రియల్ రాకింగ్..


Sat,February 16, 2019 01:42 AM

-దేశంలోనే హైదరాబాద్ రియల్ రంగానిది వేగవంతమైన వృద్ధి
-ఈ రంగానికి ఎప్పటిలాగే తెలంగాణ ప్రభుత్వం మద్దతు
-గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ నిరంతర కృషి
-త్వరలోనే రీజినల్ రింగ్ రోడ్డు
-రియల్ రంగానికి పరిశ్రమ హోదా రావాల్సిందే
-ఇన్సూరెన్స్ ఫండ్‌ను అతిత్వరలో ఏర్పాటు చేయాలి

Mp-Kavitha
ఐదేండ్లలో తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం గణనీయమైన అభివృద్ధి చెందిందని ఎంపీ కవిత అన్నారు. దేశంలో ఏ ఇతర నగరం కూడా నమోదు చేయని వృద్ధిని తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం నమోదు చేసిందని తెలిపారు. ఈ విషయంలో దేశ రాజధాని ఢిల్లీ మైనస్ 60 శాతం వృద్ధితో తిరోగమనంలో ఉండగా, హైదరాబాద్ 32 శాతంతో వేగవంతమైన వృద్ధిని నమోదు చేసిందన్నారు. సీఎం కేసీఆర్ రూపంలో సమర్థవంతమైన, సుస్థిరమైన నాయకత్వం ఉండటం, ప్రభావవంతమైన, వ్యాపార అనుకూల విధానాలు అమలు చేయడం ఈ వృద్ధికి కారణమని అభిప్రాయపడ్డారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో నిర్వహిస్తున్న ఏడవ ఎడిషన్ క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోను శుక్రవారం ఎంపీ కవిత ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మన దేశంలో వ్యవసాయ రంగం తర్వాత రియల్ ఎస్టేట్ రంగమే ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న రియల్ ఎస్టేట్ డెవలపర్లకు ప్రభుత్వాలు ప్రాముఖ్యతను ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగానికి ఎప్పటిలాగే తన మద్దతును కొనసాగిస్తుందని చెప్పారు. రియల్ ఎస్టేట్ రంగానికి పరిశ్రమ హోదా కల్పించాలని ఉన్న డిమాండ్‌కు తన మద్దతు ఉంటుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లడంలో తన వంతు కృషి చేస్తానని హామి ఇచ్చారు.

సీఎంగా బాధ్యతలు తీసుకున్నపుడు కేసీఆర్ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, ప్రజలపై నమ్మకం ఉంచి రాష్ట్రాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, ప్రస్తుతం అవి మంచి ఫలితాలిస్తున్నట్లు చెప్పారు. వ్యాపార అనుకూల విధానాల్లో భాగంగా అమలు చేస్తున్న టీఎస్‌ఐపాస్ వల్ల ప్రపంచ స్థాయి కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చాయని, పరోక్షంగా ఇది రియల్ ఎస్టేట్ రంగ ప్రోత్సాహానికి దారి తీస్తున్నదన్నారు. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దడంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ తరహా కృషి చేయలేదన్నారు.

స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ అండ్ ఎలివేటెడ్ (ఎస్‌ఆర్‌డీపీ), హైదరాబాద్ చుట్టూ కొత్త జిల్లాల ఏర్పాటు, మెట్రో మార్గం పూర్తి వంటి చర్యలు నగరాభివృద్ధికి సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యల్లో ముఖ్యమైనవని చెప్పారు. ప్రజలకు లబ్ధి చేకూర్చే పనులు చేస్తారని, మరింత పారదర్శకంగా ఉంటారనే ఉద్దేశ్యంతోనే తెలంగాణ ప్రభుత్వం వ్యాపారవేత్తలకు ఎప్పుడూ మద్దతుగా నిలుస్తున్నదని ఎంపీ కవిత అన్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద హరిత ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిందని, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వామ్యం కావాలని కోరారు. హరితహారంలో భాగంగా క్రెడాయ్ పాల్గొని హైదరాబాద్ యూనివర్సిటీలో పెద్ద సంఖ్యలో మొక్కలు పెంచడం పట్ల ఎంపీ కవిత ప్రశంసలు కురిపించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచేందుకు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎస్ రాంరెడ్డి, జనరల్ సెక్రెటరీ పి.రామకృష్ణారావు, ఉపాధ్యక్షుడు ఆదిత్య గౌరా, ఆనంద్ రెడ్డి, ఎంఎస్ ఆనంద్‌రావు, డి మురళీకృష్ణా రెడ్డి, ఉమ్మడి కార్యదర్శి మురళీమోహన్, రాజశేఖర్‌రెడ్డి, గుమ్మి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Kavitha

త్వరలో రీజినల్ రింగ్ రోడ్డు..

హైదరాబాద్‌కు మరొక మణిహారంగా నిలవనున్న రీజినల్ రింగ్ రోడ్డు విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నదని చెప్పారు. 368 కిలోమీటర్ల మేర రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ రింగ్ రోడ్డుకు కేంద్ర ప్రభుత్వం దాదాపుగా అన్ని అనుమతులిచ్చినట్లు చెప్పారు. రూ. 1500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలను ఈ నూతన రోడ్డుతో అనుసంధానం చేస్తామని తెలిపారు. ఈ రోడ్డు పూర్తయితే రియల్ ఎస్టేట్ రంగంలో సరికొత్త ఉత్సాహం నెలకొంటుందన్నారు.

అందుబాటు ధరల గృహాలను నిర్మించాలి..

అందుబాటు ధరల్లో లభ్యమయ్యే గృహాలను నిర్మించాలని, ఈ మేరకు కొత్త వెంచర్లతో ముందుకు రావాలని ఎంపీ కవిత కోరారు. ప్రభుత్వం తరపున సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ప్రభుత్వ లక్ష్యంలో భాగస్వాములుగా అవ్వాలని, దీన్నొక బాధ్యతగా భావించాలని సూచించారు. తెలంగాణలోని ప్రతి పేద వాడికి సొంతిళ్లు ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వ డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం చేపట్టిందన్నారు. ఆర్థికంగా వెనుబడిన వారి కోసం హైదరాబాద్‌లో లక్ష ఇండ్ల నిర్మాణం పూర్తి చేసిందన్నారు.
Kavitha1

లేబర్ సమస్యలకు పరిష్కారం..

ఒడిషా, బీహార్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి ఎంతో మంది గృహ నిర్మాణ కార్మికులు నగరానికి వలస వస్తున్నారని, అయితే అనుకోకుండా జరుగుతున్న ప్రమాదాల వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. ప్రభుత్వం, రియల్ ఎస్టేట్ రంగం కలిసి భాగస్వామ్యంగా ప్రత్యేకంగా ఒక ఇన్సురెన్స్ ఫండ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. భవన నిర్మాణ కూలీలను వినియోగించుకుంటున్న డెవలపర్లు వారికి సాయం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సమస్యపై క్రెడాయ్ నాయకత్వం సీరియస్‌గా దృష్టి సారించాలని ఎంపీ కవిత సూచించారు.

150 స్టాళ్లలో 15 వేలకు పైగా ప్రాపర్టీలు..

మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రాపర్టీ షోలో 150 మందికి పైగా డెవలపర్లు, 15వేలకు పైగా ప్రాపర్టీలను ప్రదర్శిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్పులు, అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, వాణిజ్య సముదాయాలు వంటివి ప్రతి ఒక్కరి అవసరాలు, బడ్జెట్‌కు తగినట్లుగా ఉన్నాయి. వీటితో పాటు పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఆకర్షణీయమైన గృహరుణ పథకాల్ని ప్రత్యేకంగా అందజేస్తున్నాయి. ఇందులో ఏర్పాటు చేసిన బీ2బీ లాంజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పలు సంస్థలకు చెందినవారు నగరంలోని సుప్రసిద్ధ డెవలపర్లతో సంభాషించే అవకాశం కల్పించారు. ఒక లక్ష మంది ఈ ప్రాపర్టీ షోను సందర్శిస్తారని క్రెడాయ్ నిర్వహకులు అంచనా వేస్తున్నారు.

573
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles