వ్యర్థాలతో జీవితాలను వికసింపజేస్తున్నది!


Mon,March 4, 2019 01:42 AM

ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎదురు చూడలేదు. ప్రభుత్వమే ముందుకు రావాలి, సమస్యను పరిష్కరించాలనుకోలేదు. సమాజంలో తన వంతుగా ఏదైనా చేయాలనుకుని ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చింది. 30మంది మహిళలతో కలిసి వ్యర్థాలను సేకరించి పర్యావరణ హితమైన ఉత్పత్తులు తయారు చేయడమేకాకుండా ఎంతోమందికి జీవనోపాధి కల్పిస్తూ వారి జీవితాలను వికసింపజేస్తున్నది.
ghazipur-delhi
ఢిల్లీలోని ఘాజీపూర్ అనే మురికివాడకు దగ్గరలోని మాంసం విక్రయ కేంద్రాలు, పూల మార్కెట్ల కారణంగా రోజుకు టన్నుల కొద్దీ వ్యర్థాలు వేస్తుంటారు. ఆయా ప్రాంతంలో వేస్తున్న 7వేల కిలోల కాగితాలు, 15 టన్నుల వాడిపోయిన పూలను అక్కడే వదిలేస్తుంటారు. అటువంటి వ్యర్థాలను సేకరించి రసాయనాలు ఉపయోగించకుండా రంగులు, పలురకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. భూభాగంలో మూడోవంతు మురికినీరు, చెత్తా చెదారంతో నిండి పోవడం వల్ల పర్యావరణానికి ఎంతో హాని కలుగుతున్నది. ప్రతి రోజు 2,500టన్నుల వ్యర్థాలతో అక్కడి ప్రాంతమంతా నిండి పోతున్నది. దానిని తొలగించడంతోపాటు పదిమంది జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తున్నది ఓ ఎన్జీఓ సంస్థ. అందులో భాగంగానే గుల్మెహర్ గ్రీన్ ప్రొడ్యూసర్ కంపెనీ పేరుతో సంస్థను స్థాపించి వ్యర్థాలతో అందమైన కళాఖండాలను తయారుచేయిస్తున్నది. కాగితాలతో డైరీలు, క్యాలెండర్లు, ఫోటోఫ్రేమ్‌లు, ఎండిన ఆకులు పువ్వులతో అలంకరణ ఉత్పత్తులను రూపొందిస్తున్నారు. ఈ కంపెనీలో చేరక ముందు 30ఏండ్ల సల్మా తన ఇల్లు గడవడానికి ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చేది. గుల్మెహర్ గ్రీన్ ప్రొడ్యూసర్ కంపెనీలో చేరిన తర్వాత తన ఇంటి ఖర్చులకు, తన కూతుర్ని చదివించేందుకు సరిపడా ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతున్నానని ఆమె చెబుతున్నది. గుల్మెహర్ వివిధ కళాత్మకమైన ఉత్పత్తులను రూపొందించేందుకు ప్రముఖ డిజైనర్లతో 30మంది మహిళలకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చింది. అలా పనిలో నైపుణ్యతను సంపాదించిన వారందరూ ప్రస్తుతం నెలకు రూ.10వేలు ఆర్జిస్తున్నారు. ఎండిన పూలు, ఆకులతో హోలీ సమయంలో వినియోగించే రంగులను సహజసిద్ధంగా రూపొందిస్తున్నారు. తమ సృజనాత్మకతతో గ్రీటింగ్ కార్డులు, ఫొటో ప్రేములను ఆకట్టుకునే విధంగా తయారు చేస్తున్నారు. వ్యర్థాలతో పర్యావరణానికి హాని కలిగించకుండా చూడడమేకాకుండా, ఎంతో మంది జీవితాలను వికసింపజేస్తున్నది గుల్మెహర్. వారు రూపొందించిన ఉత్పత్తులను ఆన్‌లైన్ ద్వారా విక్రయిస్తూ తన వంతు సాయాన్ని అందిస్తున్నది ఆ సంస్థ.

869
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles