విశ్వాత్మ ప్రపంచం!


Thu,January 31, 2019 11:24 PM

నాలుగు వేదాలు, యుగాలు, ప్రకృతి ప్రాథమిక శక్తుల నడుమ అవినాభావ సంబంధం ఉందా?
దేవుడు లేడు అని మొండిగా వాదించే వాళ్లతో మనకు పనిలేదు. దేవుడు నిజంగా ఉంటే అందరికీ ఎందుకు కనిపించడు? అని ప్రశ్నించే వాళ్లు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్నుంటాయి. వాటిలో ప్రధానమైంది పూర్తిగా లౌకికాన్ని పోలిన అలౌకిక ప్రపంచం. ఆ విశేషాలే ఇక్కడ చదవండి.
vishwatma
లౌకిక ప్రపంచం కంటికి కనిపించేదే. అలౌకిక విషయాలే అర్థం కావు. ఎందుకంటే, అవి సాధారణ దృష్టికి ఆనవు కనుక. భౌతిక ప్రపంచమంటూ ఉన్నప్పుడు అభౌతిక ప్రపంచమూ తప్పకుండా ఉండాలి. ఎందుకంటే, కనిపించే పదార్థానికి ప్రత్యామ్నాయంగా కనిపించని ప్రతిపదార్థమూ (Antimatter) ఉందన్న నిర్ధారణకు శాస్త్రవేత్తలు వచ్చారు కాబట్టి. శరీర-అశరీర ప్రపంచాల నడుమ గల ఏకరూప విశేషాలను గురించి న్యూఢిల్లీకి చెందిన ఒక సీనియర్ వ్యవసాయ భౌతిక శాస్త్రవేత్త ఎ.వి.మొహరిర్ ఇటీవల వెల్లడించారు. ఆశ్చర్యకరమైన, ఆసక్తికరమైన, ఆలోచనాత్మకమైన ఈ విషయాలు సైన్స్, స్పిరిచువాలిటీ అండ్ గాడ్: యాన్ అటెంప్టెడ్ సింథసెస్ శీర్షికన యూనివర్సిటీ న్యూస్ పత్రిక (2018 అక్టోబర్ 1-7)లో ప్రచురించిన సుదీర్ఘవ్యాసంలో ఆయన ప్రస్తావించారు. అయితే, భౌతిక ప్రపంచం మాదిరిగానే అభౌతిక ప్రపంచమూ సృష్టిలోని ప్రాథమిక సూత్రాలకు కట్టుబడే ఉందని, మనం దీనినే అర్థం చేసుకోవలసి ఉందని ఆయన అంటారు.


మన దేశంలోని చాలామంది నాస్తికులకు, కమ్యునిస్టులకు ఆశ్చర్యం కలిగించే విషయమేమిటంటే, లౌకిక-అలౌకిక ప్రపంచాలను గురించి భారతీయ వైదిక తత్వశాస్త్రం చాలా విపులంగా ఏనాడో విశదీకరించిందని పై భౌతిక శాస్త్రవేత్త మొహరిర్ తన వ్యాసంలో పేర్కొనడం. ఇంతేకాదు, సుమారు 1500 కోట్ల సంవత్సరాల కిందట సృష్టితమైన ప్రాథమిక విశ్వ పదార్థమే ప్రస్తుత రూపాలు, స్థితిగతులకు వచ్చిందన్న సంగతి కూడా వేదాలు ఆనాడే వెల్లడించాయని ఆయన అన్నారు. వైదిక తత్వశాస్త్రం ప్రకారం రెండు రకాల ప్రాథమిక సూత్రాలున్నాయని, భౌతిక రసాయనాది సర్వశాస్ర్తాలతో కూడినవన్నీ ఒక వర్గం (భౌతిక)లోకి వస్తే, అభౌతిక ఆత్మగత ప్రపంచమంతా మరొక వర్గం కిందకు వస్తుందన్నది వారి సిద్ధాంతం. ఇందులో వాస్తవం ఎంత అన్న దానిని ఆయనే వివరించారు.


మనిషిలో లేదా జీవులన్నింటినూ విడివిడిగా వుండే చేతనాశక్తి (Consciousness) మనల్ని, సమస్త జీవజాతులనూ నడిపిస్తున్నదో అలాగే, ఇంకా అంతకంటే అత్యంత శక్తియుతంగా సర్వజగత్తునూ నియంత్రిస్తూ, నడిపించే విశ్వాత్మ (Universal Consciousness) కూడా ఒకటుందన్నది మొహరిర్ సూత్రీకరణ. డ్రైవర్ లేకుండా వాహనాలు ఎలాగైతే నడవవో ఆత్మ లేకుండా జీవులకు మనుగడ ఉండదన్నది ఏనాడో తేలిపోయింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ఆత్మ ఒక్క మనుషులకే పరిమితం కాకపోవడం. సూక్ష్మక్రిములతోసహా సర్వజీవులలోనూ చేతనాత్మక ఆత్మలు ఉంటాయని ఆధ్యాత్మికవేత్తలూ ఇదివరకే సూచించారు. కాకపోతే, భూమిమీది ఆత్మయిక జీవులన్నింటిలోకీ ఒక్క మనిషి శరీరానికి మాత్రమే తనదైన ఆత్మ స్వరూపాన్ని దర్శించే అద్భుత శక్తి ఉంటుందని కూడా వారన్నారు. దీనికి కారణం, అంతటి పరిశోధనాత్మకమైన, వివేకవంతమైన, శక్తివంతమైన మనసు మనిషికి మాత్రమే ఉంటుందన్నది మొహరిర్ అభిప్రాయం. ఇందులో వాస్తవం కొట్టొచ్చినట్టు దర్శనమిస్తుంది.


సృష్టి సృష్టితమైన సమయంలో ఉద్భవించిన ఆదిపదార్థ పరిణామ తీరుతెన్నులు ఎలాగైతే భారతీయ వేదాల్లో ఉన్నాయని మొహరిర్ చెబుతూ వచ్చారో అలాగే, పదార్థ ప్రపంచ ఆవిర్భావం, విధ్వంసంతో కూడిన ఆవర్తనా చక్రాలనూ మారే ఋతువులతో ఆయన పోల్చారు. అత్యంతాసక్తికరంగా నాలుగు యుగాలూ (సత్య, త్రేతా, ద్వాపర, కలి) అలానే కాలగమనంలో మారుతూనే ఉండేవనీ చెప్పారాయన. విజ్ఞానశాస్త్ర పరంగా ఈ నాలుగు కాలచక్రాలూ నిజమే అయితే శాస్త్రవేత్తలు గుర్తించిన విశ్వానికి చెందిన నాలుగు ప్రాథమిక శక్తుల్లో (Fundamental Forces) ఏదో ఒకటి మిగిలిన మూడింటికన్నా ప్రబలమైందో లేదా వాటిపై ప్రాబల్యం కలదైందో అయి ఉండాలన్నది ఆయన భావన. మొత్తం మీద ఈ రకంగా నాలుగు వేదాలు, నాలుగు యుగాలు, నాలుగు ప్రాథమిక శక్తుల నడుమగల అవినాభావ సంబంధం తనను ఆశ్చర్యపరుస్తున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు.


ఈ సందర్భంగా ఒక నక్షత్ర హృదయ (Core) పరిణామాలనే ఈ మహా కాలచక్ర సూత్రాలకు ఉదాహరణగానూ మొహరిర్ వివరించారు. మన సూర్యునికన్నా ఎన్నో రెట్లు పెద్దదైన లేదా చిన్నదైన నక్షత్ర అంతర్భాగంలోని ఇనుప మహాశక్తి (Iron ritch core) కుంచించుకుపోయి న్యూట్రాన్ స్టార్ (పరమాణు నక్షత్రం: అతితక్కువ వ్యాసార్ధం గల అత్యంత శక్తివంతమైన తార) గానో, లేదా భారీ విస్ఫోటనంతో సూపర్‌నోవా (నవ్యోజ్వల తార: అత్యధిక వ్యాసార్ధంతో కుప్పకూలిన నక్షత్రం) గానో మారడం భౌతిక పదార్థ పరిణామ క్రమాన్ని సూచిస్తున్నదే. ఈ రకమైన భౌతిక పరివర్తన అమీతుమీ తేలడానికి మరింత లోతైన పరిశోధనలు ఇంకా జరగవలసిందే. అయితే, భూమిపై జీవబీజ పుట్టుక, గిట్టుకలు కూడా సరిగ్గా ఇలాంటివేనన్నది ఆయన సూత్రీకరణ.


స్విస్ అమెరికన్ డాక్టర్, సైకియాట్రిస్ట్ ఎలిసబెత్ క్యూబ్లర్‌రాస్ (1926-2004) మానవుల మరణం, పునర్జన్మలకు చెందిన సమతుల ఆవర్తన దశలలోని స్థితిగతులను అత్యంత కచ్చితమైన శాస్త్రీయ ప్రయోగాల ద్వారా, ఎంతో దృఢంగా ప్రదర్శించిన విషయాన్ని కూడా మొహరిర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
-దోర్బల బాలశేఖరశర్మ


పరమాణువుల నుంచి సృష్టి స్థితి లయల వరకు!

మానవులతోపాటు జంతువులు, పక్షులు, వృక్షాలు, సూక్ష్మక్రిములతో కూడిన సకల ఏకకణ, బహుకణ జీవజాలాలన్నీ భూమిపైన కల్పితంగానో, అసంకల్పితంగానో లేదా ప్రణాళికతోనో, అప్రణాళికతోనో పుడుతూ, చనిపోతూ ఉండవలసిందే. భగవద్గీతలో శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పిందీ ఇదే కదా. అయితే, ఇవన్నీ ప్రధానమైన మూడు పదార్థ ప్రకృతి ధర్మాల (సత్త, తమో, రజో) ప్రభావంతోనే పనిచేస్తాయి. యావత్ ప్రకృతి సృష్టి స్థితి లయలకు అద్దం పట్టే మూడు భౌతిక ధర్మాల (స్థిరవిద్యుత్ ఫలితం: electrovalent), సమయోజనీయం: covalent), సమన్వయం: coordinate) తో పోల్చగల స్థితీ తనను ఆశ్చర్యానికి గురిచేసినట్టు శాస్త్రవేత్త మొహరిర్ తెలిపారు. ఇది వివిధ రకాల పదార్థ సమ్మేళనాల కోసం రసాయనిక మూలకాలకు చెందిన అసంఖ్యాక అణుపరమాణువుల మధ్య జరిగే మార్పులు, నిర్మాణాలు, వాటి గుణగణాలలో కనిపిస్తుందని ఆయనంటారు.


గమనిక: వివిధ ఆధ్యాత్మిక విశేషాలు, సముచిత శాస్ర్తోక్త విశ్లేషణలను మీరూ ఈ పేజీకి రాసి పంపవచ్చు. ప్రామాణికమైన, ప్రజోపయోగమైన అంశాలకే ప్రాధాన్యం. మా చిరునామ: ఎడిటర్, చింతన, నమస్తే తెలంగాణ, తెలుగు దినపత్రిక, బంజారాహిల్స్, రోడ్ నంబర్: 10, హైదరాబాద్-34.

422
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles