వడియాలు పెట్టుకుందామా!


Thu,April 18, 2019 02:15 AM

Vadiyalu
చురుక్కుమనే ఎండలో..చల్లగా ఏమైనా తినాలనో.. తాగాలనో అనిపిస్తుంది.. అంతకుమించి ఒక్క పని కూడా చేయాలనిపించదు.. కానీ ఈ ఎండలో ఒక పనిచేస్తే.. సంవత్సరమంతా పనికొచ్చే సైడ్ డిష్‌ని తయారుచేసుకోవచ్చు.. అవే కరకరలాడే వడియాలు.. ఇప్పటిదాకా బియ్యం.. సగ్గుబియ్యంతోనే.. వడియాలు పెట్టుకోవడం చూసి ఉంటారు.. అవి కాకుండా కూడా వడియాలు ఎలా పెట్టుకోవాలో చూడండి..

మినుప వడియాలు

Minapa-Vadiyalu

కావాల్సినవి :

మినుపపప్పు : ఒక కప్పు
జీలకర్ర : 1 1/2 టీస్పూన్స్
పచ్చిమిర్చి : 3, అల్లం : చిన్న ముక్క
ఉప్పు : తగినంత

తయారీ :

స్టెప్ 1 : మినుపపప్పును నాలుగు నుంచి ఐదు గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత నీళ్లను వంపేసి మిక్సీ పట్టాలి.
స్టెప్ 2 : దీంట్లో పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం ముక్కలు, ఉప్పు వేసి మరొకసారి గ్రైండ్ చేయాలి.
స్టెప్ 3 : ఇప్పుడు ఒక కాటన్ లేదా పాలిథీన్ షీట్‌ని పరుచాలి. పిండిని కొద్దికొద్దిగా తీసి వీటి మీద వడియాలు పెట్టుకోవాలి.
స్టెప్ 4 : వీటిని రెండు రోజుల పాటు ఎండలో ఆరబెట్టాలి. ఆ తర్వాత గాలి చొరబడని డబ్బాలో ఉంచాలి. కావాలనుకున్నప్పుడు నూనెలో వేయించుకుంటే సరిపోతుంది.

రవ్వ వడియాలు

Sooji-Vadiyalu

కావాల్సినవి :

రవ్వ : ఒక కప్పు, సాబుదానా : ఒక టేబుల్‌స్పూన్
పచ్చిమిర్చి : 4, జీలకర్ర : అర టీస్పూన్,
అల్లం : చిన్న ముక్క,
నీళ్లు : 8 కప్పులు , ఉప్పు : తగినంత

తయారీ :

స్టెప్ 1 : సాబుదానాలో కొన్ని నీళ్లు పోసి నానబెట్టాలి.
పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, అల్లం అన్నీ కలిపి మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి.
స్టెప్ 2 : ఒక గిన్నెలో ఎనిమిది కప్పుల నీళ్లు పోసి బాగా వేడి చేయాలి. దీంట్లో మిర్చి పేస్ట్ వేసి వేడి చేయాలి.
స్టెప్ 3 : ఇందులోనే సాబుదానా వేసి కలుపాలి. ఇవి కాస్త ఉడికాక.. రవ్వను కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి.
స్టెప్ 4 : చిక్కగా అయ్యాక.. దించేయాలి. కాటన్ క్లాత్‌ని పరిచి మనకి నచ్చిన షేప్‌లో వత్తుకోవాలి. వీటిని రెండు రోజుల పాటు ఎండబెట్టి.. డబ్బాలో దాచుకోవాలి. కావాలనుకునప్పుడు నూనెలో వేయించాలి. కరకరలాడే వడియాలు రెడీ అవుతాయి.

టమాటా వడియాలు

PohaTomatoVadiyalu

కావాల్సినవి :

అటుకులు : ఒక కప్పు
టమాటా ప్యూరీ : ఒక కప్పు
జీలకర్ర : అర టీస్పూన్, ఉప్పు : తగినంత

తయారీ :

స్టెప్ 1 : ఒక గిన్నెలో టమాటా ప్యూరీ, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
స్టెప్ 2 : మరో గిన్నెలో అటుకులు వేసి నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టాలి. బాగా నానిన తర్వాత టమాటా మిశ్రమంలో వేసుకోవాలి.
స్టెప్ 3 : ప్లేట్ లేదా ఒక కాటన్ వస్త్రం మీద వీటిని మనకు నచ్చిన షేప్‌ల్లో వడియాలు పెట్టుకొని రెండు రోజుల పాటు ఎండబెట్టుకోవాలి.
స్టెప్ 4 : బాగా ఆరాక వీటిని డబ్బాలో దాచుకోవచ్చు. కావాలనుకున్నప్పుడు నూనెలో కరకరలాడేలా వేయించుకోవాలి.

బూడిద గుమ్మడికాయ వడియాలు

Ash-Gourd-Vadiyalu

కావాల్సినవి :

బూడిద గుమ్మడికాయ : సగం ముక్క , మినుపపప్పు : ఒక కప్పు, పచ్చిమిర్చి : 3
అల్లం : చిన్న ముక్క, జీలకర్ర : అర టీస్పూన్, ఉప్పు : తగినంత

తయారీ :

స్టెప్ 1 : గుమ్మడికాయ చెక్కు తీసేసి తురిమి పెట్టుకోవాలి. దీనిని మస్లిన్ క్లాత్‌లో చుట్టి నీరంతా పోయేవరకు పిండి పక్కన పెట్టుకోవాలి.
స్టెప్ 2 : మినుపపప్పును నాలుగు గంటల పాటు నీళ్లు పోసి నానబెట్టాలి. ఆ తర్వాత నీళ్లు తీసేసి దాన్ని మిక్సీ పట్టాలి.
స్టెప్ 3 : ఇందులోనే మిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర, ఉప్పు వేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి.
స్టెప్ 4 : ఈ మిశ్రమంలో గుమ్మడికాయ తురుము వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఎండలో ఒక క్లాత్ పరుచాలి. దీనిమీద గుమ్మడికాయ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతితో వత్తి ఆరబెట్టాలి.
స్టెప్ 5 : రెండు రోజుల పాటు ఈ వడియాలను ఎండలో ఆరబెట్టాల్సి ఉంటుంది. పూర్తిగా ఆరాక డబ్బాలో దాచుకోవచ్చు. కావాల్సినప్పుడు నూనెలో వేసి వేయించుకోవచ్చు.

పెసరపప్పు వడియాలు

Moong-Dal-Vadiyalu

కావాల్సినవి :

పెసరపప్పు : ఒక కప్పు , అల్లం : చిన్న ముక్క,
పచ్చిమిర్చి : 3, జీలకర్ర : ఒక టీస్పూన్, ఉప్పు : తగినంత

తయారీ :

స్టెప్ 1 : పెసరపప్పును నాలుగు నుంచి ఐదు గంటల పాటు నానబెట్టాలి. వీటిని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
స్టెప్ 2 : దీంట్లోనే అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు వేసి కొన్ని నీళ్లు పోసి మరొకసారి మెత్తని పేస్ట్ చేసుకోవాలి.
స్టెప్ 3 : ఈ మిశ్రమాన్ని పాలిథిన్ పేపర్ మీద చిన్న చిన్నగా ఒత్తి ఎండలో పెట్టుకోవాలి. పూర్తిగా ఆరేవరకు ఎండలోనే ఉంచాలి.
స్టెప్ 4 : గాలి చొరబడని డబ్బాలో దాచుకోవాలి. పప్పు వండినప్పుడు అంచులో ఈ వడియాలు తింటుంటే యమ టేస్టీగా ఉంటాయి.

-సంజయ్ తుమ్మ
-సెలబ్రిటీ చెఫ్

427
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles