యత్ర నార్యస్తు పూజ్యంతే..


Fri,March 8, 2019 12:30 AM

womens
ఒక మహిళ తన వృత్తిలో రాణిస్తే ఆ ప్రతిభ పదిమందికి ప్రేరణగా నిలుస్తుంది. ఒక మహిళ తన రంగంలో విజయం సాధిస్తే.. ఆ విజయం వందమందికి ఆదర్శమవుతుంది. ఒక మహిళ తన సేవల్ని ఉత్తమంగా అందిస్తే.. అది వెయ్యి మందికి స్ఫూర్తినిస్తుంది. ఆ ప్రేరణ.. ఆదర్శం.. స్ఫూర్తి మహిళల్ని సాధికారతక వైపు అడుగులు వేయిస్తాయి. సాధికారత అంటే..? సామాజిక.. ఆర్థిక.. రాజకీయ.. సాంస్కృతిక రంగాల్లో మహిళల అభివృద్ధి. విధాన పరమైన అంశాల్లో.. నిర్ణయాల్లో పురుషులతో సమాన అవకాశాలు.. హక్కులు కల్పించడం.. ప్రోత్సహించడం.. సన్మానించడం.. గౌరవించడం. తెలంగాణ ప్రభుత్వం ఇదే చేస్తున్నది. వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళామణుల్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతీ సంవత్సరం సత్కరించి మహిళా సాధికారత దిశగాఅడుగులు వేయిస్తున్నది. ఎప్పటిలా ఈ ఏడాది కూడా 14 రంగాల్లో మొత్తం 21 అవార్డులు అందిస్తున్నది. ఆ మహిళా మణుల పరిచయ సమాహారమిది.


పుడమి తల్లి పులకరించినట్టు

Mithali-Raj
పుట్టి పెరిగిన నేల తెలంగాణ. క్రికెట్‌లో ఓనమాలు నేర్చుకుంటున్నప్పటి నుంచి ఇప్పటిదాకా తెలంగాణతో అనుబంధం ఉన్నది. ఎన్నో అంతర్జాతీయ అవార్డులు అందుకున్నా.. లోకల్‌గా వచ్చిన అవార్డు, గుర్తింపు వేరుగా ఉంటాయి. పుడమి తల్లి పులకరించి, పలుకరించినట్టు అనిపిస్తుంది. నన్ను ఈ అవార్డుకు ఎంపిక చేసిన కమిటీకి ధన్యవాదాలు.
-మిథాలీ రాజ్, స్పోర్ట్స్


సంతోషంగా ఉంది

Premalatha
సాహిత్య రంగంలో 35 ఏండ్లుగా సేవలందిస్తున్నాను. జానపద సాహిత్య గాథలపై పీహెచ్‌డీ చేశాను. సిద్ధాంత వ్యాసం, తెలుగు స్త్రీ చిత్రాలు, జానపద విజ్ఞాన పరిశీలన, జానపద విజ్ఞానంలో స్త్రీ, అలోకనం మొదలూన పుస్తకాలు రాశాను. వాటిలో కొన్నింటికి తెలుగు యూనివర్సిటీ నుంచి అవార్డులు అందాయి. సాహిత్య రంగంలో నా వంతు సేవలు అందించాలన్నదే నా కోరిక. మహిళా దినోత్సవం సందర్భంగా అవార్డు రావడం సంతోషంగా ఉంది
- డాక్టర్ ప్రేమలత, సాహిత్య రంగం


మహిళల హక్కులే ముఖ్యం..

Bellam-madhavi
ఇప్పుడున్న సమాజంలో మహిళలు చాలావరకూ తమ హక్కులను కోల్పోతున్నారు. మహిళలు రాజకీయంగా, సామాజికంగా చైతన్యవంతులు కావాలి. అందుకోసం సావిత్రిబాయి పూలే సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. సుమారు 12 ఏండ్లుగా అనేక కార్యక్రమాలు నిర్వహించాను. ముఖ్యంగా మహిళలకు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సాకారం అందిస్తున్న. పలు రంగాలవైపు మహిళల్ని ప్రోత్సహించటం, సమస్యలపై అవగాహన కల్పించటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న. ఇప్పుడు ఈ అవార్డు రావడం తన బాధ్యతను మరింత పెంచింది.
-బెల్లం మాధవి, సామాజిక సేవ


అమ్మే దారి చూపింది.

keerthi-rani
ఆరేండ్లప్పుడే చూపు కోల్పోయాను. పదేండ్ల వరకూ ఏమీ తెలియకుండా పెరిగాను. తర్వాత అమ్మే ఆత్మ స్థయిర్యం నింపింది. సంగీతం నేర్పించింది. మరోవైపు చదువు పూర్తి చేశాను. ఇప్పుడు సితార్ కళాకారిణిగా గుర్తింపు పొందుతున్నాను. సుమారు ఇరవై ఏండ్లుగా ఈ రంగంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాను. సితార్‌తో పాటే గజల్, పియానోలో కూడా అనుభవం ఉంది. ఈ అవార్డు రావడం ఊహించలేదు. నన్ను గుర్తించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు
-కీర్తిరాణి, సితార్ కళాకారిణి


చిన్నప్పటి నుంచే...

ratna-sri
చిన్నప్పటి నుంచే నృత్యం చేయటం అంటే ఇష్టం. తర్వాత కూచిపూడి మీద ఆసక్తి పెంచుకున్నాను. బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ కూచిపూడిలోనే చేశాను. మాస్టర్స్‌లో కూచిపూడిలో బంగారు పతకాన్ని పొందాను. 2005లో కూచిపూడి సిద్ధాంత భోదిని పుస్తకాన్ని రాశాను. దేశవ్యాప్త సెమినార్లలో పాల్గొంటున్నాను. వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నాను. జాతీయ స్థాయిలో అవార్డులు, బంగారు పతకాలు పొందాను. మహిళా దినోత్సవం సందర్భంగా నృత్య కళారంగంలో ప్రభుత్వం నన్ను ప్రోత్సహించటం హర్షనీయంగా ఉంది.
-డాక్టర్ రత్నశ్రీ, కూచిపూడి నృత్యకళాకారిణి


మన కళలను బతికించాలె

shivamma
శారద కథలు చెప్పే నేపథ్యం ఉన్న కుటుంబం మాది. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులిచ్చే శారద కథల ప్రదర్శనలకు పోయేటోళ్లం. అప్పుడు ఈ విద్య నేర్చుకున్నం. తర్వాత సొంతంగా ప్రదర్శనలివ్వడం మొదలు పెట్టాం. సుమారు 60 ఏండ్లుగా దేశవ్యాప్తంగా శారద కథల ప్రదర్శనిలిస్తున్నాం. అంతరించిపోతున్న ఈ కళను భవిష్యత్ తరాలకు అందించాలి. మన కళలను బతికించాలి. మాకు ఈ అవార్డు ఇచ్చిన గవర్నమెంటుకు కృతజ్ఞతలు.
-జంగమ్మ, శారద కథలు

ఆదాబ్ తెలంగాణ

tasneem
ఉర్దూ జాతీయ భాష. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌గారికి నచ్చిన భాష. ఉర్దూ సాహిత్యంలో ఎంతోమంది కవిత్వం రాస్తున్నారు. ఒక మహిళా కవిని గుర్తించి ఈ అవార్డు ఇవ్వడమన్నది వారి విశాల హృదయానికి చిన్న ఉదాహరణ. ఇది నా ఒక్కరి విజయం కాదు.. మొత్తం తెలంగాణ ముస్లిం మహిళలకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నా.
-తస్నీమ్ జోవర్, ఉర్దూ సాహిత్యం


అత్యున్నత గౌరవం

sajida-khan
సంప్రదాయ ముస్లిం కుటుంబంలో పుట్టి సంగీత రంగంలో అడుగుపెట్టాను. సరిగమలు పేరుస్తూ సంగీతాన్ని సృష్టిస్తూ సౌండ్ ఇంజినీర్‌గా నాలుగు గోడల మధ్యన ఉన్న స్టూడియోలోనే ఉంటాను. నా ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తూ భారత ప్రభుత్వం అత్యున్నత గౌరవమైన రాష్ట్రపతి అవార్డుతో సత్కరించింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మహిళా దినోత్సవ అవార్డును ప్రకటించడం గర్వంగా ఉన్నది.
- సాజిదా ఖాన్, ఆడియో ఇంజినీరింగ్


కొత్త రంగం.. కొత్త అనుభవం

bharati
ఆరేళ్ల నుంచి మోటార్ సైకిల్ అడ్వెంచర్ రంగంలో నా పని నేను చేసుకుంటూ పోతున్నాను. ఏరోజూ గుర్తింపు కోసమో దేనికోసమో ప్రయత్నించలేదు. మిగతా అన్ని రంగాలను గుర్తించినట్టే అడ్వెంచర్ రంగాన్ని గుర్తించి అవార్డు ప్రకటించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇలాంటి అవార్డులిచ్చి గుర్తింపునివ్వడం వల్ల మరింత ముందుకెళ్లడానికి అవకాశం ఉంటుంది.
-జై భారతి, అడ్వెంచర్


కళాకారులను ప్రోత్సహిస్తూ..

padmalaya-acharya
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి కళలు, కళాకారులకు సముచిత స్థానం ఇస్తున్నది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు వచ్చినప్పటి నుంచి కళలను గౌరవిస్తూ, కళాకారులను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. హరికథను గుర్తించి నన్ను ఈ అవార్డుకు ఎంపిక చేయడాన్ని హర్షిస్తున్నా. ఇది హరికథకు దక్కిన గౌరవంగా..కళాకారులను ప్రోత్సహించడానికి ఇస్తున్న బహుమతిగా భావిస్తున్నా.
-పద్మాలయ ఆచార్య, హరికథా కళాకారిణి


బాధ్యత పెంచింది..

dr-amma-sridevi
అమ్మ అనే అనాథ వృద్ధాశ్రమాన్ని నడుపుతున్నా. హన్మకొండలో ఈ ఆశ్రమం ఉంది. 2014 నుంచి 350కి మందికి పైగా నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాను. వాళ్లు చనిపోతే వారికి దహనసంస్కారాలు కూడా నిర్వహిస్తున్నా. ప్రస్తుతం 100మంది మా ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు. ఇది కాకుండా.. ఫంక్షన్ హాల్‌లో మిగిలిన ఆహారాన్ని రోడ్ల మీద ఉన్న నిరాశ్రయులకు, మురికి కాల్వల ఉన్నవాళ్లకు పంచి పెడుతుంటా. ఎవ్వరూ ఆకలితో చనిపోవద్దనేది నా ఆలోచన. అలాగే మతిస్థిమితం లేని వారిని ఆసుపత్రులో చేర్పిస్తుంటాం. నా సేవలకు డాక్టరేట్‌ని కూడా అందుకున్నా.
-డాక్టర్ అమ్మ శ్రీదేవి, సోషల్ సర్వీస్


నాన్నే స్ఫూర్తి..

boddapati-aishwarya
మనల్ని చూడగానే నలుగురూ గుర్తించి అభినందించేలా యూనిఫాం ఉన్న రంగాన్ని ఎంచుకోవాలన్నది నా కల. మా నాన్న ప్రభాకరరావు సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్‌లో పని చేసేవారు. ఆయనే నాకు స్ఫూర్తి. ప్రపంచంలో ఎవరూ చేయలేని సాహసాన్ని చిన్న పడవ వేసుకొని సప్త సముద్రాలను చుట్టి వచ్చాం. ఆ ఆరుగురు మహిళల్లో తెలంగాణ నుంచి ఉన్నది నేను ఒక్కదాన్నే. 2011లో పోర్టుబ్లెయిర్ ఆర్కిటెక్ట్ విభాగంలో ఉద్యోగం వచ్చింది. సముద్రం మధ్యలోకి షిప్పులు పనిచేయకపోతే వెళ్లి బాగు చేసి వచ్చేదాన్ని. ఇప్పటివరకు 2017లో నారీశక్తి అవార్డ్, నవ్‌సేన మెడల్ ఫర్ గ్యారెంట్రీ డిక్లేర్ చేశారు. టిన్‌జెన్ నార్కే ఫర్ అడ్వెంచర్ అవార్డు కూడా దక్కింది. ఈ సంవత్సరం మన ప్రభుత్వం నన్ను గుర్తించి ఈ అవార్డు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది.
-బొడ్డపాటి ఐశ్వర్య, డిఫెన్స్ సర్వీస్


ఆ సాహిత్యమే నడుపుతున్నది..

suddala-bharathi
నేను ప్రజాకవి సుద్దాల హన్మంతు గారి కూతురిని. మా ఇంట్లోనే పుట్టింది పాట. అక్షరాభాస్యం చేయకముందు నుంచే వేదికల మీదకి ఎక్కి ఎన్నో అవగాహనా కార్యక్రమాల మీద పాటలు పాడాను. పెండ్లయ్యాక మా అత్తింటి వాళ్లు కూడా నన్ను ఏ రోజు ప్రొగ్రామ్‌లు చేస్తుంటే ఆపలేదు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యలో కూడా పనిచేశా. మా నాన్న, అన్న సుద్దాల అశోక్‌తేజ రాసిన సమాజానికి ఉపయోగపడే పాటలు నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ధూంధాం ప్రొగాంలో కూడా పాల్గొంటున్నా. ఎన్నో యేండ్ల నుంచి వినిపిస్తున్నా రాని గుర్తింపు.. నా తెలంగాణ గుర్తించినందుకు ఎంతగానో సంతోషంగా ఉంది. ఈ మట్టిలో పుట్టినందుకు నాకెంతో గర్వంగానూ ఉంది.
-సుద్దాల భారతి, సింగర్


ఉపయోగకరమైన రచనలు..

rachana
నేను సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం దుమాల గ్రామంలో పుట్టాను. 15 యేండ్లుగా హెల్త్ జర్నలిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్నాను. 2004లో ఆంధ్రజ్యోతిలో జర్నలిస్టుగా ప్రస్థానం మొదలుపెట్టాను. నమస్తే తెలంగాణ దినపత్రికలో ఎదిగాను. ప్రజా ఉపయోగకరమైన పలు రకాల ఫీచర్లను రాసి సామాజిక చైతన్యానికి నా వంతు కృషి అందించాను. హెల్త్‌కి సంబంధించి ఎన్నో అంశాలపైన వెయ్యికి పైగా ఆర్టికల్స్ రాశాను. ప్రస్తుతం 10 టీవీలో చీఫ్ సబ్‌ఎడిటర్‌గా, హెల్త్ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నా. ఆరోగ్యనిధితో పేరుతో 300 పేజీల సమగ్ర ఆరోగ్య సమాచార పుస్తకాన్ని తీసుకువచ్చాను. నా ఇన్ని యేండ్ల కృషికి గుర్తింపు రావడం ఎంతో సంతోషంగా ఉంది.
-రచన, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్


22 యేండ్ల కృషికి ఫలితం..

yashoda
నాది మహబూబ్‌నగర్. డిగ్రీ అయ్యాక హైదరాబాద్ వచ్చాను. బోఫోర్స్ కుంభకోణం గురించి కథనం చదివా. జర్నలిస్ట్ అయితే ఎలాంటి వాటినైనా వెలికి తీసి నిజాలను బయటపెడతారని అనిపించింది. ఆ రోజే జర్నలిస్ట్ అవ్వాలని నిర్ణయించుకున్నా. నేటి నిజం అనే పత్రికలో నా ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత సుప్రభాతం, ఆంధ్రప్రభలో బ్యూరో రిపోర్టర్‌గా చేశా. అది చాలెంజింగ్‌గా అనిపించింది. నవ తెలంగాణ మొదటి నుంచి ఫీచర్ రిపోర్టర్‌గా పనిచేస్తున్నా. ఎన్నో మహిళా సమస్యలపై ఎన్నో స్టోరీలు చేశా. మన రాష్ట్రం వచ్చాక అయినా నా 22యేండ్ల కృషికి ఫలితం దక్కిందని సంతోషంగా అనిపిస్తుంది. డెవలప్‌మెంట్ జర్నలిజం మీద కచ్చితంగా కృషి చేస్తా.
వంగ యశోదారాణి,
-ప్రింట్ మీడియా జర్నలిస్ట్


ఆవకాయ నుంచి అంతరిక్షం దాకా..

jyoti-valaboju
నేను పుట్టి, పెరిగింది, మెట్టింది.. గిట్టాలనుకున్నది కూడా హైదరాబాద్‌లోనే. నేను రచయిత్రిని, బ్లాగర్‌ని, మ్యాగజైన్ ఎడిటర్‌గా కూడా వ్యవహరిస్తున్నా. నాకు ఈ అవార్డు వచ్చింది వ్యాపార రంగంలో. నేను ప్రస్తుతం జె.వి. పబ్లికేషన్ ద్వారా 145 పుస్తకాలను పబ్లిష్ చేశాను.వాటిలో ఎక్కువగా మహిళా రచయితల పుస్తకాలే ఉన్నాయి. పబ్లిషింగ్ సర్వీస్ కూడా చేస్తా. ప్రింటింగ్‌కి సంబంధించిన పని మొత్తాన్ని కూడా చేసి ఇస్తాను. పుస్తకాలను మార్కెటింగ్, సమీక్షలకు పంపడం కూడా చేస్తుంటా. ఆడవాళ్లు అనుకుంటే సాధించలేనిది ఏమీలేదు. ఆవకాయ నుంచి అంతరిక్షం దాకా ఆడవాళ్లు అన్ని రంగాల్లో రాణించాలని కోరుకుంటున్నా. నాకు అవార్డు వచ్చిన విషయం నా మిత్రుల ద్వారా తెలిసింది. చాలా ఆశ్చరపోయా. తెలంగాణ ప్రభుత్వానికి నా ధన్యవాదాలు.
-జ్యోతి వలబోజు, ఎంటర్‌ప్రెన్యూర్


చదువుతాననే అనుకోలేదు..

prof-geeta
చిన్నప్పుడు నా ఆప్షనల్ సబ్జెక్ట్ పెయింటింగ్. తర్వాత జేఎన్‌టీయూలో అప్లయిడ్ ఆర్ట్ చేశా. ఆ తర్వాత అక్కడే జాబ్ రావడంతో ప్రిన్సిపల్‌గా పనిచేసి.. మరో సంవత్సరంన్నరలో రిటైర్ అవ్వబోతున్నా. నేను అసలు చదువుతానని అనుకోలేదు. మా తల్లిదండ్రులకు నన్ను చదివించే స్థోమత లేదు. అయినా నేను మంచి ర్యాంక్ సాధించి పార్ట్‌టైమ్ జాబ్ చేస్తూ స్టడీస్ కంటిన్యూ చేశా. ఆ కష్టం ఎక్కడికీ పోలేదనిపిస్తుంది. ఇప్పటిదాకా బెస్ట్ టీచర్ అవార్డ్, రాజీవ్‌గాంధీ, ఇందిరాగాంధీ, వికాస్ రత్న పురస్కార్ అవార్డులు అందుకున్నా. అసలు ఈ అవార్డు వచ్చిందని చెప్పినప్పుడు నమ్మకం కలుగలేదు. అందరూ ఫోన్‌లు చేసి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఎంతో సంతోషంగా ఉంది.
-ప్రొఫెసర్ గీత, పెయింటింగ్

womens-day1
కమ్మరి సరస్వతి పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నది. గిరిజనుల ఆరోగ్య సమస్యలపై కృషి చేస్తున్న ఆప్కా మల్లురమ్మకు, గిరిజన హక్కులపై పోరాడుతున్నందుకు కోడప తుక్కుబాయికి ఈ సందర్భంగా అవార్డులు దక్కాయి. ఈ ముగ్గురు సామాజిక రంగంలో కృషి చేసినందుకుగాను ఈ రోజు అవార్డును అందుకోబోతున్నారు.

579
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles