లోదుస్తుల వ్యాపారంలో నంబర్‌వన్ అర్పితా గణేష్


Mon,December 17, 2018 01:48 AM

నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటారు. అవసరం నుంచి వ్యాపారం పుడుతుంది. ఈమె వ్యాపారం కూడా అలా మొదలైందే. నలుగురినీ ఆకట్టుకునేలా వైవిధ్యంగా దుస్తులు ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. ఆధునికతకు తగినట్లు ట్రెండీగా ఉండాలని చాలామంది అమ్మాయిల అనుకుంటారు. అయితే లో దుస్తుల విషయం వచ్చేప్పటికీ మాత్రం అంతగా ఆలోచించరు. షాపునకువెళ్లి కొనుక్కొవడానికి మొహమాటం, సిగ్గు, బిడియం అడ్డొస్తాయి. దీంతో మార్కెట్లో కనిపించినవి ఏవో ఒకటి ఎంచుకుంటారు.అయితే అవి అసౌకర్యానికి గురిచేయడమే కాకుండా ఆకృతిపైనా ప్రభావం చూపుతాయి. ఆ సమస్యను పరిష్కరించే లక్ష్యంతో పుట్టుకొచ్చిందే బటర్‌కప్స్. లోదుస్తుల వ్యాపారంతో అమ్మాయిల మనసు దోచుకోవడంతో పాటు స్మాల్ బిజినెస్ హీరోస్ అవార్డునూ అందుకున్న అర్పితా గణేష్ సక్సెస్‌మంత్ర.మన దేశంలో లోదుస్తుల గురించి చాలామంది బహిరంగంగా మాట్లాడరు. ఇప్పటికీ చదువుకున్న అమ్మాయిలు కూడా వాటిని కొనుక్కోవడానికి సిగ్గుపడుతారు. దీనితో మన దేశంలో ఎనభై శాతం అమ్మాయిలు వారికి సరిగ్గా సరిపోయే లోదుస్తులు వేసుకోరని అధ్యయనాలు చెబుతున్నాయి. లోదుస్తులు అందరికీ అన్ని సైజుల్లో అందుబాటులో ఉండకపోవడం, చాలామందికి తమకు ఎలాంటివి సరిపోతాయే అవగాహన లేకపోవడం కారణమే. అయితే బటర్‌కప్స్ మాత్రం అవసరానికి తగినట్లు ప్రత్యేకంగా ప్రశ్నావళిని అందించి, సందర్భం, ఆకృతికి తగినట్లు లోదుస్తుల్ని అందిస్తుంది అంటున్నారు అర్పితాగణేష్.
arpita-ganesh
అర్పితాది బెంగళూరు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదివింది. అర్పిత ఒకసారి న్యూయార్క్ వెళ్లినప్పుడు అక్కడ ఎదురైన చిన్న సంఘటనే బటర్‌కప్స్ స్థాపనకు ప్రేరణనిచ్చిందట. న్యూయార్క్‌లో బొటిక్‌కు వెళ్లి నా ఆకృతికి సరిపోయే లోదుస్తులు కావాలని అడిగా. వాళ్లు నాతో మాట్లాడి.. సరిగ్గా నాకు సరిపోయే దుస్తులు ఇచ్చారు. అవి చాలా సౌకర్యంగా అనిపించాయి. ఆశ్చర్యమనిపించింది. నాకున్న కొన్ని సందేహాలను వారితో తీర్చుకున్నా. అదే ప్రేరణతో ఇక్కడకు వచ్చాక అలాంటి సేవల్నే నేనూ ప్రారంభించాలనుకున్నా. అలా ఈ సేవల్ని అందుబాటులోకి తెచ్చా అని తన స్వియానుభవాన్ని పంచుకుంన్నారు అర్పిత.

ఇండియాకు వచ్చాక బొటిక్ పెట్టాలనుకున్నా కానీ నా దగ్గర సరిపడా పెట్టుబడి లేదు. అందుకే ప్రీ ఆర్డర్ అనే విధానాన్ని ప్రారంభించాను. అంటే లోదుస్తులు కావాలనుకున్న వారు ముందుగానే డబ్బులు చెల్లించాలి. నా ప్రాజెక్ట్ సక్సెస్ అయితే లోదుస్తుల్ని అందిస్తానని చెప్పా. ఒకవేళ నా బిజినెస్ స్టార్ట్ చేయకపోతే వారి డబ్బులు వారికి తిరిగిచ్చేస్తానని చెప్పా. దానికోసం సోషల్ మీడియాను మాధ్యమంగా ఎంచుకున్నాను. ఒక పోస్ట్ రాసి దాన్ని నా స్నేహితులూ, తెలిసినవారికీ పంపా. వారిని కూడా షేర్ చేయమని చెప్పా. అలా చాలామంది షేర్ చేయడం, తెలిసివాళ్లు వారికి తెలిసిన వారికి చెప్పడం చేశారు. అలా 200 మంది మహిళలు డబ్బులు చెల్లించడానికి ముందుకు వచ్చారు. ఒక్కొక్కరు రూ. 1500 ఇచ్చారు. అలా వారి ఆదరణే నాకు తొలి పెట్టుబడిగా వచ్చింది. మహిళల సాయంతోనే పదిహేనేళ్లక్రితం ఈ సంస్థను ప్రారంభించా అంటున్నది అర్పితా. మొత్తంమీదా అనుకున్నట్లుగానే కంపెనీని ప్రారంభించింది అర్పితా. అయితే చాలామంది లోదుస్తుల కోసమే అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏంటని అడిగేవారు.
arpita-ganesh1
అంతేకాదు లోదుస్తుల బిజినెస్ కూడా బిజినెస్‌నేనా అని నవ్వారు కూడా. వీటికి తోడు మొదట్లో అనుకున్న ఫలితాలు కూడా రాలేదు. ఒకానొక సమయంలో అయితే.. సంస్థను మూసేసి ఎక్కడికన్న వెళ్లిపోవాలనుకుందట అర్పితా గణేష్. కానీ ఆమె మనస్సాక్షి మాత్రం ఒప్పుకోలేదు. అందుకే సుదీర్ఘంగా ఆలోచించింది. లోదుస్తులు అని తేలికగా తీసివేస్తున్నారే కానీ వాటి అవసరం ఎంతని ఎవరూ ఆలోచించడం లేదని ఆమెకు అర్థమైంది. అందుకే వాటి అవసరాన్ని తెలియజేయడానికి వివిధ కార్పొరేట్ సంస్థల గడపతొక్కింది. అక్కడ పనిచేసే మహిళల కోసం ఉచితంగా వర్క్‌షాపులు నిర్వహించింది. మంచి స్పందన వచ్చింది. ప్రతి ఒక్కరూ కూడా మాకు తెలియని చాలా విషయాలు నేర్చుకున్నాం అనేవారు. అలా వినియోగదారుల సంఖ్యను పెంచుకుంటూ పోయారు. ప్రస్తుతం బటర్‌కప్స్‌కు మూడువేల మందికి పైగా వినియోగదారులు ఉన్నారు. మొదట్లో వేరే కంపెనీలకు వివిధ సైజుల్లో డిజైన్లు పంపిస్తే వాళ్లే తయారు చేసి ఇచ్చేవారు. వినియోగదారుల సంఖ్య పెరిగేకొద్దీ అర్పితానే సొంతంగా తయారీ చేయాలనుకుంది. అలా ఆమె స్వయంగా ఒక యూనిట్‌ను ఏర్పాటు చేశారు. పలు అంతర్జాతీయ సంస్థలతోనూ ఒప్పందం కుదుర్చుకున్నారు.

నిపుణుల సలహాలతో..

అంతర్జాతీయంగా మొత్తం 150 సైజుల్లో లోదుస్తులు లభిస్తుంటే మన దేశంలో ఆ సంఖ్య కేవలం 50లోపే. ఆ సంఖ్యను పెంచడానికి అర్పితా ప్రయత్నాలు మొదలు పెట్టింది. లోదుస్తులు అంటూ కేవలం శరీరాకృతికి తగినట్లుగా మాత్రమే కాదు.. సందర్భం, అవసరానికి సరిపోయే రకాలనూ అందు బాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. బటర్‌కప్స్‌లోని అంతర్జాలంలో కొనుగోలు చేయాలనుకుంటే, వారి వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి, అక్కడ కొన్ని ప్రశ్నలుంటాయి. వాటి ఆధారంగా వాళ్లకు సరిపోయే రకాలను ఆర్డరిచ్చుకుంటే ఇంటికి పంపిస్తారు. అలాగే బెంగళూరులో ఉన్న బొటిక్ నుంచి కూడా కొనుక్కోవచ్చు. అక్కడ రెండు బొటిక్‌లున్నాయి. సందేహాలుంటే, నిపుణుల సలహాలూ అందించే ఏర్పాటు కూడా చేశారు. వారి సలహాతో కావాల్సిన సైజులో లోదుస్తులు కొనుక్కోవచ్చు.

ఇలా ఆర్డర్ చేయండి

arpita-ganesh2
ఆన్‌లైన్‌లో బటర్‌కప్స్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి టేక్ అవర్ క్విజ్ ఆప్షన్ ద్వారా అక్కడ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. ఆ తర్వాత ఆకృతికి సరిపోయే లోదుస్తులు వివిధ రకాల్లో ధరలతో సహా చూసి, సరిపోయేవాటిని ఎంచుకోవచ్చు. ఇదంతా ఆన్‌లైన్ ద్వారానే జరుగుతుంది. ప్రస్తుతం నెలకు దాదాపు 500 ఆర్డర్లు వస్తే అందులో సుమారు 60 శాతం బొటిక్‌ల నుంచే వస్తున్నాయి. ఆన్‌లైన్‌లో హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై సహా ఇతర ప్రాంతాలనుంచీ ఆర్డర్లు వస్తున్నాయి. త్వరలోనే దేశవ్యాప్తంగా బటర్‌కప్ సేవల్ని విస్తరించాలనే ఆలోచన ఉంది.
-అర్పితా గణేష్

1056
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles