సింగపూర్‌లోని శాస్త్రవేత్తలు శబ్ద నివారణ పరికరాన్ని సృష్టించారు. ఇళ్ల కిటికీలు తీసి ఉంచినా బయటి శబ్దాలు లోనికి రాకుండా ఇది చక్కగా అడ్డుకుంటుందని వారంటున్నారు.

ప్రత్యేకించి నగరాలలో వాయుకాలుష్యంతోపాటు శబ్ద కాలుష్యమూ మితిమీరిపోతున్న ఈ తరుణంలో శాస్త్రవేత్తలు దీనికి ఒక పరిష్కారం కనుగొన్నారు. అదే శబ్ద నివారణ పరికరం (వాయిస్ క్యాన్సెలింగ్ డివైజ్). సింగపూర్‌కు చెందిన నాన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ (ఎన్‌టియు) పరిశోధకులు అభివృద్ధి పరిచిన ఈ పరికరం బయటి శబ్దాలను మనింట్లోకి రానీయదు. దీనివల్ల యాభై శాతం వరకు శబ్ద కాలుష్యం మన చెవిన పడే అవకాశం ఉండదని వారు భరోసా ఇస్తున్నారు. యాక్టివ్ నాయిస్ టెక్నాలజీ ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఈ రకమైన సాంకేతికతను ఇప్పటికే హెడ్‌ఫోన్స్‌కు ఉపయోగిస్తున్నాం కూడా అని పై పరిశోధకులు పేర్కొన్నారు. ఐతే, చిన్న హెడ్‌ఫోన్స్‌తో పోల్చినప్పుడు విశాలమైన గృహ వాతావరణానికి కావలసిన ఎక్కువ మేర ప్రాంతీయ శబ్ద నివారణ సాధ్యమయ్యేలా ఈ పరికరాన్ని రూపొందించారు.

ప్రస్తుతం దీని నమూనా (ప్రొటోటైప్)ను సిద్ధం చేశారు. చిన్న పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్‌కు ఉపయోగించే ఎనిమిది వాట్స్ పవర్ విద్యుత్‌నే దీనికి కూడా ఉపయోగించారు. పలు జెట్ ఇంజిన్లు, రైళ్ల శబ్దాల నేపథ్యంలో పై యూనివర్సిటీ లాబ్‌లోని ఒక సౌండ్‌ప్రూఫ్ చాంబర్లో దీని తాలూకు ప్రయోగాలను వారు విజయవంతంగా జరిపారు.