లివర్ క్యాన్సర్‌కు అవగాహన ముఖ్యం


Wed,April 6, 2016 01:39 AM

మానవ శరీరంలో కాలేయం ఒక ప్రధాన అవయవం. జీర్ణ వ్యవస్థలో ఇది చురుకైన పాత్రపోషిస్తుంది. చాలా మంది ఇది జీర్ణక్రియలో మాత్రమే ఉపకరిస్తుందని భావిస్తారు కానీ, ప్రొటీన్ సంశ్లేషణ, డ్రగ్ మెటబాలిజం, విసర్జన వంటి అనేక ముఖ్య ప్రక్రియల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఇది పాలు పంచుకుంటుంది.
కాలేయంలో ఏర్పడే ప్రధాన సమస్యల్లో క్యాన్సర్ ఒకటి. కాలేయంలో కణితి ఏర్పడి అది అవాంఛనీయంగా పెరిగిపోతుంది. అన్ని కణితులు క్యాన్సర్ కణితులు కాకపోవచ్చు.

కారణాలు
హెపటైటిస్ వైరస్ సోకినపుడు సరైన వైద్యం అందకపోతే ఇన్‌ఫెక్షన్ బలపడుతుంది. అది క్యాన్సర్‌కు కారణం కావచ్చు. ఇందులో హెపటైటిస్ బి,సి అనే వైరస్‌లు ఒకరి నుంచి మరొకరికి రక్తమార్పిడి, శృంగారం ద్వారా వ్యాపిస్తాయి. ఈ వైరస్ కాలేయంలోకి చొరబడి అక్కడి సజీవ కణజాలాన్ని నాశనం చేసి గట్టి పడతాయి. ఈ దశలోనే సిర్రోసిస్ ఏర్పడుతుంది. ఇది ముదిరినపుడు క్యాన్సర్‌కు కారణం అవుతుంది. మద్యపానం అలవాటు ఉన్న వారిలో ఆల్కహాల్ శరీరంలో విషపదార్థంగా మారుతుంది. ఇది క్రమేణా క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉంది.

రకాలు
హెపటో బ్లాస్టోమా, పిల్లల్లో వచ్చే కాలేయ క్యాన్సర్
హెపటో సెల్యులార్ కార్సినోమా, పెద్దవాళ్లలో వచ్చే కాలేయ క్యాన్సర్
కొలంజియో కార్సినోమా లేదా కాలేయ వాహిక క్యాన్సర్. కాలేయ వాహికల్లో వచ్చే క్యాన్సర్
యాంజియో సార్కోమా కాలేయ రక్తనాళాల్లో ఏర్పడే క్యాన్సర్ ఈ కణితులు వేగంగా వ్యాపిస్తాయి. చాలా ప్రమాదకరంలింఫోమా, ఇది కూడా కాలేయ క్యాన్సరే

లక్షణాలు
దురదృష్ట వశాత్తు కాలేయ క్యాన్సర్ ముదిరిపోయే దాకా లక్షణాలు బయటపడవు. కడుపులో ఎగువ భాగంలో నొప్పి రావడం, బరువు తగ్గడం, నీరసంగా ఉండడం వంటి లక్షణాలు ఉంటాయి. కొన్ని సార్లు కామెర్లు రావచ్చు. కాలేయం పెరిగినపుడు కడుపు భాగంలో వాపు కనిపిస్తుంది. చిన్న పిల్లలకు స్నానం చేయించేసమయంలో తల్లిదండ్రులు తడిమి చూస్తే చేతికే తగలవచ్చు.

నిర్ధారణ
సీటీ స్కాన్ ఎంఆర్‌ఐ స్కాన్‌లతో పాటు తప్పనిసరైతే బయాప్సీ పరీక్షల ద్వారా క్యాన్సర్‌ను గుర్తిస్తారు. సీరమ్ ఆల్ఫాఫిటో ప్రొటీన్ వంటి రక్త పరీక్షలు కూడా అవసరం అవుతాయి. యాంజియోగ్రామ్, లాపరోస్కోపి పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. క్యాన్సర్ వ్యాధి చికిత్సలో అనేక రకాలుంటాయి. క్యాన్సర్ కణాలను సూటిగా నాశనం చేసే ఎఫ్‌ఏ చికిత్స క్యాన్సర్ కణాలను గడ్డకట్టే విధంగా చేసే క్రయో చికిత్స వంటివి చెయాలిస రావచ్చు.

క్యాన్సర్‌కు ఆపరేషన్ చేయడం పై కొన్ని అపోహలున్నాయి. రాడికల్ ఆపరేషన్ చేసినపుడు క్యాన్సర్ కణాలు చెదిరిపోయి ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాయన్న అపోహ ఉంది. వాస్తవానికి క్యాన్సర్ చికిత్సలో రాడికల్ ఆపరేషన్ అన్నది ఉత్తమ చికిత్స. సుశిక్షితులైన సర్జన్‌లు చక్కటి టెక్నాలజీ ఉపయోగించుకొని చికిత్స చేస్తున్నారు. ఆపరేషన్‌లు వీలులేని పరిస్థితుల్లో కీమోథెరపీ, రేడియోథేరపీ వంటి చికిత్సలు అవసరం అవుతాయి. ఒకవేళ వ్యాధి ముదిరిపోయిన స్థితిలో కూడా ఎండోస్కోపీ, ఎంబోలైజేషన్ వంటి విధానాలతో చికిత్స అందించడం ద్వారా నాణ్యమైన శేషజీవితాన్ని అందించేందుకు వీలవుతుంది. కొన్ని సార్లు కాలేయ మార్సిపడి కూడాఅవసరం అవుతుంది. కాలేయం మార్పిడి అంటే పూర్తిగా చెడిపోయిన కాలేయాన్ని బాగుచేయలేని పరిస్థితుల్లో చేసే చికిత్స. ఈ ప్రక్రియలో చెడిపోయిన కాలేయాన్ని తొలగించి, ఆప్రాంతంలో మరొక వ్యక్తి నుంచి కాలేయాన్ని సేకరించి అందులో ఉంచుతారు. నిపుణులైన సర్జన్‌లు మాత్రమే ఈ సంక్లిష్టమైన సర్జరీ చేయగలుగుతారు.

జాగ్రత్తలు
కాలేయ వ్యాధులు ఏర్పడుటకు అపరిశుభ్రత, దురలవాట్లు ముఖ్య కారణమని గుర్తించాలి. శుద్ధి చేసిన తాగు నీటిని ఉపయోగించడం, సురక్షిత శృంగారం, టవల్స్, బ్లేడ్‌లు వంటివి ఎవరికి వారు వాడుకోవడం వంటివి తప్పనిసరి. మద్యానికి దూరంగా ఉండడం మేలు. అదే సమయంలో ఒకవేళ సమస్యలు తలెత్తితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
ragavendrarao

1992
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles