వీళ్లు పోస్టు పెడితే.. లైకులే.. లైకులు


Tue,January 1, 2019 10:55 PM

-పలు రకాల సోషల్‌మీడియా వేదికలు..
-వేలమంది అభిమానులు..
-లక్షల రూపాయల విలువ చేసే బ్రాండ్లకు ఒప్పందాలు..
-ఇవన్నీ ఎవరో సెల్రబిటీలు చేస్తున్నవి కాదు..
-సాధారణ స్థాయి నుంచి ఎదిగిన అసామాన్యులు..
ఇన్‌స్టగ్రామ్, స్నాప్‌చాట్, యూట్యూబ్, టిక్‌టాక్, ఫేస్‌బుక్, షేర్‌చాట్ వంటి సామాజిక మాధ్యమ వేదికల ద్వారా తమ ప్రతిభను చాటుకొని ప్రభావశీలురుగా అవతారం ఎత్తారు. ఫ్యాషన్ నుంచి మొదలు ఫిట్‌నెస్, అందం, ట్రావెల్ ఇలా అన్ని రంగాల బ్రాండ్లకు బ్రాండింగ్ చేసే ఎత్తుకు ఎదిగారు. వాళ్ల వయసుకు వాళ్లకున్న అభిమానుల సంఖ్యకు సంబంధం లేదు. వాళ్లు చేస్తున్న పనులకు వాళ్లు ప్రభావం చూపుతున్న అంశాలకు అనుబంధం అంతకన్నా ఉండదు. చదువుకుంటూ పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన సమయంలో సోషల్‌మీడియాలో వీడియోలు, ఫొటోలు పెట్టి సెలబ్రిటీలయ్యారు. పోస్టు పెడితే చాలు మస్త్ లైకులు సంపాదించే స్థాయికి వచ్చారు. భారతదేశంలోని సోషల్ మీడియాలో అత్యంత ప్రభావశీలురైన పలువురు యువతీ యువకుల పరిచయమే ఈ వారం ప్రత్యేక కథనం..
Somya-gupha
సౌమ్య గుప్త పంతొమ్మిదేళ్లకే ఇన్‌స్టగ్రామ్ స్టార్ అయింది. ఆమె సోషల్‌మీడియాలో అడుగుపెట్టినప్పుడు ఆమె స్నేహితులు, చుట్టాలు మాత్రమే ఉన్నారు. ఫ్యాషన్ రంగంలో ప్రేరణ కలిగించే విధంగా తన అభిరుచులను, ప్రతిభను జోడించి చిత్రాలను తీసి వారానికి ఒకటి, ఏదైనా ప్రత్యేక పండుగలకు ఫొటోలు పోస్ట్ చేసేది. ఆమె పోస్టులు నచ్చి లక్షలమంది ఫాలోవర్స్ అయ్యారు. ఆమెను సెలబ్‌ని చేశారు. ఇటీవల 21వ పుట్టిన రోజు జరుపుకొన్న సౌమ్య పలు అంతర్జాతీయ బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉన్నది. కెల్విన్ క్లెవిన్, లారాయెల్, లాక్మే, వన్‌ప్లస్ వంటి 50 సంస్థలకు ప్రచారం చేస్తున్నది. కంప్యూటర్ సైన్స్ చదువుతున్న ఈమె నెలకు సుమారు రెండు లక్షలు సంపాదిస్తున్నది.ఉన్నత చదువులు అయ్యాక యూట్యూబ్ చానల్ పెట్టాలనుకుంటున్నది. దుస్తుల వ్యాపారాన్ని ప్రారంభించి ఫ్యాషన్ రంగంలో రాణించాలనుకుంటున్నది.


rajvee-gandhi
మనం చేసే పనిలో కొత్తదనం ఉంటే ఆదరిస్తారు. ఆశీర్వదిస్తారు. రాజ్వీ కూడా అంతే. సరదాగా ప్రారంభించి అనుకోకుండానే పాపులారిటీ సంపాదించింది. ఇరవై యేండ్ల రాజ్వీ గాంధీ.. సెలబ్రిటీ కాదు. స్టార్ కూతురు అంతకన్నా కాదు. ముంబైకి చెందిన సాధారణ అమ్మాయి. కానీ ఇన్‌స్టగ్రామ్‌లో ఆరు లక్షల ఇరవై వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. టిక్‌టాక్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో వీడియో పెట్టగానే కొన్ని గంటల్లోనే లక్షల వ్యూస్ సాధించగలదు. పాపులారిటీ సంపాదించి సెలబ్రిటీ అవ్వడమే కాదు. ఏదైనా అంశంపై ప్రభావం చూపే స్థాయికి ఎదిగింది.


Yogita-guptha
పేరు సంపాదించడం చాలా కష్టం.. సంపాదించిన పేరును కాపాడుకోవడం మాత్రం అంతకన్నా కష్టం. ముంబైకి చెందిన యోగితా గుప్త కామర్స్ చదువుతున్నది. ఇన్‌స్టగ్రామ్‌లో 3.65 లక్షల ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నది. ఇతర ప్రభావశీలురతో పోల్చుకుంటే ఇప్పటివరకు 83 పోస్టులు మాత్రమే పెట్టింది. కానీ వేల లైకులు వచ్చాయి. భిన్నమైన ప్రదేశాలు తిరుగుతూ విభిన్నమైన చిత్రాలు తీసి పోస్ట్ చేస్తుంది. మూస ధోరణిలో కాకుండా కొత్తగా చిత్రాలను తీయడం మొదలుపెట్టింది.


Bhargav
సూరత్‌కు చెందిన భార్గవ్ ఖేనికి 75 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. పంతొమ్మిదేళ్లు ఉన్నప్పుడు చదువు మానేసాడు. పాపులారిటీ కోసం కాకుండా స్నేహితుల్లో ప్రత్యేకంగా ఉండాలని ప్రయత్నించాడు. తన చిత్రాలను ఫొటో ఎడిటింగ్ యాప్ ద్వారా ఆకట్టుకునే విధంగా ఎడిట్ చేయడం బాగా తెలుసు. పలు యాప్‌లలో చిత్రాలను ఎడిట్ చేసి పోస్ట్ చేయడంతో అందరినీ ఆకర్షించగలిగాడు. దీంతో లోకల్ సంస్థలు అతణ్ని సంప్రదించడం మొదలుపెట్టాయి. అప్పుడు ఉన్నత విద్యను ఆపేసి సోషల్‌మీడియా మీద దృష్టి సారించాడు. ఇప్పుడు ఒక్క ఫొటో ఎడిట్ చేస్తే సుమారు 500 రూపాయాలు తీసుకుంటాడు.


Piyush
ఢిల్లీకి చెందిన పదిహేడేళ్ల పియూష్ చౌదరి కూడా సోషల్‌మీడియా ఫేమ్ సంపాదించాడు. సృజనాత్మక పోస్టులు పెట్టి వేలమంది అభిమానులను సంపాదించాడు. ఇప్పుడు పియూష్ మార్కెటింగ్ చేయడానికి బ్రాండింగ్ చేయడానికి నెలకు మూడు వేల రూపాయలు తీసుకుంటాడు.


social-post

వీళ్లంతా తమ బ్రాండ్, ఫాలోవర్స్ కాపాడుకోవడానికి పోస్టులు పెట్టుకుంటారు. డబ్బు సంపాదించడానికి బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నారు. పాపులారిటీ తగ్గకుండా రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నారు. టీనేజీ స్టార్స్‌గా పేరుగాంచి నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంత చిన్న వయసులో ఇన్ని అద్భుతాలు చేసిన వీళ్ల నుంచి మనం మరిన్ని అత్యద్భుతాలను ఆశించడంలో తప్పు లేదు.

1048
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles