మెదడుకు ఆపరేషన్ చేయించుకోవచ్చా?


Fri,February 1, 2019 12:18 AM

నా వయస్సు 45 సంవత్సరాలు. నేను ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైతే హాస్పిటల్‌లో చేర్చారు. పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. నా మెదడులో గడ్డలు ఏర్పడ్డట్లుగా నిర్ధారించారు. సర్జరీ చేసి వాటిని తీసేయాలన్నారు. ఇది సాధ్యమవుతుందా? మెదడుకు ఆపరేషన్ అంటే నాకు భయంగా ఉంది. చేయించుకోవచ్చా? సాధారణ ఆపరేషన్ కాకుండా స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అనే అధునాతన పద్ధతిలో చేయించుకోవాల్సిందిగా వాళ్లు సిఫారసు చేశారు. ఇంతకూ దీనిని ఎలా చేస్తారు? సాధారణ ఆపరేషన్ కంటే ఇది మెరుగైందా? దేనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది దయచేసి తెలుపగలరు.
-జే సుమలత, మేడిపల్లి, వరంగల్

Councelling
సుమలత గారూ.. సమస్యను బట్టి మెదడుకు కూడా ఆపరేషన్లు చేస్తారు. అన్నింటి మాదిరిగానే ఇది కూడా ఉంటుంది. దీని గురించి ఎలాంటి అనుమానం అవసరం లేదు. ఇక స్టీరియోటాక్టిక్ రేడియోసర్జరీ విషయానికి వస్తే.. ఇది అత్యంత ఆధునికమైంది. సాధారణ మెదడు ఆపరేషన్లలో మాదిరి దీంట్లో తలపై కోతలు.. గాట్లు ఏర్పడవు. రక్తం కోల్పోవటం ఉండదు. సర్జరీ కోతల వల్ల కొన్నిసార్లు వచ్చే ఇన్ఫెక్షన్లకు ఆస్కారం లేదు. సంప్రదాయ మెదడు ఆపరేషన్లలో కొన్నిసార్లు గడ్డ తాలూకు భాగం మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది. దీనిలో అలా జరగదు. గడ్డ (ప్రత్యేకించి కాన్సర్) శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించే అవకాశం ఉండదు. వయస్సులో పెద్దవాళ్లు, ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నవారికి స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అత్యంత అనుకూలమైంది. ఎక్కువ సమయం పాటు సాగే రేడయేషన్ థెరపీలా కాకుండా ఇది తక్కువ వ్యవధిలో పూర్తవుతుంది. అధిక మొత్తంలో, ఖచ్చితమైన లక్ష్యంతో ప్రసరింపజేసే రేడియేషన్‌తో 1-5 రోజులపాటు ఈ సర్జరీ చేస్తారు. దీంట్లో భాగంగా బయట ఉత్పత్తిచేసిన రేడియేషన్‌ను ఉపయోగించి లక్ష్యంగా పెట్టుకున్న గడ్డలోని కణాలను నిర్వీర్యం చేస్తారు. ఈ ఆపరేషన్ నాలుగు దశలుగా సాగుతుంది. మొదట ఓ ప్రత్యేకమైన మాస్క్‌ను తలకు తొడుగుతారు. తర్వాత సీటీ.. ఎంఆర్‌ఐ లేదా ఏంజియోగ్రఫీ ద్వారా ఇమేజేస్ తీసుకొని చికిత్స చేస్తారు. సర్జరీ చేయించుకున్న తరువాత హాస్పిటల్లోనే ఉండిపోవడం కాకుండా వెంటనే డిశ్చార్జి అయ్యేంత సులువైన ప్రక్రియ ఇది.

డాక్టర్ రవి సుమన్‌రెడ్డి
సీనియర్ న్యూరో సర్జన్
యశోద హాస్పిటల్స్
సోమాజిగూడ

923
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles