విధి ఓడించాలనుకుంది.. ప్రేమ గెలిపించింది!


Thu,February 14, 2019 01:01 AM

ప్రేమ నిజమైంది. అది ప్రేమను మాత్రమే ప్రేమిస్తుంది. ఎప్పటికీ శాశ్వతంగానే ఉంటుంది. అలాంటి ప్రేమ కోసం సముద్రాలను దాటిన వాళ్లను ప్రపంచం గుర్తిస్తుంది. ప్రపంచాన్నే జయించిన వాళ్లను చరిత్ర గుర్తుంచుకుంటుంది. ఈ ప్రేమసాగరంలో ఒక్కటై, ఒకరికొకరై జీవితాన్ని పంచుకుంటున్న ఓ జంట గురించి వాలెంటైన్స్ డే సందర్భంగా తెలుసు కుందామా..
love-zindagi
ఘటన1: జూన్ 2003.. ముంబై నేవీ రోడ్‌లో ఓ ప్రమాదం జరిగింది. మారుతి జెన్ కార్లో ప్రయాణిస్తున్న అనుప్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స అనంతరం అతను వెన్నెముక కోల్పోయి వీల్ చైర్‌కు పరిమితమయ్యాడు.
ఘటన2: నవంబర్ 2005 సేమ్ మారుతి జెన్ మోడల్ కారు, ముంబై నేవి రోడ్డు...అనుప్‌కు జరిగినట్టుగానే నెహాల్ కూడా ప్రమాదానికి గురైంది. ఆమె కూడా తన వెన్నెముకను కోల్పోయింది.
పదకొండు ఏండ్ల క్రితం ముంబైలో ఓ మెడికల్ కన్వెన్షన్‌లో అనుప్‌ను నెహాల్ మొదటిసారి చూసింది. ఇద్దరూ వీల్ చైర్‌లో ఉన్నారు. కాసేపటి తర్వాత ఇద్దరూ పలకరించుకున్నారు. ఇద్దరి ప్రమాద తీరుని తెలుసుకుని ఆశ్చర్యానికి గురయ్యారు. తేదీలు మాత్రమే వేరు. ప్రమాద స్థలం, కారు మోడల్, గాయాలు అన్నీ ఒకేలా ఉన్నాయి. దీంతో ఇద్దరి మధ్యా మాటలు పెరిగాయి. ఫోన్‌నంబర్లు మార్చుకున్నాకా అది స్నేహంగా మారింది. రోజూ మాట్లాడుకోవటం, బయటకు వెళ్లడం తరచూ చేస్తుండేవారు. ఇలా ఇద్దరూ స్నేహితులయ్యారు. తర్వాత కొన్ని రోజులకు నెహాల్ 20 రోజుల విదేశీ పర్యటనకు వెళ్లింది. అనుకోకుండా ఇద్దరి మధ్య సందేశాలు, ఫోన్లు తగ్గాయి. ఈ దూరం ఇద్దరి మధ్య బంధాన్ని దగ్గర చేసింది. నెహాల్ తిరిగి వచ్చాక అనుప్ తను ఎదుర్కొన్న ఫీలింగ్‌ను నెహాల్‌కు చెప్పాడు. నెహాల్ కూడా అలాంటి పరిస్థితులే ఎదుర్కోవటం మూలంగా వారి ప్రేమ ఇద్దరికీ అర్థమయింది. అప్పటి నుంచి ఏడేండ్లు డేటింగ్ కొనసాగించారు. తర్వాత పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ వాళ్ల తల్లిదండ్రులకే ఏదో సందేహంగా ఉండేది. అయినా అనుప్, నెహాల్ విడిపోవాలని అనుకోలేదు. ఎలాగైనా ఒక్కటవ్వాలనుకున్నారు. నైతికంగా, భావోద్వేగంగా ఒకరికొకరు మద్దతుగా నిలిచారు. వాళ్ల పనులను వాళ్లు ఎలా చేసుకోవచ్చో చేసి చూపించారు. ఎవరి సాయం లేకుండా జీవితాన్ని గడపగలం అని పెద్దలను ఒప్పించి ఏడాది క్రితం పెండ్లి చేసుకున్నారు. ఇది అనుప్, నెహాల్ సక్సెస్ లవ్ స్టోరీ.. ప్రేమ కోసం యుద్ధాలే చేయనక్కర్లేదు, ప్రేమ కోసం పిచ్చివాళ్లు కానక్కర్లేదు... ఒకరినొకరు అర్థం చేసుకుని, తలిదండ్రులకు తమ భవిష్యత్‌పై భరోసా కల్పిస్తే ప్రేమ కలకాలం వర్ధిల్లుతుంది అనడానికి ఈ స్టోరీ ఒక ఉదాహరణ...

700
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles