రేడియేషన్ థెరపీ అంటే..?


Sat,March 30, 2019 01:10 AM

మా అమ్మ గారి వయస్సు 51 యేండ్లు. ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ గడ్డను గుర్తించారు. మూడు నెలలుగా చికిత్స చేస్తున్నాం. ఇప్పుడు రేడియేషన్ థెరపీ చేయాలని చెప్పారు. చాలా భయంగా ఉంది. రేడియేషన్ థెరపీ అంటే ఏమిటి? అది తప్పనిసరిగా చేయించుకోవాలా? దయచేసి తెలియజేయండి.
- కె.యాదగిరిరావు, వనపర్తి

Radiation-therapy
మీ అమ్మ గారి విషయంలో ఆందోళన చెందకండి. క్యాన్సర్‌కు చికిత్స ఉంది. ప్రాథమిక దశలోనే చికిత్స ప్రారంభించగలిగితే పూర్తిగా క్యాన్సర్ నుంచి విముక్తి లభించే అవకాశాలు ఉన్నాయి. క్యాన్సర్ గడ్డల పెరుగుదలను అరికట్టడానికి, వాటి తొలిగింపునకు శస్త్రచికిత్స అనంతరం.. మళ్లీ క్యాన్సర్ కణాలు పెరుగుకుండా, నొప్పి నుంచి ఉపశమనం కలిగించేందుకు రేడియేషన్ థెరపీ లేదా రేడియో థెరపీని ఉపయోగిస్తారు. కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ శస్త్ర చికిత్సకు ముందు రేడియేషన్ థెరపీ చేస్తారు. దీని వల్ల క్యాన్సర్ గడ్డ ముడుచుకుపోతుంది. ఆ తర్వాత సర్జరీ ద్వారా దానిని తొలిగించే ప్రక్రియను కచ్చితంగా, సురక్షితంగా ఉంటుంది. క్యాన్సర్ చికిత్సలో కొన్నిసార్లు రోగిని కాపాడడానికి రేడియేషన్ థెరపీ ఒక్కటే మార్గం అవుతుంది. కొన్నిరకాల క్యాన్సర్లకు సర్వసాధారణంగా రేడియేషన్‌నే సిఫార్సు చేస్తారు. అదే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ చికిత్సలో రేడియేషన్‌తోపాటు శస్త్రచికిత్స, కిమోథెరపీని కూడా ఉపయోగిస్తారు.

రేడియేషన్ థెరపీ మొత్తం ప్రక్రియ రేడియేషన్ ఆంకాలజిస్టుల పర్యవేక్షణలో జరుగుతుంది. ఈ రేడియేషన్ థెరపీ అనేది ఎన్నో యేండ్ల నుంచి ప్రపంచవ్యాప్తంగా చికిత్సలో ఉంది. దీని ద్వారా క్యాన్సర్ కణాలపై మాత్రమే దాడిచేసి.. వాటిని నిర్మూలిస్తూ ఆరోగ్యకరమైన కణజాలం అభివృద్ధికి ఈ చికిత్సా విధానం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు భయపడకండి. క్యాన్సర్ వ్యాధికి చికిత్స చేయడంలో అవసరాన్ని బట్టి రేడియేషన్ థెరపీని ఉపయోగిస్తుంటారు. ఊపిరితిత్తుల క్యాన్సర్లలో కీమోథెరపీ (మందులతో చికిత్స)తో పాటుగా కొన్నిసార్లు రేడియేషన్ అవసరం అవుతుంటుంది. శ్వాస కోశాల్లోని క్యాన్సర్ గడ్డ ఛాతి భాగాన్ని దాటి విస్తరించకుండా ఆపరేషన్ చెయ్యడం, రేడియేషన్ థెరపీని ఉపయోగించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. దీనివల్ల క్యాన్సర్ శరీరంలోని ఇతర భాగాలకు విస్తరించకుండా సమర్థంగా అరికట్టగలుగుతారు. వైద్యనిపుణులు జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే మీ అమ్మ గారికి రేడియేషన్ థెరపీని సిఫార్సు చేసి ఉంటారు. అందువల్ల ఆందోళన చెందకుండా చికిత్సను కొనసాగించండి, ఫలితాలు బాగానే ఉంటాయి.

డాక్టర్. కె. కిరణ్ కుమార్
సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్
యశోద హాస్పిటల్స్,
సోమాజిగూడ, హైదరాబాద్.

807
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles