మ్యూచువల్ ఫండ్స్ ఆకర్షణీయం


Sat,December 22, 2018 01:16 AM

ఈ ఏడాది దేశీయ మ్యూచువల్ ఫండ్స్ జోరును ప్రదర్శించాయి. మదుపరులు పెట్టుబడులపట్ల అమితాసక్తిని కనబరిచారు. గత నెల నవంబర్‌లో మ్యూచువల్ ఫండ్స్‌ల్లోకి వ్యవస్థీకృత పెట్టుబడి ప్రణాళికల్లో (సిప్) భాగంగా దాదాపు రూ.8,000 కోట్ల నిధులొచ్చాయి. 2017 డిసెంబర్‌లో ఇవి రూ.6,222 కోట్లకే పరిమితమవగా, అంతకుముందు ఏడాది 2016లో రూ.3,973 కోట్లుగానే ఉన్నాయి. వ్యయాలు తగ్గుముఖం పట్టడంతో మదుపరులు పెట్టుబడులకు ముందుకొచ్చారు. అయితే ఈ ఏడాది మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు ఒక్కటే చేదు వార్తగా చెప్పుకోవచ్చు. అదే ఈక్విటీ ఫండ్లపై దీర్ఘకాలిక మూలధన లాభాల (ఎల్‌టీసీజీ) పన్ను. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2018-19)గాను ఈ ఏడాది మొదట్లో పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రకటిస్తున్న సందర్భంగా ఎల్‌టీసీజీని మళ్లీ తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. ఎల్‌టీసీజీ కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొన్నా.. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల ప్రవాహం మాత్రం కొనసాగింది. ఈ నెల 14 నాటికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 5.6 శాతం మాత్రమే పెరుగగా, లార్జ్-క్యాప్ ఫండ్స్ 4 శాతం పడిపోగా, మిడ్-క్యాప్ ఫండ్స్ 14 శాతం, స్మాల్-క్యాప్ ఫండ్స్ గరిష్ఠంగా 21 శాతం క్షీణించాయి.
mutual-funds

తగ్గిన వ్యయభారం

ఈ ఏడాది పన్నులతో కాస్త ఇబ్బందిపడ్డ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు.. వ్యయభారం తగ్గడంతో ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం వ్యయ నిష్పత్తిలో భాగంగా మ్యూచువల్ ఫండ్స్‌కు చెల్లించే మొత్తం ఖర్చు గణనీయంగానే తగ్గింది మరి. ఇంతకుముందు మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు 15కుపైగా అగ్రశ్రేణి నగరాల నుంచి వచ్చే పెట్టుబడులకు ఇన్సెంటీవ్‌గా మొత్తం వ్యయ నిష్పత్తి పరిమితులపై 30 బేసిస్ పాయింట్లకుపైగా వసూలు చేసేవి. కానీ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కఠినతరం చేసిన నిబంధనల ప్రకారం 30కిపైగా పట్టణాల నుంచి కొత్త నిధులు అందితేనే మ్యూచువల్ ఫండ్స్ సంస్థలకు అదనపు చార్జీలను వసూలు చేసే అవకాశం ఉన్నది. అంతేగాక రిటైల్ పెట్టుబడులకు మాత్రమే ఈ చార్జీలను వసూలు చేయాలి. దీంతో మదుపరులపై పెట్టుబడులకు సంబంధించి వ్యయభారం తగ్గగా, అది మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణ ఆస్తులను భారీగా పెరిగేందుకు దోహదపడింది.

పన్నుల దెబ్బ

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, డైరెక్ట్ ఈక్విటీస్ కోసం ఎల్‌టీసీజీని మళ్లీ తెరపైకి తెచ్చింది మోదీ సర్కారు. 2004కు ముందు ఈక్విటీస్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌పై ఎల్‌టీసీజీ ఉండగా, ఆ తర్వాత దాన్ని రద్దు చేశారు. దీంతో స్టాక్ మార్కెట్లకు కొత్త జోష్‌నిచ్చినైట్లెంది. అయితే ఈ ఏడాది బడ్జెట్‌లో మళ్లీ దాన్ని కేంద్రం ప్రవేశపెట్టగా, సెస్సుతో కలిపి 10.4 శాతంగా నిర్ణయించారు. దీంతో మదుపరులు ఒక్కసారిగా భయాలకు లోనవగా, స్టాక్ మార్కెట్లూ భీకర నష్టాలకు గురయ్యాయి. ఈ క్రమంలో మ్యూచువల్ ఫండ్స్ కూడా కొన్ని ప్రతికూలతలను ఎదుర్కొన్నాయి. రూ. లక్ష వరకు మూలధన లాభాలపై ఎల్‌టీసీజీ మినహాయింపుండగా, ఈ ఏడాది జనవరి 31దాకా అన్ని దీర్ఘకాలిక పెట్టుబడి లాభాలకూ కేంద్రం ఈ ప్రయోజనాన్ని కల్పించింది. కాగా, ఎల్‌టీసీజీతోపాటు డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్‌నూ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తెచ్చింది. ఎల్‌టీసీజీని తప్పించుకునేందుకు డివిడెండ్‌ల పేరిట మదుపరులు వేసే ఎత్తులను చిత్తు చేసేందుకే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్‌ను తీసుకువచ్చింది.

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభం

ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్), దానికున్న పలు అనుబంధ సంస్థల క్రెడిట్ రేటింగ్ దిగజారిపోవడం డెబ్ట్ ఫండ్ ఇన్వెస్టర్లను భయాలకు గురిచేసింది. డెబ్ట్ ఫండ్స్ ఈ సంస్థల్లో పెట్టుబడులు పెట్టడమే ఇందుకు కారణం. ఆయా సంస్థల షేర్ల విలువలు క్షీణించడంతో డెబ్ట్ ఫండ్స్ ఆధ్వర్యంలోని నికర ఆస్తుల విలువలూ పడిపోయి మదుపరుల్లో ఆందోళనలు చెలరేగాయి. దీంతో పెట్టుబడుల ఉపసంహరణ వైపునకు వెళ్లారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది రూ.1.62 లక్షల కోట్ల పెట్టుబడులు వెనుకకుపోయాయి. చివరకు సెబీ జోక్యం చేసుకోవాల్సి రాగా, మదుపరులకు కొంత ఊరటనిచ్చింది. ఈ-కేవైసీలో భాగంగా మ్యూచువల్ ఫండ్స్.. కస్టమర్ల ఆధార్‌ను పరిగణనలోకి తీసుకోరాదని సెప్టెంబర్‌లో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

అవగాహనతోనే ఆకర్షణీయం

రెండు దశాబ్దాలకుపైగా కాలం తర్వాత మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో ఈ ఏడాది మదుపరుల్లో ఓ నిర్దిష్టమైన అవగాహన ఏర్పడిందని నిపుణులు అంటున్నారు. అంతకుముందు స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు భయపడి మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల వైపు చూడని మదుపరులు.. ఇప్పుడు ధైర్య ంగా పెట్టుబడులను పెడుతున్నారని గుర్తుచేస్తున్నారు. దీనంతటికీ కారణం మదుపరుల్లో పెరిగిన అవగాహనేనని వారంటున్నారు. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ తీసుకున్న చర్యలూ ఇందుకు దోహదపడ్డాయని క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈవో జిమ్మీ పటేల్ అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది కూడా ఇదే దూకుడుతో మదుపరులు ముందుకు సాగాలని, మరిన్ని పెట్టుబడులతో భారీ లాభాలను అందుకోవాలని ఆకాంక్షించారు.

625
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles