రుచుల గడ్డ!


Thu,February 28, 2019 12:02 AM

Sweet
కందగడ్డ.. మొరం గడ్డ.. చిలగడ దుంప.. ఇలా ఎన్ని పేర్లతో పిలిచినా నేనేనంటూ ఊరిస్తుంది.. ఇంగ్లిష్‌లో ముద్దుగా స్వీట్‌పొటాటో అన్నా సరే.. ఈ ఎండలో కమ్మగా నోట్లో కరిగిపోతుంది.. శివుడికి ప్రీతిపాత్రంగా చెప్పుకొనే ఈ గడ్డ...మానవాళికీ మరింత దగ్గరయింది.. ఈ సీజన్‌లో వచ్చే ఈ గడ్డతో.. ఎన్నెన్ని రుచులను వండి వడ్డించొచ్చో చూడండి..

స్వీట్ పొటాటో హల్వా

Sweet-PotatoHalwa

కావాల్సినవి :

కందగడ్డలు : 4
కార్న్‌మీల్ : ఒక కప్పు
నెయ్యి : 2 టీస్పూన్స్
జీడిపప్పులు : 10
కిస్మిస్ : 10
యాలకుల పొడి : 2 టీస్పూన్స్
బెల్లం తురుము : ఒక కప్పు
కొబ్బరి తురుము : అర కప్పు
బాదం పప్పులు : అర కప్పు

తయారీ :

స్టెప్ 1 : కార్న్‌మీల్‌లో నీళ్లు పోసి పావు గంట అలాగే ఉంచాలి. ఆ తర్వాత రెండు నిమిషాలు మైక్రో ఓవెన్‌లో బేక్ చేసి తీయాలి. ఈలోపు కందగడ్డలను ఉడికించి, పై పొట్టును తీసి తురిమి పెట్టుకోవాలి.
స్టెప్ 2 : కడాయిలో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించాలి. ఇవి వేగాక ఇందులో కందగడ్డ తురుము వేసి రంగు మారే వరకు కలుపుతుండాలి.
స్టెప్ 3 : దీంట్లో కార్న్‌మీల్, యాలకుల పొడి వేసి రెండు నిమిషాలు కలుపాలి. ఇందులోనే బెల్లం తురుము వేసి అది కరిగే వరకు కలుపుతూనే ఉండాలి.
స్టెప్ 4 : చివరగా కొబ్బరి తురుము, నెయ్యి వేసి కలిపి దించేయాలి. పై నుంచి బాదం పప్పులను చిన్నగా కట్ చేసి గార్నిష్ చేయాలి. రుచికరమైన హల్వా మీ ముందుంటుంది.


స్వీట్ పొటాటో చాట్

SWEET-POTATOCHAAT

కావాల్సినవి :

కందగడ్డలు : 2
కార్న్‌ఫ్లోర్ : ఒక టీస్పూన్
బియ్యం పిండి : ఒక టీస్పూన్
చాట్ మసాలా : అర టీస్పూన్
జీలకర్ర పొడి : అర టీస్పూన్
పచ్చిమిర్చి : 2
ఎండుమిర్చి : 2
దొడ్డు ఉప్పు : పావు టీస్పూన్
ఆమ్‌చూర్ పొడి : అర టీస్పూన్
గరం మసాలా పొడి : అర టీస్పూన్
నిమ్మకాయ : 1
గ్రీన్ చట్నీ : అర కప్పు
స్వీట్ చట్నీ : అర కప్పు
సేవ్ : అర కప్పు
కొత్తిమీర : చిన్న కట్ట
ఉల్లిగడ్డ : 1
ఉప్పు, నూనె : తగినంత

తయారీ :

స్టెప్ 1 : కందగడ్డల పై పొట్టు తీసి ఉడికించాలి. ఆ తర్వాత వాటిని అర అంగుళం మందంతో గుండ్రంగా కట్ చేసి పెట్టుకోవాలి.
స్టెప్ 2 : వీటిని ఒక గిన్నెలో వేసి కొద్దిగా కార్న్‌ఫ్లోర్, బియ్యం పిండి చల్లి పెట్టుకోవాలి. పైన పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి ముక్కలు, దొడ్డు ఉప్పు, చాట్‌మసాలా, జీలకర్ర పొడి, ఆమ్‌చూర్ పొడి, గరం మసాలా చల్లాలి.
స్టెప్ 3 : నిమ్మరసం పోసి కలిపి కాసేపు అలాగే ఉంచాలి. ఇప్పుడు పెనం పెట్టి కొద్దిగా నూనె వేసి ఈ ైస్లెస్‌ని వేయించాలి.
స్టెప్ 4 : వీటిని ఒక ప్లేట్‌లో నీట్‌గా ఆరెంజ్ చేయాలి. పైన గ్రీన్ చట్నీ, ఉల్లిపాయ ముక్కలు, చాట్‌మసాలా, సేవ్, స్వీట్ చట్నీ పోసి, కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. వీటిని వెంటనే లాగించేస్తే యమ టేస్టీగా ఉంటాయి.


స్వీట్ పొటాటో టీ కేక్

Sweet-Potato

కావాల్సినవి :

కందగడ్డలు : 200 గ్రా.
బటర్ క్యూబ్స్ : 4
కోడిగుడ్లు : 2
చక్కెర : 3/4 కప్పు
మైదా : ఒక కప్పు
వెనీలా ఎసెన్స్ : పావు టీస్పూన్
బేకింగ్ సోడా : పావు టీస్పూన్
బేకింగ్ పౌడర్ : అర టీస్పూన్

తయారీ :

స్టెప్ 1 : కుక్కర్‌లో కందగడ్డలు వేసి కొన్ని నీళ్లు పోసి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉంచి దించేయాలి. ఆ తర్వాత పొట్టు తీసి మెత్తటి గుజ్జులా చేసుకోవాలి.
స్టెప్ 2 : ఒక గిన్నెలో చక్కెర, బటర్, కోడిగుడ్లు వేసి బాగా కలుపాలి. ఇందులోనే వెనీలా ఎసెన్స్, బేకింగ్ సోడా, బేకింగ పౌడర్ వేసి ఉంచాలి.
స్టెప్ 3 : ఇందులో మెత్తగా చేసి కందగడ్డ మిశ్రమం వేసి కలిపిన తర్వాత బేకింగ్ ట్రేలో ఈ మిశ్రమాన్ని వేయాలి. 180 డిగ్రీ సెంటీగ్రేడ్‌ల వద్ద 20 నుంచి 25 నిమిషాల పాటు బేక్ చేయాలి.
స్టెప్ 4 : కాస్త చల్లారనిచ్చి బయటకు తీసి మనకు నచ్చినట్లుగా అలంకరించుకొని తినేయొచ్చు. తియ్యని ఈ కేక్ కచ్చితంగా నోరూరిస్తుంది.

-సంజయ్ తుమ్మ
-సెలబ్రిటీ చెఫ్

880
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles