వన్యప్రాణులే ప్రాణంగా..


Sat,December 29, 2018 12:59 AM

వన్యప్రాణులంటే అమితమైన ఇష్టం, ప్రేమ. ప్రస్తుతం వల్డెస్సే అనే ప్రాజెక్టుపై పనిచేస్తున్నది. వన్యప్రాణుల మీద ఆధారపడి జీవిస్తున్న 7000 కుటుంబాలకు సాయపడుతున్నది. ఉమెన్ ఆఫ్ డిస్కవరీ అవార్డు గ్రహీత. ఎవరో తెలుసా?
karanth
ఆమె పేరు డా. క్రితి కరాంత్. కర్ణాటకలోని మంగళూరు నగరానికి చెందిన తెలివైన మహిళా శాస్త్రవేత్త. వింగ్స్ వరల్డ్ క్వెస్ట్ సంస్థ ద్వారా 2019 ఉమెన్ ఆఫ్ డిస్కవరీ అవార్డును అందుకోనున్నది. ఈ సంస్థ మహిళా శాస్త్రవేత్తలకు మద్దతు పలుకుతూ, వారి పనిని గుర్తిస్తున్నది. కరాంత్‌కి ఈ అవార్డు రావడానికి కారణం తన కుటుంబమేనట. క్రితి చిన్నప్పటి నుంచీ తండ్రి దగ్గర అడవుల ప్రాముఖ్యం గురించి అవగాహన పెంచుకున్నది. చెట్లను నరికివేయడం వల్ల కలిగే దుష్ఫలితాలను తాతయ్య ద్వారా తెలుసుకున్నది. కిరాంత్ తండ్రి టైగర్ బయోలాజిస్ట్. తాతయ్య పర్యావరణవేత్త. తన బాల్యం అంతా వీరి మధ్యనే గడిచింది. తండ్రితో పాటు వెంటవెళ్లి జంతువులను చూసి ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉండేది. తండ్రిలాగే తన వృత్తి ఉండాలనుకోలేదు. పర్యావరణ శాస్త్రం, భూగోళ శాస్త్రం చదువుతున్నప్పుడు పరిశోధనలు, వన్యప్రాణి సంరక్షణ మీద ఆసక్తి పెరిగింది. దాన్నే అభిరుచిగా మార్చుకున్నది. ఫ్లోరిడా యూనివర్సిటీలో బిఎస్, బిఏ డ్యూక్ యూనివర్సిటీలో పర్యావరణ శాస్త్రం మీద పీహెచ్‌డీ చేసింది. భారతదేశంలో పరిశోధనల మీద దృష్టి పెట్టింది. వన్యప్రాణి పర్యాటక ప్రభావాలు, స్వచ్ఛంద పునరావాసం, భూ వినియోగ మార్పు, మానవ వన్యప్రాణుల పరిణామాల గురించి ప్రజలల్లో అవగాహన పెంచడానికి కొన్ని సమావేశాలు ఏర్పాటు చేసింది. 2002లో కర్ణాటకలోని భద్రలో కిరాంత్ మొదటి ప్రాజెక్టు మొదలైంది. అక్కడ తను ప్రజల స్వచ్ఛంద పునరావాసం మీద అధ్యయనం చేసింది. కరాంత్ ప్రస్తుతం వల్డెస్సే ప్రాజెక్టు మీద పనిచేస్తున్నది. ఈ ప్రాజెక్టు ద్వారా 7000 కుటుంబాలకు సాయపడుతున్నది కరాంత్. భారతదేశం, ఆస్ట్రేలియా, యూకే, యూఎస్‌ఏలోని వందమంది శాస్త్రవేత్తలకు సలహాదారుగా ఉన్నది. కరాంత్ వీరందరికీ ఆదర్శంగా నిలుస్తున్నది.

718
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles