వెయ్యి స్తంభాల నుంచి.. మెట్రో స్తంభాల వరకు


Thu,March 7, 2019 12:15 AM

రెండు నెలల ముందే ప్లానింగ్.. లెక్కలేనన్ని గంటల ప్రాక్టీస్.. ఓవైపు సూర్యుడి భగభగలు.. 140 కిలోమీటర్ల దూరం.. ఒక లక్ష్యం.. ఆరుగురు మహిళలు.. వరంగల్ వెయ్యి స్తంభాల గుడి నుంచి.. హైదరాబాద్ మెట్రో స్తంభాల వరకు పరుగెత్తారు. ఆ పరుగు వెనుక ఉన్న అసలు ముచ్చట మీకోసం..
girls
ఎండాకాలం ఇప్పుడిప్పుడే మొదలయింది. కానీ.. ఎండలు మాత్రం మే నెలను తలపిస్తున్నాయి. అంతటి ఎండల్లో ఫిట్‌నెస్, రొమ్ము క్యాన్సర్ పట్ల అవగాహన కల్పిస్తూ 140 కిలోమీటర్లు పరుగులు తీశారు. మార్చి 1న మొదలైన వీరి పరుగు మార్చి 3న హైదరాబాద్‌లోని నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ముగిసింది. ఈరోజుల్లో మహిళలు రోజువారీ జీవితంలో పడి ఫిట్‌నెస్‌కి అంత ప్రాముఖ్యం ఇవ్వటం లేదు. ఫలితంగా చిన్న వయసులోనే రోగాల బారిన పడుతున్నారు. దేవయాని హల్దార్, వైశాలి మన్నె, పూనమ్ మెహతా, లీనా రాయ్, సరితా నర్మెట, రజిత మైనంపల్లి అనే ఆరుగురు మహిళలు ఈ అవగాహన పరుగు ప్రారంభించారు. ఏకధాటిగా 140 కిలోమీటర్లు మండుటెండల్లో పరుగులు తీయడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అందుకే వీరంతా రెండు నెలల ముందే కఠోర సాధన చేశారు. హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ సభ్యురాలైన దేవయాని హల్దార్ వీరికి శిక్షణనిచ్చింది. ఈమె గతంలో అనేక రన్నింగ్ ఈవెంట్లలో పాల్గొన్నది. ఈమెతో పాటు వైశాలి మన్నె, పూనమ్ మెహతా కూడా గతంలో రన్నింగ్ మారథాన్‌లలో పాల్గొన్నారు. రెండేండ్ల క్రితం నిర్వహించిన 10కే రన్ పింకథన్ క్యాన్సర్ అవగాహన ఈవెంట్‌కి లీనారాయ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నది. 58 సంవత్సరాల వయసులో కూడా ఈ పరుగు మాకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. మహిళలందరికీ అవగాహన కల్పించేందుకు చేసిన ఈ పరుగులో నేను అస్సలు అలసిపోలేదు అంటున్నది లీనారాయ్.
WhatsApp
వడదెబ్బ కొట్టకుండా, శరీరం డీహైడ్రేషన్‌కి గురికాకుండా అవసరమైన చోట ఆగి చెరుకు రసం, మంచినీళ్లు తాగారు. తక్కువ మోతాదులో ఆహారం తీసుకుంటూ, అందులో ఎక్కువ మోతాదులో మినరల్స్ ఉండేలా చూసుకున్నారు. మార్చి 1న ఉదయం 5:30 గంటలకు వెయ్యి స్తంభాల గుడి దగ్గర మిలింద్ సోమన్ జెండా ఊపి ప్రారంభించిన ఈ పరుగు కిలోమీటర్లు పెరుగుతున్న కొద్దీ చైతన్యాన్ని పెంచిందంటున్నారు వారు. మొదటి రోజు 55 కిలోమీటర్లు, రెండోరోజు 48 కిలోమీటర్లు, చివరిరోజు నాగోల్ స్టేషన్‌కి చేరుకున్నారు. రొమ్ము క్యాన్సర్ పట్ల అవగాహన కల్పిస్తూ కొనసాగిన ఈ పరుగును పింకథన్ టీమ్, ఫిజియోథెరపిస్ట్ గైడ్ చేశారు. ప్రతీ పది కిలోమీటర్లకు ఆరుగురు మహిళలను ఆపి వారి ఆరోగ్య పరిస్థితులను చెక్ చేశారు. వారిలో నిత్యం చైతన్యాన్ని నింపుతూ పరుగు పూర్తయ్యేలా ప్రోత్సహించారు. హైదరాబాద్ చేరుకునే మార్గంలో రోడ్డు మీద ఉన్న గ్రామాల ప్రజలు వీరిని ఆపి మరీ ఎందుకు ఈ పరుగు అని అడిగి తెలుసుకున్నారు. కొన్ని గ్రామాల్లో వీరే స్వయంగా చెప్తూ ముందుకు సాగారు.

1148
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles