రాచకొండ రమ్మంటున్నది!


Sun,March 3, 2019 01:41 AM

మనలో చాలామందికి.. ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా తెలుసు. కానీ.. ద గ్రేట్ వాల్ ఆఫ్ తెలంగాణ తెలుసా? తెలియదు. ఎందుకు తెలియదు? మన చరిత్రను.. పుటల్లో కాకుండా చెద పుట్టల్లో పడేశారు. సంస్థానాలకు.. శ్మశానాలకు తేడాలేనంతగా విధ్వంసం చేశారు. రాచకొండను.. ఓ రాతికొండగా చిత్రీకరించి గ్రేట్ వాల్ ఆఫ్ తెలంగాణను తెలియకుండా చేశారు. ఇక ఆగిపోవద్దు. మన చరిత్రను మనమే రాసుకుందాం.. మన సంస్థానాలను మనమే పరిరక్షించుకుందాం. రండి.. మార్చి 3వ తేదీ నుంచి మూడ్రోజుల పాటు రాచకొండ సాంస్కృతిక.. పర్యాటక ఉత్సవాలు జరుపుకొందాం!
Rachakonda
శిథిల శిలా శాసనాలు.. ఒరిగిన కోట కుడ్యాల సాక్షిగా రాచకొండ రమణీయత ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నాయి. ఒక్కో నిర్మాణంలో ఒక్కో వైశిష్ట్యం. రాజుల ఏలుబడిలో తెలంగాణమెంతటి సుభిక్షమో.. సురక్షితమో.. సస్యశ్యామలమో వాటిని బట్టే తెలుస్తుంది. ఎంతో ఘనమైన చరిత్ర.. ఎన్నో వైభవాలు కలగలిసిన రతనాల కొండ.. రాచకొండను పరిరక్షిస్తే.. పర్యాటకంగా తీర్చిదిద్దితే రేపటి తరానికైనా తరగని వారసత్వ సంపదను ఇచ్చినవాళ్లం అవుతాం. పదండి ఉత్సవాలకు.

ఎక్కడ?

ఎక్కడైతే రేచర్ల పద్మనాయకుల ఏలుబడిలో రేయింబవళ్లు వెలుగు జిలుగులు ప్రసరించాయో.. ఎక్కడైతే రాజసం ఉట్టిపడి రాతిగుట్టలన్నీ రాజ్యానికి కాపలాగా ఉన్నాయో.. ఎక్కడైతే రాజ్య ప్రజలు రాజాచలాన్ని రాచకొండ పట్నం అని కీర్తిస్తూ జేజేలు పలికారో అక్కడే.. ఆ రాచకొండ కోటలోనే రాచకొండ సాంస్కృతిక, పర్యాటక ఉత్సవాలు జరుగుతున్నాయి.

ఎప్పుడు?

ఏ ఘడియన రాజాచలం శైవక్షేత్రాలకు కేంద్రమైందో.. ప్రతి ఆలయంలోనూ వీరభద్రుడు.. గణపతి.. శివలింగాలు ఉన్నాయి. శివారాధన చేసే రాచకొండ రాజుల అభీష్టానికి అనుగుణంగానే గత రెండేండ్లుగా రాచకొండ పర్యాటక ఉత్సవాలు శివరాత్రి పర్వదినం సందర్భంగానే ప్రారంభం అవుతున్నాయి. ఈ సారి మార్చి 3, 4, 5వ తేదీల్లో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి.

ఎలా నిర్వహిస్తారు?

కాకతీయ రాజులకు సామంతులైన రేచర్ల పద్మనాయకులు రాచకొండ రాజ్యాన్ని ఎలా స్థాపించారు? ఎప్పుడు నిర్మించారు? బహమనీ సుల్తానులకు.. విజయనగర రాజులకు మధ్య రాచకొండ ఎలా వారధిగా నిలిచి సామరస్యానికి కృషి చేసింది? శత్రువులెవరూ లోపలికి రాకుండా కోటను ఎలా నిర్మించారు? వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ఈ కోటలోని రాళ్ల వరుస ఇంకా చెక్కు చెదరలేదు. శిలలను చెక్కడంలో శిల్పుల సాంకేతికతా ప్రతిభ ఎలాంటిది? వంటి విషయాలకు సంబంధించిన ప్రసంగాలు.. విశ్లేషణలు.. పుస్తకావిష్కరణలు.. కళా ప్రదర్శనల ద్వారా రాచకొండ వైభవాన్ని చాటే ప్రయత్నం చేయనున్నారు.

ఏ రోజు.. ఏ కార్యక్రమం?

మార్చి 3వ తేదీన.. జ్యోతి ప్రజ్వలనతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. తర్వాత అతిథుల స్వాగత కార్యక్రమాలు ఉంటాయి. అనంతరం అతిథుల ప్రసంగాలు.. రాచకొండ చరిత్రపై విశ్లేషణ.. రాచప్ప సమితి అధ్యక్షుడు బద్దుల కృష్ణ కుమార్ వచన కవితా సంపుటి ఆవిష్కరణ, ప్రముఖ రచయిత నగేష్ బీరెడ్డి రాసిన రాచకొండ చరిత్ర పుస్తకావిష్కరణ వంటి కార్యక్రమాలు ఉంటాయి. మార్చి 4వ తేదీన.. రాచకొండ కట్టడాలపై ఫొటో ప్రదర్శన.. పేరిణి నృత్యం.. ఒగ్గు కళాకారుల ప్రదర్శన వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. మార్చి 5వ తేదీన.. ప్రాచీన సింధుయక్షగానం.. నాటక ప్రదర్శన.. కళాకారులకు సన్మాన కార్యక్రమాలు ఉంటాయి.
Rachakonda3

ఎవరి ఆధ్వర్యంలో?

చరిత్రను.. చారిత్రక నిర్మాణాలను పరిరక్షించడంలో తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నది. చరిత్ర అధ్యయన కారులను.. చరిత్ర గురించి రాసే యువ రచయితలను ప్రోత్సహిస్తున్నది. రాచకొండ పరిరక్షణను బాధ్యతగా తీసుకున్న ప్రభుత్వం రెండేండ్లుగా సాంస్కృతిక, పర్యాటక ఉత్సవాలకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ భాషా సాంస్కృతిక, రాచకొండ పరిరక్షణ (రాచప్ప) సమితి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు ప్రణాళికా బద్ధంగా జరుగుతున్నాయి.

ఉత్సవాలు ఎందుకు?

రాచకొండలోని ప్రతీ రాయికి ఓ నేపథ్యం ఉంది. సముద్ర మట్టానికి 600 మీటర్ల ఎత్తులో నిర్మించిన రాచకొండ కోట ఒక అద్భుతం. 40 కిలోమీటర్ల మేర గ్రేట్ వాల్ ఆఫ్ తెలంగాణగా పిలువబడే గోడ ఉండడం ఇక్కడి మరో విశేషం. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని కాలంలోనే మూడంచెల గస్తీ వ్యవస్థ కలిగిన అంతఃపురం.. రాజమందిరం.. రాణివాసం ఉండటం అత్యద్భు తం. 10 గుట్టల నడుమ శత్రుదుర్భేధ్యంగా.. పకడ్బందీగా రాజుగారి గుట్టలో కోట ఉంటుంది. ఆనాడే వాస్తును పాటించి కట్టిన ఇండ్లు.. ఆలయాలు ఉన్నాయి. ఆలయాల రాతి శిలలపై శిల్పాలు అద్భుతంగా చెక్కిన ప్రకృతి చిహ్నాలు ఉన్నాయి. సాహిత్య కళా పోషణలకు నిలయమై విరాజిల్లిన ఈ కోటలో పోతనామాత్యుడు బోగినీ దండకం రాశాడు. కొండలపైనే చెరువులు.. నీటి కొలను లు తవ్విన ఆనవాళ్లు ఉన్నాయి. అశ్వాలతో.. గజములనెక్కి రాజు లు సంచరించిన ఆనవాళ్లు ఉన్నాయి.

అంతుబట్టని రీతిలో నిర్మించిన సంకెళ్లబావి.. రాజుగారి గుట్ట ప్రాంతంలో వసంతోత్సవ కళా భవనం నేటికీ కనిపిస్తున్నాయి. వీటన్నింటికీ గొప్ప చరిత్ర ఉంది. రేచర్ల ప్రభువులు సాహిత్యకళా పోషణలు శిఖరాయమానమై తెలుగు వైభవానికి.. శోభకు కారణమయ్యాయి. అవన్నీ నేటి తరానికి.. రాబోయే తరాలకు తెలియకుండానే పోతే.. ఈ రాజ్యము నేలిన రాజుల చరిత్ర.. రాచకొండ పట్నపు వైభవం.. రాజాచలపు వీరత్వం.. ధీరత్వం.. శూరత్వం.. ఈ కోటలకు రాళ్లెత్తిన ఈ ప్రాంతపు మట్టి మనుషుల నెత్తుటి ధారల విలువ ఉట్టిగనే మట్టిలో కలిసిపోతాయి. విధ్వంసమైందీ.. వివక్షకు గురైంది అని ఆవేదన చెందే బదులు పరిరక్షించుకుంటే పదికాలాల పాటు స్మరించుకునే అవకాశం ఉంటుంది. పర్యాటకంగానైనా రాచకొండను అభివృద్ధి చేస్తే ఈ సంస్థాన చరిత్ర భాసిల్లడానికి.. పురోగతి సాధించడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈ సాంస్కృతిక, పర్యాటక ఉత్సవాలకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం.
Rachakonda1

రాష్ట్రస్థాయి ఉత్సవంగా ప్రమోట్ చేయాలి

రాచకొండపై అధ్యయనాలు చాలానే జరుగుతున్నాయి. కానీ ఇంకా జరగాలి. అవన్నీ రాజాచలం అభివృద్ధికి దోహదం కావాలి. పిల్లలకు దీనిని ప్రాథమిక స్థాయిలోనే పరిచయం చేయాలి. డీఈఓ లెవల్‌లో దీనిపై అవగాహన కల్పించి పర్యాటక.. సాంస్కృతిక కేంద్రంగా మార్చాలి. ప్రతీ సంవత్సరం క్యాలెండర్ ఈవెంట్ విడుదల చేయాలి. కోటలన్నీ అనుసంధానం చేస్తూ ఉత్సవాల పరంపరను కొనసాగించాలి. రాచకొండ ఉత్సవాలు అనేది ఏదో అంతర్జిల్లా ఉత్సవాలుగా కాకుండా రాష్ట్రస్థాయి ఉత్సవాలుగా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. క్రమంగా దానికి జాతీయస్థాయిలో ప్రచారం కల్పించాలి. మీడియా.. సంస్థలు ఉత్సవాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఫైనల్‌గా రాచకొండ ఉత్సవాలు సమగ్రంగా.. సమీకృత విధానంలో రూపొందిస్తే అభివృద్ధి ఎంతో దూరంలో లేదని చెప్పొచ్చు.

ఎలా చేరుకోవాలి?

-ఎల్బీనగర్ నుంచి నాగార్జునసాగర్ రహదారి మీదుగా ఇబ్రహీంపట్నం.. అట్నుంచి మంచాల మీదుగా వెళితే తిప్పాయిగూడెం వస్తుంది. ఇక్కడి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో రాచకొండ కోట ఉంది.
-విజయవాడ హైవే మార్గంలో చౌటుప్పల్ రాకముందు కొయ్యలగూడెం నుంచి మళ్లీ నాగారం.. పీపల్ పహాడ్ మీదుగా వెళ్తే 15 కిలోమీటర్ల దూరంలో రాచకొండ కోట ఉంది.
Rachakonda4

రాచప్ప తపన

రాచకొండను పరిరక్షించాలని స్వచ్ఛందంగా ముందుకొచ్చిన సంస్థ రాచకొండ పరిరక్షణ సమితి (రాచప్ప). రాచకొండ సాంస్కృతిక, పర్యాటక ఉత్సవాల ఆలోచనను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి.. ఉత్సవాలు జరిగేట్లు చేయడంలో ఈ సంస్థ కృషి మరువలేనిది. కోట సమీపంలో వెలిసిన శివలింగం వద్ద ప్రతీ సోమవారం రాచప్ప ఆధ్వర్యంలోఅన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సంవత్సరం పొడవునా పర్యాటకులను.. అధ్యయనకారులను.. చరిత్రకారులను.. రచయితలను.. ఔత్సాహికులను ఆహ్వానిస్తూ రాచకొండపై విస్తృత ప్రచారం చేస్తూ తనవంతు పాత్ర పోషిస్తున్నది రాచప్ప సమితి.

రేపటి పౌరులే.. అతిథులు

మన చరిత్ర శీర్షికన నమస్తే తెలంగాణ బతుకమ్మలో 90 వారాల పాటు జర్నలిస్ట్ నగేష్ బీరెడ్డి వ్యాసాలు రాశారు. అందులో కొంత భాగాన్ని కాకతీయుల ప్రస్థానం పేరుతో తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఇటీవలే పుస్తక రూపంలోకి తీసుకువచ్చింది. కాకతీయుల అనంతరం రాజ్యమేలిన రేచర్ల పద్మనాయకుల గురించి తాజాగా రాచకొండ పుస్తకాన్ని నగేష్ వెలువరిస్తున్నారు. రాచకొండ.. పద్మనాయకులు, సంస్థానాలు అనే ఈ పుస్తకాన్ని రాచకొండ సాంస్కృతిక, పర్యాటక ఉత్సవాల్లో భాగంగా ఆవిష్కరించనున్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. ఈ చరిత్ర రచన ఆ రేపటి తరం కోసమే. అందుకే వారినే ప్రముఖులుగా గుర్తిస్తూ బాలలతోనే పుస్తకాన్ని ఆవిష్కరింపజేస్తున్నారు. 40 మంది నందివనపర్తి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రాచకొండ కోటలోనే పుస్తక ప్రతులను అందించి విజ్ఞానంతో పాటు విహార యాత్రానుభవాన్ని కలిగించనున్నారు. నగేష్ బీరెడ్డి రాచకొండపై డాక్యుమెంటరీని కూడా రూపొందిస్తున్నారు. ఎక్కువ మందికి ఆసక్తి కలిగించాలనే ఉద్దేశంతో ఆయన ఈ పుస్తకానికి, సినిమాలకు చేసినట్లుగా మోషన్ పోస్టర్, టీజర్, ట్రైలర్‌లను కూడా విడుదల చేశారు.
Rachakonda2

సాహిత్యం విలసిల్లిన నేల

తెలంగాణను ఇంతవరకు ఉద్యమాల నేలగానే చూశాం. ఇది కోటల నేల కూడా. రాచకొండ అలాంటి చారిత్రక ప్రాంతం. సాంస్కృతిక.. చారిత్రక అంశాలను సుసంపన్నం చేసిన సంస్థానం ఇది. ఇక్కడి కోటలు.. వాటిలోని వాస్తు శిల్పాలను అధ్యయనం చేయడం ద్వారా ఆ కాలం సామాజిక.. రాజకీయ.. ఆర్థిక.. సాంస్కృతిక పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. రాచకొండలో సాహిత్యం.. సంస్కృతి విలసిల్లాయి. అందుకే రాచకొండకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
-మామిడి హరికృష్ణ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు

పరిరక్షణ బాధ్యత

ప్రభుత్వం పర్యాటక ఉత్సవాలు నిర్వహిస్తుండటంతో రాచకొండ వైభవం రాష్ట్రమంతటా తెలుస్తున్నది. ప్రభుత్వ సహకారంతోనే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రాచకొండ పరిరక్షణ గురించి పదేళ్ల నుంచి అధ్యయనం చేస్తున్నా. ఇదే వృత్తిగా మార్చుకున్నా. న్యాయవాద వృత్తిలో ఉన్నప్పటికీ రాచకొండను వదిలి వేరే పనిచేయలేకపోయాను. యువకుడిగా ఉన్నప్పుడే రాచకొండపై బాధ్యతగా ప్రేమ ఏర్పరుచుకున్నా.
-బద్దుల కృష్ణకుమార్, రాచప్ప సమితి అధ్యక్షుడు

-దాయి శ్రీశైలం


Rachakonda5

1945
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles