లివర్ క్యాన్సర్ నివారణ సాధ్యమే


Wed,May 31, 2017 12:00 AM

liver
మానవ శరీరంలో లివర్ అన్నింటికంటే పెద్ద అవయవం. అంతేకాదు నిరంతరాయంగా పనిచేస్తూ ఉంటుంది. చాలా విధులు నిర్వర్తిస్తుంటుంది. అత్యంత ముఖ్యమైన ఈ అవయవం ఇప్పుడు చాలా ప్రమాదంలో ఉంది. లివర్ క్యాన్సర్ పురుషుల్లో అతి ఎక్కువగా వచ్చే క్యాన్సర్లలో ఐదవది, స్త్రీలలో ఎనిమిదవది. లివర్ క్యాన్సర్ సోకిన వారిలో కేవలం 15 శాతం మంది మాత్రమే 5 సంవత్సరాల వరకు బతకగలుగుతున్నారు. మెపటో సెల్యూలార్ కార్సినోమా అనే లివర్ క్యాన్సర్ ప్రపంచ వ్యాప్తంగా చాలా ఎక్కువగా కనిపిస్తున్నది. ఈ క్యాన్సర్‌ను తొలిదశల్లో గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటే ప్రత్యేకంగా ఎలాంటి లక్షణాలు ఈ వ్యాధిలో కనిపించవు.

క్యాన్సర్ చికిత్సలో ఎన్నో కొత్తకొత్త విధానాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ దురదృష్టవశాత్తు లివర్ క్యాన్సర్ విషయంలో మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే ఈ చికిత్స అందే అవకాశం ఉంటున్నది. అందుకు కారణం లివర్ క్యాన్సర్ ట్యూమర్ చాలా చిన్నగా ఉండి లివర్ పనితీరు మెరుగ్గా ఉన్నవారిలో మాత్రమే ఈ చికిత్సలు అందించే వీలుంటుంది. హెచ్‌సీసీలో సర్జరీ అన్నింటికంటే మేలైన చికిత్స, కానీ ఇది అందరికీ ఉపయోగకరంగా ఉండదు. ఈ క్యాన్సర్ మళ్లీ తిరిగి వచ్చే ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది. దీనికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఒకటే మార్గం. కానీ దీనిలో ఉండే పరిమితులు చాలా ఎక్కువ. దాత దొరకకపోవచ్చు. ఎప్పుడైనా చికిత్స కంటే నివారణే మేలు. ఇలాంటి ట్యూమర్లు ఏర్పడకుండా జాగ్రత్త పడడం అవసరం.హెచ్‌సీసీ సమస్య రావడానికి లివర్ సిర్రోసిస్ ప్రధాన కారణం. లివర్ సిర్రోసిస్ రావడానికి హెపటైటిస్ బి, సి వైరస్ ఇన్‌ఫెక్షన్లు, దీర్ఘకాలికంగా మద్యం సేవించడం, స్థూలకాయం, పొగతాగడం వంటివి ముఖ్యమైన కారణాలు.

ప్రపంచవ్యాప్తంగా 80 శాతం హెచ్‌సీసీకి ఆంకోజెనిక్ వైరస్‌లే కారణం. వీటిని నివారించేందుకు ఆగ్నేయ ఆసియాలో చాలా వరకు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు హెపటైటస్ బి వైరస్‌కి సంబంధించిన ఇమ్యూనైజేషన్ కార్యక్రమాన్ని చాలా దేశాల్లోకి విస్తరించారు. ఇప్పుడు 90 శాతం వరకు శిశువుల వ్యాక్సిన్ తీసుకున్నారు. దీని ఫలితాలు లివర్ క్యాన్సర్‌ను నివారించడంలో కనిపిస్తున్నాయి. దురదృష్టవశాత్తు హెచ్‌సీసీ కారణమయ్యే హెపటైటిస్ సి వైరస్‌కు వ్యాక్సిన్ అందుబాటులో లేదు. ఇది సాధారణంగా ఇన్‌ఫెక్టెడ్ రక్తం, ప్లేట్లెట్లు వంటి ఇతర రక్త సంబంధిత ఫ్లూయిడ్ల మార్పిడి ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. కాబట్టి డిస్పోజబుల్ సిరంజీలు ఉపయోగించడం రక్త మార్పిడి సమయంలో తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మాత్రమే దీన్ని నివారించడం సాధ్యపడుతుంది. హెచ్‌సీసీని నివారించాలంటే హెచ్‌సీవి, హెచ్‌బివీ రోగులను యాంటీ వైరల్ మందులతో చికిత్స అందించాలి.
dr.ramanjaneylu
హెచ్‌బీవీ, హెచ్‌సీవీ, దీర్ఘకాలికంగా మద్యం సేవించే వారిలో కలిగే లివర్‌సిర్రోసిస్ కూడా హెచ్‌సిసికి కారణం అవుతుంది. హెచ్‌సీసీ సమస్యగా మారడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. ట్యూమర్‌గా మారడానికి 15 -20 సంవత్సరాల సమయం పడుతుంది. సిర్రోసిస్‌ను అదుపులో ఉంచగలిగితే హెచ్‌సీసీని నివారించవచ్చు.హెచ్‌బీవీకి సంబంధించిన వ్యాక్సిన్లు అందించడం, హెచ్‌బీవీ/హెచ్‌సీవీకి యాంటీ వైరల్ మందులతో చికిత్స అందించవచ్చు. ఆల్కహాల్ పరిమితంగా తీసుకోవడం, స్థూలకాయం, డయాబెటిస్ వంటి పరోక్షకారణాలను అదుపులో పెట్టడం ద్వారా హెచ్‌సీసీని నివారించడం సాధ్యమే.

660
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles