వీల్‌చెయిర్ నుంచిగోల్ కొట్టింది!


Sat,March 16, 2019 12:11 AM

అది 2017.. తమిళనాడులో వీల్‌చెయిర్ బాస్కెట్‌బాల్ పోటీలు జరుగుతున్నాయి. పోటీల్లో 29 రాష్ర్టాల జట్లు ఉన్నాయి. అప్పటి వరకు ఆమెను నువ్వేం చెయ్యగలవు. కాళ్లులేవు.. ఓ మూలన కూర్చోక ఇవ్వనీ అవసరమా? అన్నవారు ఉన్నారు. వారిప్పుడు టీవీలకు అతుక్కుపోయారు. కారణం వారు హేళన చేసిన టీం అద్భుతంగా ఆడుతున్నది. ప్రత్యర్థులకు బంతి దొరకకుండా.. గోల్స్ చేస్తున్నది. నీకు కాళ్లులేవు అన్నవారి చేతులే అసంకల్పితంగా చప్పట్లు మోగిస్తున్నాయి. నువ్వేం చెయ్యగలవ్.. అన్నవారి నోళ్లే నువ్వు ఏదైనా సాధించగలవ్ అన్నాయి.
Padma
వీల్‌చెయిర్ బాస్కెట్‌బాల్‌లో క్రీడాకారులను తయారు చేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలకు పంపుతున్నది హైదరాబాద్‌లోని బేగంపేటకు చెందిన పద్మ. దివ్యాంగురాలైనా కూడా.. ఐదు పదుల వయసులో తనలాంటి ఎంతోమందికి దిశా నిర్దేశం చేస్తున్నది. ఆత్మైస్థెర్యంతో ఎంతోమంది జీవితాల్లో చైతన్యం తీసుకొస్తున్నది. స్ఫూర్తిదాయకమైన జీవిత విశేషాలు.. ఆమె మాటల్లోనే.

ఒక్కదాన్నే బతకాలనుకోలేదు..

నా చిన్నప్పుడే పోలియో సోకింది. తల్లిదండ్రుల సాయంతోనే పెరిగా. వారి ప్రోత్సాహంతోనే చదువుకున్నా. ఎన్నో కష్టాలు అనుభవిస్తూనే ఎంకామ్ వరకూ చదివా. అపుడే నేనేంటో నాకు తెలిసింది. సొంతంగా వ్యాపారం చెయ్యాలని ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఇన్నాళ్లూ చదువు, పని ఇవే జీవితం అనుకున్నాను. అందుకే చదువకోగలినంత వరకూ చదివా. సొంతంగా పనులు చేసుకోవడం ప్రారంభించా.. అప్పుడే నాలాంటి వారి గురించి ఆలోచన వచ్చింది. వారి పరిస్థితి తలుచుకుంటే బాధేసింది. అలాంటి వారికి సాయం చేయాలనుకున్నా. అప్పటికి నేనింకా ఆర్థికంగా నిలదొక్కుకోలేదు. బాగా డబ్బు సంపాదించి వారికి చేతనైన సాయం చేయాలనుకున్న. అప్పటికి వీల్‌చెయిరే నా జీవితం. కుటుంబం, వ్యాపారమే నా ప్రపంచం. అయితే ఒక్కసారిగా అవన్నీ మారిపోయాయి.

నా కొత్త ప్రపంచం అదే..

2016లో ఇండియా బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ వారు హైదరాబాద్‌లో ఓ క్యాంపు ఏర్పాటు చేశారు. అది వీల్‌చెయిర్ బాస్కెట్‌బాల్ క్యాంప్. నాలో ఆలోచన మొదలైంది. కుర్చీకే పరిమితమైన నేను.. ఆడగలనా? అనుకున్నా. ధైర్యం చేస్తేనే కదా.. దమ్మేంటో తెలిసేది అని నాతో నేను మాట్లాడుకున్న. సంఘర్షణ మొదలైంది. ఎలాగైనా ఆట ఆడాలని నిర్ణయించుకున్నా. మిత్రురాలు స్వీటీ బగ్గాకు విషయం చెప్పా. తను కూడా దివ్యాంగురాలే. ఇద్దరం కలిసి వీల్‌చెయిర్ బాస్కెట్‌బాల్ ఆడాలని దృఢంగా నిశ్చయించుకున్నాం. క్యాంపునకు హాజరయ్యాం. అప్పుడే అర్థమైంది మేం కూడా స్పోర్ట్స్ ఆడవచ్చని. ఆ సమయంలోనే ఎన్నో అవమనాలను, హేళలను ఎదుర్కొన్నాం. అయినా వెనుకడుగు వెయ్యలేదు. ఎప్పుడూ పిల్లల్ని ఆటలాడించేందుకు తీసుకెళ్లడం, వాళ్లు ఆడుతుంటే చూడడం వరకే సరిపోయేది. కానీ, మొదటిసారి మేం కూడా బాగా ఆడగలమని అనిపించింది. ఆటలవల్ల మానసికంగా, శారీరకంగా ఎంతటి ధైర్యం వస్తుందో అర్థమైంది. అప్పుడే నిర్ణయించుకున్నాం. ఈ ఆటలో ఎలాగైనా రాణించి, మన రాష్ర్టానికి ఈ ఆటను పరిచయం చేయాలనుకున్నాం. నుంచి వీల్‌చెయిర్ బాస్కెట్‌బాల్ నా కొత్త ప్రపంచమైంది.

జీవితాలను మార్చిన నేషనల్స్..

మాకు 20 యేండ్ల కిందట ఈ ఆట పరిచయమై ఉంటే.. మా జీవితాలు మారిపోయేవి. అంతలా ఆటను ప్రేమించా. దీంతో ప్రత్యేకంగా చొరవ తీసుకున్నాం. రాష్ట్ర క్రీడాశాఖ అధికారులను కలిసి వీల్ చెయిర్లు అందించాలని విజ్ఞప్తి చేశాం. వారు 20 వీల్ చెయిర్లు అందించారు. వెంటనే మా వీల్‌చైర్ బాస్కెట్‌బాల్ టీంను ఏర్పాటు చేశాం. మొదట్లో నలుగురు అబ్బాయిలు ఉండేవారు. ఇప్పుడు 15 మంది వరకూ ఉన్నారు. వీళ్లందరికి శిక్షణ ఇచ్చి గేమ్ నేర్పిస్తున్నాం. ఇప్పటి వరకైతే బాయ్స్ టీం పూర్తిగా ఉంది. ఉమెన్స్ టీం కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. మొదటి సారి 2016లో జాతీయ వీల్‌చెయిర్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాం. హైదరాబాద్‌లో జరిగే ఆ పోటీల్లో ఆరోస్థానంలో నిలిచాం. అప్పటి వరకూ మాకు కోచ్ లేరు. సరైన స్టేడియం లేదు. సొంత ఖర్చులు, పరిజ్ఞానంతో ఆ స్థాయి వరకూ వెళ్లాం. 24 రాష్ర్టాలు పాల్గొన్న ఈ టోర్నీ ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. దీంతో పాటు యూఎస్ చెన్నయ్ కన్స్యూలేట్ ఆధ్వర్యంలో వీల్‌చెయిర్ బాస్కెట్‌బాల్ అథ్లెట్‌లకు ఇస్తున్న శిక్షణకు మా జట్టు నుంచి చంద్రశేఖర్, జాన్ ఎంపికయ్యారు.

2017లో నాలుగు స్థానం

2016లో జరిగిన టోర్నీలో మా ప్రతిభ చూసి కోచ్ గెవిల్ సోవియల్ ఖాన్ శిక్షణ ఇచ్చారు. దీంతో 2017లో రెండోసారి జాతీయ పోటీల్లో పాల్గొన్నాం. అప్పుడు 29 రాష్ట్రాల జట్లు పోటాపోటీగా తలపడ్డాయి. మేం నాలుగో స్థానంలో నిలిచాం. అది ఓటమి కాదు. మా విజయం. మొదటిసారి కన్నా రెండోసారి బలమైన పోటీని ఇవ్వగలిగాం. మొదటిసారి పోటీలో ప్రత్యర్థులను ఎదుర్కొని అనుభవంతో రెండోసారి పోటీల్లో ధీటుగా రాణించాం. ఆ నేషనల్ పోటీల్లో మా టీం ప్రతిభను చూసి ఇండియా వీల్‌చెయిర్ బాస్కెట్‌బాల్ టీంలోకి టీం నుంచి శంకర్ అనే ప్లేయర్‌ను ఎంపిక చేశారు. ఇలా తెలంగాణ నుంచి జాతీయ టీంలో చోటు సాధించగలిగాడు శంకర్. అతను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన లెబెనియన్ కప్ మ్యాచ్‌లో పాల్గొన్నాడు. మాకు అదో మైలురాయి. ఈ సారి నేషనల్స్‌కి ఇద్దరు, ముగ్గురు కచ్చితంగా వెళ్తారనే నమ్మకం ఉంది.

ముందుకు రావాలి...

నడవలేని వాళ్లు ఎంతో మంది నిరాశతో ఉండిపోతున్నారు. కానీ ధైర్యం చేస్తే విజయాలు సాధించచ్చు. అందుకు ఉదాహరణ మా ఈ బాస్కెట్ బాల్ టీం. ఎవరూ వాళ్ల కాళ్ల మీద వాళ్లు నడవలేరు. కానీ క్రీడాస్ఫూర్తి ఉంది. ప్రతిభ ఉంది. అలాంటి వాళ్లు ఎవరున్నా ముందుకు రావాలి. దివ్యాంగుల కోసం ఎన్నో క్రీడలు ఉన్నాయి. మానసికంగా, శారీకంగా ఎంతో ధైర్యాన్నిస్థాయి. నడవలేని వాళ్లు, కాళ్లు తీసేసిన వాళ్లు, వెన్నముక కూలబడిన వాళ్లు ఈ వీల్‌చెయిర్ బాస్కెట్‌బాల్ ఆడవచ్చు. కానీ శరీరంలోని చేతులు, పైభాగం బలంగా ఉండాలి. అలాంటి వారు ఎవరైనా దీన్ని ఆడవచ్చు.

పారా ఒలింపిక్స్‌కు ప్రయత్నం..


Padma1
మాకు ఎలాంటి సౌకర్యాలు, సదుపాయాలు లేకుండానే జాతీయ, అంతర్జాతీయ స్థాయి వరకూ వెళ్లాం. అదే మాకు మరింత ధైర్యాన్ని ఇచ్చింది. ఇంకా కష్టపడితే ఎలాగైనా విజయాలు సాధించవచ్చని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. ఇప్పటికీ మాకు సొంత స్టేడియం లేదు, సౌకర్యాలు లేవు. ఇప్పటి వరకూ అన్ని ఖర్చులూ సొంతంగానే భరిస్తున్నాం. టీంలో అందరూ పేదవారే. వీల్ చెయిర్లు, భోజనం, ప్రయాణం అంటూ రకరకాల ఖర్చులు సొంతంగానే సర్దుబాటు చేసుకుంటున్నాం. ఇప్పటి వరకూ బాయ్స్ టీంను తయారు చేశాం. నమ్మకం పెరిగింది. స్పాన్సర్లు ముందుకు వస్తే మరింత బలపడతాం. ఉమెన్స్ టీంను తయారు చేయాలనే సంకల్పంతో ఉన్నా. మున్ముందు జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో క్రీడాకారులను గుర్తించి పోటీలు నిర్వహించాలనుకుంటున్నాం. ఇప్పుడున్న టీంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడొచ్చనే నమ్మకం కుదిరింది.

...? వినోద్ మామిడాల
చిన్న యాదగిరిగౌడ్

634
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles