రంగస్థలంపై.. మన ఒగ్గుకథ!


Mon,April 8, 2019 11:53 PM

-తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, తెలుగు భాషల్లో ఎల్లమ్మ ఒగ్గుకథ
-30 రోజులపాటు కఠోర సాధన
-తెలుగులో తొలిసారి ఒగ్గుకథ నాటిక రూపంలో ప్రదర్శన
-గంటన్నర సేపు నిర్విరామంగా నాటిక ప్రదర్శన

ఒగ్గుకథ.. డిల్లెం బల్లెం సప్పుళ్లతో.. గజ్జెలమోతలతో కథ చెప్తుంటే.. ఆ జోష్.. ఊపు.. మాటల్లో చెప్పలేం. తెల్లవార్లూ ఒగ్గుకథ చెప్తుంటే తెలంగాణ పల్లెల్లో నిద్రను లెక్కచేయకుండా వినేవారుంటారు ఇప్పటికీ. ఓ వేదిక ఏర్పాటు చేసి, లేదంటే.. పందిరి వేసి దాని కింద చెప్పే ఒగ్గుకథ ఇప్పుడు రంగస్థలం ఎక్కనున్నది. కథ నాటక రూపంలోకి మారనుంది. ఎల్లమ్మ ఒగ్గుకథ ఈ రోజు రవీంద్రబారతిలో ప్రదర్శించనున్నారు. ఆ విశేషాలివి..

RAVI
రేణుకా ఎల్లమ్మ.. ఈ పేరు తెలియని వారు తెలంగాణలో చాలా అరుదు. ఎల్లమ్మ ఒగ్గుకథ చెప్తున్నారంటే.. తెల్లవార్లూ నిద్రగాసి మరీ.. వింటారు. ఆ కథలో ఎల్లమ్మ పడే బాధలు, తండ్రి ఆచూకీ కోసం పరుశురాముడు తల్లిని పెట్టే గోసలు చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటారు. ఒక స్త్రీ జీవితాన్ని కళ్లకు కట్టే ఈ కథలో.. ఎల్లమ్మ పాత్ర దైవసమానం. సాక్షాత్త్తు ఈశ్వరుడి కూతురిగా ఎల్లమ్మను ప్రార్థిస్తారు. ఎల్లమ్మ పుట్టుక, కల్యాణం, కష్టాలు అన్నీ ఒగ్గుకథలో చెప్తుంటే కండ్ల వెంట నీళ్లొస్తాయి. ఆ కథను ఇప్పుడు ఒగ్గురవి నాటిక రూపంలోకి మార్చి ప్రదర్శిస్తున్నాడు.
RAVI1

ఎలా ఉంటుంది?

ఒగ్గుకథ మౌఖిక కళారూపం. కథాగానం చేస్తూ.. మధ్యమధ్యలో పాటను వివరిస్తుంటారు. కానీ.. ఈ ధర్మాగ్రహం డైలాగ్స్, ఒగ్గుబాణీ రూపంలో సాగిపోతుంది. కథాగానం రూపంలో ఉన్న ఒగ్గుకథను నాటిక రూపంలోకి మార్చి ప్రదర్శిస్తున్నారు. డాక్యుమెంటైజేషన్ రూపంలో ఒగ్గుకథను ప్రపంచస్థాయిలో ప్రచారం చేయాలి, విస్తృతం చేయాలన్న ఆలోచనతో రవి ఈ ప్రదర్శన చేస్తున్నాడు. సాధారణంగా ఒగ్గుకథలో మహిళల పాత్రలు పురుషులే మేకప్ వేసుకొని చేస్తారు. కానీ.. ఈ ప్రదర్శనలో ఒగ్గుచరిత్రలోనే తొలిసారిగా ఆ పాత్రలను అమ్మాయిలే ప్రదర్శిస్తున్నారు. లైట్లు, కెమెరాలు, మల్టీమీడియా, ఎల్‌ఈడీ, లైవ్ మ్యూజిక్, లేజర్ లైట్స్ ఇలా అన్నింటికీ అంతర్జాతీయ స్థాయి సాంకేతికతను వాడుతున్నారు.

ఐదు భాషల్లో..

ఒగ్గుకథ అనేది కేవలం తెలుగు, అందులో తెలంగాణకు మాత్రమే పరిమితమైన కళారూపంగా ఉండేది. కానీ.. ఒగ్గు రవి దాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో థియేటర్ ఆర్ట్స్ సీటు కోసం కష్టపడ్డాడు. కొన్ని పరిస్థితుల దృష్ట్యా అది కుదరలేదు. ఆ తర్వాత కొన్నిరోజులకు అదే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకి గెస్ట్ ఫ్యాకల్టీగా వెళ్లాడు. ఈ క్రమంలోనే అక్కడ మెరికల్లాంటి థియేటర్ స్టూడెంట్స్‌ని గమనించాడు. వారిలోంచి ఐదు ప్రాంతాలకు చెందిన వారిని ఎంచుకొని ఐదు భాషల్లో వారికి ఒగ్గుకథను పరిచయం చేశాడు. రేణుకా ఎల్లమ్మ ఒగ్గుకథను నాటిక రూపంలో రాసి వారినే పాత్రధారులుగా ఎంచుకున్నాడు. దీంతో.. జాతీయ స్థాయిలో ఎల్లమ్మ ఒగ్గుకథ చర్చకు వచ్చింది. పలు రాష్ర్టాల వారికి ఆసక్తి ఏర్పడింది.

ప్రపంచంలో ఇప్పటి వరకు ఒగ్గుకథను నాటకరూపంలో ఎప్పుడూ ప్రదర్శించలేదు. ఇదే తొలిసారి. తెలంగాణకు సుపరిచితమైన ఒగ్గుకథను ధర్మాగ్రహం పేరుతో రంగస్థలానికి పరిచయం చేస్తున్నాడు ఒగ్గురవి. గంటన్నర నిడివి గల
ఈ ప్రదర్శన ఈరోజు సాయంత్రం 7 గంటలకు రవీంద్రభారతిలో జరుగనుంది.

ఇనిస్టిట్యూట్ పెడుతా..


RAVI2
ఒగ్గుకథను నాటకరూపంలోకి మలిచినప్పటికీ.. ఎక్కడ ఒగ్గుకథ ఆత్మ చెడలేదు. ఒగ్గుకథంటే తెలంగాణలో తెలియని వారు అరుదు. కాకపోతే ఇతర రాష్ర్టాలు, భాషల వారికి మన ఒగ్గుకథ తెలియదు. ప్రపంచవ్యాప్తంగా ఒగ్గుకథను ప్రచారం చేసి, పరిచయం చేయాలన్న ఆలోచనతోనే ధర్మాగ్రహం ప్రదర్శన చేస్తున్నా. దేశంలో థియేటర్ ఆర్ట్స్‌కి ప్రతిష్టాత్మకంగా భావించే ఎన్‌ఎస్‌డీలో సీటు కోసం ప్రయత్నించా. దురదృష్టవశాత్తు మిస్ అయింది. ఆ తర్వాత అక్కడికే గెస్ట్ ఫ్యాకల్టీగా వెళ్లా. ఇప్పుడు రాడార్‌కి వెళ్లాలన్నది నా ఆలోచన. కుదరకపోతే.. సొంతంగా శిక్షణా సంస్థ పెడుతా. దీనికి ప్రభుత్వం సహకరిస్తే ఒగ్గుకథ పదికాలాల పాటు బతికి ఉంటుంది.
- ఒగ్గు రవి, ధర్మాగ్రహం రచయిత, దర్శకుడు
-ప్రవీణ్‌కుమార్ సుంకరి

593
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles