వెంట్రుకలు.. ఎందుకిలా?


Thu,June 15, 2017 01:12 AM

నా వయసు 19 సంవత్సరాలు. గత కొంత కాలంగా నాకు ముఖంపై మొటిమలు ఎక్కువగా వస్తున్నాయి. అంతేకాదు చెంపల మీద కూడా వెంట్రుకలు వస్తున్నాయి. ముఖం జిడ్డుగా ఉంటున్న భావన కలుగుతున్నది. ఈ మధ్య బరువు కూడా చాలా పెరిగిపోయాను. మెడదగ్గర చర్మం మందంగా నల్లగా అవుతుంది. ఈ సమస్యలతో నాకు నలుగురిలోకి వెళ్లెందుకు చాలా ఇబ్బందిగా అనిపిస్తున్నది. దయచేసి నా సమస్యలకు సరైన పరిష్కారం చూపించగలరు?
- పవిత్ర, ఖమ్మం

girl-sad
మీరు కేవలం ముఖం మీద కనిపిస్తున్న సమస్యల గురించి మాత్రమే ప్రస్తావించారు. మీ నెలసరులు ఎలా ఉన్నది తెలియజేయలేదు. మీ సమస్యలన్నీ పరిశీలించిన తర్వాత మీకు పీసీఓడీ అనే హార్మోన్ సమస్య ఉందని అనిపిస్తున్నది. ఈ సమస్య యుక్తవయసు గల వారిలో ఎక్కువగా కనిపించే సమస్య. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని అర్థం. అంటే అండాశయంలో చిన్నచిన్న నీటి బుడగల వంటివి ఏర్పడుతాయి. అందువల్ల హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడుతుంది. ఫలితంగా మీరు చెప్పిన సమస్యలతో పాటు నెలసరులు కూడా క్రమం తప్పుతాయి. ఇలా జరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రస్తుత ఒత్తిడి కలిగిన జీవనశైలి కూడా అందుకు ఒక కారణం కావచ్చు. ఈ సమస్య వంశపారంపర్యంగా కూడా రావచ్చు. రక్త సంబంధీకుల్లో ఎవరైనా అధిక బరువు, షుగర్ వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఈ సమస్య మీకు రావచ్చు.

ఈ సమస్యను నిర్ధారించడానికి టెస్టోస్టీరాన్ హార్మోన్ పరీక్ష, పెల్విక్ అల్ట్రాసౌండ్ పరీక్షలతో పాటు బ్లడ్‌షుగర్, థైరాయిడ్ స్థాయిలను కూడా నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ఈ సమస్య పరిష్కారానికి కేవలం మందులు వాడితే సరిపోదు. జీవన శైలిలో మార్పులు కూడా తప్పనిసరి. క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యడం, సమతుల ఆహారం తీసుకోవడం, వీలైనంత వరకు కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండడం, తాజా పండ్లు, కూరగాయలు తప్పనిసరిగా ఆహారంలో భాగం చేసుకోవడం, శరీర బరువు అదుపులో ఉంచుకోవడం వంటివన్నీ తప్పనిసరిగా పాటించాలి. ఇప్పటికే వచ్చిన అవాంఛిత రోమాల సమస్య పరిష్కారానికి చర్మ వైద్యులను సంప్రదించి వారి సలహా మేరకు లేజర్ చికిత్స ద్వారా వాటిని తొలగించుకోవాల్సి ఉంటుంది. వీటన్నింటికంటే ముందు మానసిక ఒత్తిడిని తగ్గించుకొని ఉల్లాసంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఈ చర్యలన్నీ తీసుకుంటే మీ సమస్యకు పరిష్కారం దొరికినట్టే భావించవచ్చు.

461
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles