి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులయ్యారు. అభినవ విద్యాతీర్థ మహాస్వామి సమాధి పొందిన తర్వాత శ్రీ శుక్ల నామ సంవత్సరం ఆశ్వీయుజ కృష్ణ పంచమి (1989 అక్టోబర్‌ 18) నాడు శృంగేరి పీఠానికి 36వ పీఠాధిపతిగా, మహాస్వామిగా, జగద్గురువులుగా అనుపమాన గురు పరంపరలో భాగమయ్యారు.మహాస్వామి చూపులు కరుణ కురిపిస్తాయి. పలుకు.. మంద్రంగా వీచే మలయమారుతాన్ని మరిపిస్తుంది.వ్యయప్రయాసలకోర్చి తన చెంతకు వచ్చే భక్తులకు ‘ధర్మాన్ని ఆచరించమ’ని బోధిస్తారు మహాస్వామి. నలుగురికీ సాయం చేయమని ఆదేశిస్తారు. పదుగురు మెచ్చేలా నడుచుకోవాలని హితవు పలుకుతారు.
ధర్మో రక్షతి రక్షితః

శృంగేరిలో నిర్వహిస్తున్న సప్తతి పూర్తి మహోత్సవం
జగద్గురువులకు జరుగుతున్నది కాదు! స్వామి సంతృప్తి కోసం చేస్తున్న క్రతువు కాదిది. మహాస్వామి అవతార ఘడియలను తలచుకొని భక్తులు పునీతులు కావడానికి నిర్వహిస్తున్న మహత్తర ఘట్టం ఇది. సన్యాసాశ్రమంలో ఉన్నవారి పుట్టిన రోజును వర్ధంతిగా భావిస్తారు. కానీ, వారి అవతార శుభఘడియలను అనుభూతి చెందే సర్వోత్కృష్టమైన సమయమిది. ఈ శుభముహూర్తంలో శ్రీచరణుల అనుగ్రహం మనందరిపైనా ఉంటుంది. వారి తపోశక్తి ధర్మాచరణకు పురిగొల్పుతుంది. ఈ భారతావనికి రక్షగా నిలిచి ఉంటుంది.

బహుభాషా కోవిదులు
వేదవేదాంగాలు అధ్యయనం చేసిన మహాస్వామి విభిన్న భాషల్లో కోవిదులు. సంస్కృతం, తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, ఆంగ్లం తదితర భాషల్లో అనర్గళంగా ప్రసంగిస్తారు. ఏ ప్రాంత భక్తులను అదే భాషలో పలుకరిస్తుంటారు. వారు ఏ భాషలో ప్రసంగించినా భావం అందరికీ అర్థమవుతుందని భక్తులు చెబుతుంటారు. ఆశువుగా కవిత్వం చెప్పడంలో స్వామివారు దిట్ట. వారి గళంలో నుంచి వచ్చే శ్లోకాల్లో పద విన్యాసాలు మహామహా పండితులకు సైతం విస్మయం కలిగిస్తాయంటే అతిశయోక్తి కాదు. శ్రీచరణులు రచించిన ‘గరుడ గమన తవ చరణకమల విహ మనసిల సతు మమనిత్యం’ శ్లోకాలు సామాజిక మాధ్యమాల్లోనూ మార్మోగుతుండటం గమనించొచ్చు.

శారదా పీఠం భారతీ తీర్థం

మానవ సేవే మాధవ సేవ
శృంగేరికి వచ్చే వేలాది భక్తులకు నిత్యాన్నదానం నిరాటంకంగా కొనసాగుతుంది. శృంగేరిలో మాత్రమే కాదు, చుట్టుపక్కల గ్రామాల్లోని విద్యాలయాలకూ మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. పీఠం తరఫున వృద్ధులైన వేదపండితులకు పింఛను అందిస్తున్నారు. శారదా ధన్వంతరి వైద్యశాలను స్థాపించి పేదలకు వైద్యసాయం అందిస్తున్నారు. దివ్యాంగులకు రిక్షాలు సమకూర్చి అండగా నిలిచారు. మహిళలకు కుట్టుమిషన్లు ఇప్పించి ఆర్థికంగా చేయూతనిస్తున్నారు. అవసరార్థులకు అండగా నిలుస్తూ ‘మానవ సేవే మాధవ సేవ’ అన్న సత్యాన్ని లోకానికి చాటుతున్నారు శ్రీచరణులు.

బాలమేధావి
స్వామివారి పూర్వాశ్రమంలో.. తండ్రి తంగిరాల వెంకటేశ్వరశర్మ, తల్లి అనంత లక్ష్మమ్మ. ఊరు గుంటూరు జిల్లాలో అలుగుమల్లెపాటు అనే చిన్న గ్రామం. తర్వాత ఆ కుటుంబం నరసరావుపేటలో స్థిరపడింది. నలుగురు ఆడపిల్లల తర్వాత పుత్రుడ్ని కోరి ఆ తల్లిదండ్రులు సీతారాములు, ఆంజనేయస్వామిని ఆరాధించారట. వారి వరప్రసాదంగా శ్రీ ఖర నామ సంవత్సరం చైత్ర శుద్ధ పంచమి (షష్ఠి ఘడియల్లో) నాడు జన్మించిన కొడుకుకు సీతారామాంజనేయులు అని పేరు పెట్టారు. చిన్నప్పుడు ఆయన తెలివితేటలు, గ్రహణ శక్తిని చూసి తల్లిదండ్రులు, ఇరుగుపొరుగు ఆశ్చర్యపోయేవారట. తొమ్మిదేండ్ల వయసులోనే ఆయన సంస్కృతంలో కనబరిచిన అద్భుత ప్రతిభను కవిసమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ మెచ్చుకున్నారట. సంస్కృతంలో మాట్లాడుతూ పండితులను మెప్పించిన స్వామి చిరుప్రాయంలోనే ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఓ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం.

ఆధ్యాత్మిక అంతరంగం
పీఠాధిపతులుగా ఉండటం అంటే తపస్సులో నిమగ్నమై ఉంటే సరిపోదు. ధార్మిక కార్యక్రమాల నిర్వహణ నిరంతరం కొనసాగేలా చూడాలి. దూరదృష్టితో నిర్ణయాలు తీసుకోవాలి. పీఠానికి అనుబంధంగా ఉన్న వేద విద్యాలయాలు, ఆలయాలు, ఇతర వ్యవస్థలు సమర్థవంతంగా నడిచేలా ప్రణాళికలు రూపొందించాలి. చూసేవారికి ఇవన్నీ లౌకిక కార్యాల్లా కనిపిస్తాయి. కానీ, వారి అంతరంగంలో ఆధ్యాత్మిక తరంగాలు నిరంతరం ప్రసరిస్తూనే ఉంటాయి. హృదయాంతరాలల్లో తాత్విక చింతన, వైరాగ్య భావన తొణికిసలాడుతూనే ఉంటుంది.

గురు వాత్సల్యం
భారతీతీర్థ మహాస్వామి ఓ గొప్ప గురువుకు శిష్యులు మాత్రమే కాదు. ఓ మంచి శిష్యుడికి గురువు కూడా! పూర్వాశ్రమంలో వేద విద్యలో అపార ప్రతిభ కనబరిచిన కుప్పా వేంకటేశ్వర వరప్రసాద శర్మను పీఠానికి ఉత్తరాధికారిగా నియమించి శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ అనే యోగపట్టాను అనుగ్రహించారు జగద్గురువులు. యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించిన సనాతన కుటుంబంలో జన్మించిన విధుశేఖరులకు జగద్గురువులే స్వయంగా వేదాంత, తర్క శాస్ర్తాలను నేర్పారు. విధుశేఖరులకు కూడా జగద్గురువుల మాటంటే వేదం. ఆయన సేవలో తరిస్తూ, ఉత్తరాధికారిగా ధర్మ ప్రచారం చేస్తూ గురువుకు తగ్గ శిష్యుడనిపించుకుంటున్నారు.

శారదా పీఠం భారతీ తీర్థం

ధర్మ పరిరక్షణ యజ్ఞం
సమసమాజ స్థాపన, ధర్మ పరిరక్షణ కోసం శ్రీచరణుల పర్యవేక్షణలో అనేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. శృంగేరి శారదా పీఠంలో పూర్తిస్థాయి వేదపాఠశాల ఉన్నది. నాలుగు వేదాలు, సమస్త శాస్ర్తాలు బోధిస్తారు. దేశవ్యాప్తంగా పీఠానికి అనుబంధంగా శతాధిక వేదపాఠశాలలు ఉన్నాయి. వేద, పురాణ వాఙ్మయాన్ని పరిరక్షించే లక్ష్యంతో శృంగేరిలో అద్వైత కేంద్రాన్ని స్థాపించడంతోపాటు ప్రచురణ కేంద్రాన్నీ ఏర్పాటు చేశారు. ఈ ప్రచురణ కేంద్రం ద్వారా అరుదైన శాస్త్ర గ్రంథాలు భావితరాలకు అందుబాటులోకి వస్తున్నాయి. లోక సంక్షేమం కోసం యజ్ఞయాగాది క్రతువులు నిరంతరం కొనసాగుతుంటాయి. వీటన్నిటినీ జగద్గురువుల సంకల్పమాత్రం చేత నిర్వాహకులు చక్కబెడుతుంటారు.

శారదా పీఠం భారతీ తీర్థం

బాధ్యత తల్లిదండ్రులదే
సమాజ నిర్మాణంలో తల్లిదండ్రులదే కీలక బాధ్యత. పిల్లలకు బాల్యం నుంచి మన సంస్కృతి విలువలు, ధర్మం మహత్వాన్ని వివరించాలి. చిన్నతనంలో నైతిక విలువలు నేర్పకుంటే, పెద్దయ్యాక వాళ్లు పెడదోవ పడితే పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకూడదంటే తల్లిదండ్రులు పిల్లలను ధర్మమార్గంలో నడిపించాలి.

మార్గం ప్రధానం
ధర్మం, సంపాదన, మేధోపథం ఇవన్నీ విరుద్ధ మార్గాలనుకోవద్దు. అన్నీ ఒక్కటే! న్యాయమార్గంలో నడవడమే ప్రధానం. సంపాదన కోసం ధర్మాన్ని తప్పాల్సిన అవసరం లేదు. ఏ పని చేసినా న్యాయమార్గాన్ని విడిచి పెట్టకూడదు. అప్పుడే మానసిక తృప్తి కలుగుతుంది.
అది నిశ్చలానందానికి కారణం అవుతుంది.

-డా॥ పార్నంది రామకృష్ణ

Advertisement
శారదా పీఠం భారతీ తీర్థం
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement